గురువు - ఆచార్యుడు
మనం సాధారణంగా వాడుకలో రెండు పదప్రయోగాలు చేస్తుంటాం. ఇవి మనం పర్యాయపదాలుగా భావించినా, పండితులు మాత్రం ఈ రెంటినీ కంచెం భిన్న దృక్పథంలోనే చూస్తారు. ఆ పదములే గురువు, ఆచార్యుడు అనునవి.
ఆచార్యపదం, ’ఆచరణ’, ’ఆచార’, అనే పదములకు సంబంధించినది. చర అంటే నడచుట. చరిత, చరిత్ర అంటే నడత. దేశ చరిత్ర అంటే ఒక దేశంలో ఏమేమి జరిగిందో చెప్పే పుస్తకం. జీవిత చరిత్ర అంటే ఒక మనిషి పుట్టినదాది, ఏమేమి చేశాడో చెప్పే కథ. ఆచారం అంటే ఒక సమూహంలోని వాడుకలు, నడవడికలు.
ఆచార్యుడు అంటే జీవితంలో మనం ఏవిధంగా నడుచుకోవాలో, ఏ విధమైన నైతిక ప్రవర్తన, శిష్టాచారము అనుసరించాలో చూపే మార్గదర్శకుడు. అహింస, సత్యము ఇలాంటి సామాన్య ధర్మములు మనకున్నవి. మన మతంలో ఎన్నో సంప్రదాయములున్నవి. ఆచారములున్నవి. ఒక్కొక్క సంప్రదాయానకీ వేర్వేర్ శాస్త్రాలున్నవి. వైష్ణవులది ఒక ఆచారం, మాధ్వులకు మరొక ఆచారం, వీరితోబాటు నింబార్క, చైతన్య సంప్రదాయములున్నవి. వారి వాడుకలు, ఆచారములు, వేరు. ఒక శైవ సంప్రదాయంలోనే ఎన్నో శాఖలున్నవి. వీరశైవం, కాశ్మీర శైవం, పాశుపతం, సిద్ధాంతము - ఇత్యాది భేదములున్నవి. ఇదేవిధంగా వైష్ణవులలోనూ, ఏకాంతికులు, వైఖానసులు, పాంచరాత్రులు వంటి విభాగాలున్ని. అద్వైతులు, ఆచార విషయాలలో స్మృతులను పాటిస్తారు.
ఆచార్య పదాన్ని వివరించే ఒక శ్లోకమున్నది. "ఆచినోతిహి శాస్త్రార్థాన్ ఆచారే స్థాపయత్యపి. స్వయం ఆచారతేయశ్చ తం ఆచార్యం ప్రచక్షతే."
ఎవడైతే శాస్త్రార్థములను చక్కగా వివరిస్తున్నాడో, (ఇతరులకు వానిని బోధిస్తున్నాడన్నది గర్భితం) ఇతరులను ఆ ఆచారములను అనుష్ఠంపచేస్తున్నాడో అంతటితో వదలక స్వయముగాఆ ఆచారములను తాను కూడా అనుష్ఠిస్తున్నాడో అతడే ఆచార్యుడు. అనగా ఇతరులకు బోధచేయడం, వానిని స్వయముగా ఆచరించడం, ఈ రెండూ చేసే వాడే నిజమైన ఆచార్యుడు.
మనం ఆచారం, అనుష్ఠానం అంటూ ఉంటాం. అవి పరస్పర సంబంధము కలవి. శాస్త్రోక్తములైన ఆచారముల ననుసరించేవే సంప్రదాయములు. శాస్త్రములనేవి విధి నిషేధాలను నిర్ణయించే గ్రంథాలు. సంప్రదాయములు అనూచానంగా వచ్చే వాడుకలు, ఆచారాలు. వైదికమతము ఆధారంగా ఏర్పడినవే శాంకర, రామానుజ, ఇతర వైదిక సంప్రదాయములు. శాస్త్రములు సామాన్యంగా వున్నా సంప్రదాయాలు వేరుగా వుండవచ్చు. ఎన్నో దేశాచారాలున్నవి. ఒక్కొక్క ప్రాంతానికే నిర్దేశించిన కొన్ని వాడుకలుంటాయి. కొన్ని కులముల వారు పాటించే ఆచారములున్నాయి. అవి కులాచారములు. కొన్ని ఆచారములు ఆయా కుటుంబములకు పరిమితమై ఉండడం కూడా కద్దు. ఇట్లు వివిధ కులాచారలూ, దేశాచారాలూ ఉండడం మనం చూస్తున్నాం.
ఈవిధంగా ఒక నియమ జీవనం చేస్తూ, శాస్త్రోక్తమైన ఆచార అనుష్ఠానాలను పాటిస్తూ, ఇతరుల బోధిస్తూ, వారిచే వాటని అనుష్ఠింపచేస్తూ, తాను ఇతరులకు ఒరవడిగా, ధర్మమూర్తిగా వున్న వాడే ఆచార్యుడు. అట్టి ఆచార్యునికి ఒక శిష్యుడు ఉండాలి. ఆ శిష్యునికి తన సంప్రదాయ ధర్మములను బోధించి అనుష్ఠింపచేయాలి. అతడు విద్వాంసుడుగా వుండాలి. విద్వత్తు లేకపోతే అతడు ఇతరులకు ఏమి బోధ చేయగలడు? తను అనుచరుల ధర్మసందేహాలకు అతడు జవాబు చెప్పాలి. అట్టివాడే ఆచార్యుడనిపించుకొంటాడు.
ఈ కాలంలో ఆచార్యులు బళ్ళు, కళాశాలలో వుండే అధ్యాపకులు. వారికి ఆచరణలో కానీ, బోధనలో ఏవిధమైన ధర్మమూ లేదు. పూర్వకాలంలోనూ కళలకు ఆచార్యులుండే వారు. ద్రోణాచార్య కృపాచార్యులు ధనుర్వేద ఆచార్యులు. వ్వారు వారి కళలలోనే కాక సంప్రదాయములోను ధర్మంలోనూ కుశలులు. వారి అనుష్ఠానాలకే వారు గౌరవింపబడినారు.
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
No comments:
Post a Comment