Thursday, January 27, 2022

నేటి మంచిమాట. మానవత్వం.

నేటి మంచిమాట.

తప్పులు చేయని మనిషంటూ ఉండడు. తప్పులెన్నువారు తమ తప్పులు ఎరగాలి. లేదంటే ఇతరులకు నీతిబోధలు చెయ్యడానికి పూనుకోకూడదు. అనుకోకుండా అందరికీ మంచి చెప్పే అవకాశం ఒక వేదికగా లభించినప్పుడు దాన్ని ఎంతో ఆదర్శవంతంగా తీర్చిదిద్దుకోవాలి. నీతి నీకేగాని నాకు కాదు అన్నట్లు ఉండకూడదు. ఏమీ ఎదురు ఆశించకుండా చరాచర ప్రకృతిలో ఎన్నో జీవులు ఇతరుల కోసం బతుకుతున్నాయి. వాటి నుంచి ఎంతో నేర్చుకోవాలి.

మనం చెప్పే స్థానంలో ఉన్నప్పుడు, ఆచరణలో గొప్పదనాన్ని నిరూపించాలి. రామకృష్ణ పరమహంస దగ్గరకు తన కొడుకును తీసుకువెళ్ళింది ఒక తల్లి. ఆ పిల్లవాడు ప్రతి రోజూ పంచదార తింటున్నాడు. మానమంటే మానడం లేదు. మీరు చెబితే వింటాడు చెప్పండి అని ఆ పిల్లాడి తల్లి కోరింది. దానికి పరమహంస- వారం తరవాత ఆ పిల్లాడిని తీసుకురమ్మని చెప్పారు. ఆయన చెప్పినట్లే వారం తరవాత తీసుకు వెళ్ళి ఆయన ముందు నిలబెడితే- తీపి తినకు, ఒంటికి మంచిది కాదని చెప్పారు. ఈ విషయం అప్పుడే చెప్పొచ్చుకదా స్వామీ అని ఆ పిల్లాడి తల్లి అడిగింది. ‘లేదమ్మా... నాకూ ఆ అలవాటుంది. దాన్ని నేను మానుకొని, వాడికి చెప్పాను’ అన్నారాయన. అది ఆదర్శపూర్వకమైన బోధ. అందుకే ఆయన పరమహంస.

చెప్పడం అనేది మొదలు పెట్టేముందే ఏం చెబుతున్నాం, మనమెలా ఉంటున్నాం అని స్వీయ పరిశీలన, పరిశోధన చేసుకోవాలి. ఎవరైనా సరే. శ్రీకృష్ణుడు ప్రతిరోజూ అంతఃపురం లోపల ఏదో చేస్తుండేవాడు. అదేమిటో ఎవరికీ తెలియలేదు. అదొక రహస్యం. దాన్ని కనిపెట్టాలని కొందరు అనుకుని, ఆ సమయంలో అక్కడికి వెళ్లారు. చూశారు... ఆయన ఎంతో భక్తిగా విఘ్నేశ్వరుడికి పూజ చేస్తున్నాడు. పరమాత్మకు దేవతాపూజ అవసరమా అనుకున్నారు. కాని, మహానుభావులు ఏది చేస్తే అదే లోకం అనుసరిస్తుంది. శ్రీకృష్ణుడే విఘ్నేశ్వరుడి పూజ చేస్తున్నప్పుడు, ఆ పూజ మనకూ ఎంతో ఆచరణీయం అవుతుంది. తలమీద పెట్టుకుంటాం. మంచి చేస్తూ మంచిని చెప్పేవాళ్లంటే, లోకం ఎక్కువగా గౌరవిస్తుంది.


సంగీత విద్యాంసుడు తనకు అభ్యాసం అవసరం లేదని ఎవరితోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ అనడు. ఎందుకంటే, ఒక్కరోజు ఆయన అభ్యాసం లేకుండా ఉన్నా- అతడి కచేరిలో అది స్పష్టంగా తెలిసిపోతుంది. నిత్యకృషీవలురు, నిరంతర విద్యార్థుల్లా ఉంటేనే ఇతరులకు మనం చెప్పే విషయాలు, చేసే బోధలు, నేర్పించే పాఠాలు శాశ్వతంగా ఉండిపోతాయి. మనం దారి తప్పి, ఇతరులకు దారిని చూపించలేం. అది జరగని పని. అంధుడి వెనక మరో అంధుడు అనుసరించడంలా ఉంటుంది.

బంగారం లోంచి తీసిన తీగ బంగారంలాగే ఉంటుంది. రాగి అంశ బంగారం కాదు. మనం ఆచరించి, అనుభవించినది ఎంతో గౌరవంగా, మర్యాద పూర్వకంగా నమ్రతతో చెప్పాలి. నిష్ణాతుడైన వైద్యుడే మంచి వైద్యం చెయ్యగలడు. అనుభవం ఉండాలి. ఆచరణ ఉండాలి. ముఖ్యంగా నిబద్ధత ఉండాలి. చిలకపలుకులు ఎవరైనా పలుకుతారు. పిల్లి నోట చిలక పడినప్పుడు దాని అసలు అరుపు కీచు కీచుమని వినపడుతుంది.

ఎక్కువ మంది మనం చెప్పే మాటలు సత్యమని నమ్ముతున్నప్పుడు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అనుభవం వస్తున్నకొలదీ నదుల్లాంటి మనం సముద్రంగా మారిపోవాలి. చేతులు చాచి అందర్నీ ఆహ్వానించాలి. అదే మానవత్వం!

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment