Thursday, January 27, 2022

నేటి జీవిత సత్యం. ఆత్మవిశ్వాసం

నేటి జీవిత సత్యం. ఆత్మవిశ్వాసం

కొందరు వ్యక్తులుంటారు. నిండుగా కనిపిస్తూ, మనసారా నవ్వుతూ, హాయిగా జీవిస్తూ చలాకీగా కనిపిస్తారు. హుందాగా సాగే వారి జీవితానికి కారణం ఏమిటి? చాలా మందిలో లేనిది, వారికి ఉన్నది ఏమిటని పరిశీలిస్తే- అలాంటి ఆత్మ సంతృప్తి గల వ్యక్తులు అందం కలిగి ఉండవచ్చు. ధనం, హోదా, అధికారం కలిగి ఉండవచ్చు. ఆస్తిపాస్తులతో పాటు విద్యావంతులై ఉండవచ్చు. లేదా గొప్ప మేధావుల కుటుంబంలో జన్మించి ఉండవచ్చు. ఈ కారణాలన్నీ గొప్ప వ్యక్తుల ఆత్మ విశ్వాసానికి మూలమని సామాన్యంగా మనం భావిస్తాం! కానీ చిత్రమేమంటే ఈ అంశాలన్నీ వారి ఆత్మ విశ్వాసానికి కారణం కావచ్చు, కాకపోవచ్చు కూడ.

నిజానికి ఆత్మ పట్ల నమ్మకం, విశ్వాసం ప్రోది చేసుకున్న వ్యక్తి ఆత్మవిశ్వాసం సంపూర్ణంగా కైవసం చేసుకోవచ్చు. విచిత్రమేమంటే ఆత్మ, దేవుడు వంటి విషయాల పట్ల ఏ మాత్రం నమ్మకం, ఆసక్తిలేని వ్యక్తులూ అనేక కారణాలవల్ల సంపూర్ణ ఆత్మసంతృప్తితో జీవితం గడిపి తమతమ గమ్యాలకు చేరుకొని విశేషంగా లబ్ధి, ప్రాచుర్యం పొందిన ఘటనలు ఈ లోకంలో అనేకం!

స్వార్థరహితమైన మనసు, ప్రవృత్తి, వ్యాపకం వంటివి మనిషి ధీరోదాత్తతకు ఉపకరణాలు. ఏ ప్రలోభాలకూ లొంగని స్వభావం వల్ల మనిషి ఆత్మవిశ్వాసం సంతరించుకుంటాడు. దైవం పట్ల ప్రత్యేక శ్రద్ధ, ఆకర్షణ లేకపోయినా తనలోని ‘నేను’ పట్ల గురి, నమ్మకం ఉన్న వ్యక్తి ఆత్మ విశ్వాస సంభూతుడే అవుతాడు.
మనిషిలోని మచ్చలేనితనం పదిమందిలో అతడికి గౌరవాన్ని ప్రసాదిస్తుంది. ప్రశంసలకు, సన్మానాలకు ఆశపడని అతీతుడు నిజానికి గొప్పవాడే!

ఏదో తెలియని పిరికితనం వల్ల మనిషి గౌరవాలను స్వీకరించకపోతే దాన్ని అతడి వినమ్ర స్వభావం కింద జమకట్టలేం! ప్రతిభ ఉండీ పిరికితనం వల్ల మనిషి చాలా పోగొట్టుకుంటాడు.

ధైర్యం మనిషి శక్తిని సాధించేందుకు ఉపకరణమవుతుంది. తదుపరి ఆభరణమవుతుంది. అలంకారమవుతుంది. ధీరజనులు, వారిలోని ధీరగుణానికి తమ మద్దతు ప్రకటించిన మహాపురుషుల్లో పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు, నేటియుగపు త్రివిక్రముడు అయిన స్వామి వివేకానంద ప్రముఖులు. యుద్ధభూమిలో అర్జునుడి పిరికితనాన్ని నిరసిస్తూ అతడికి ధైర్యాన్ని నూరిపోయవలసిన మహా అవసరాన్ని నొక్కి వక్కాణించిన గొప్ప సన్నివేశం అర్జున విషాదయోగం. పరమాత్మ ప్రబోధం తరవాత అర్జునుడు పిరికితనాన్ని వీడి ఆత్మవిశ్వాసాన్ని, దాని ప్రాశస్త్యాన్ని గుర్తెరిగి యుద్ధానికి ఉపక్రమించడం తదుపరి పరిణామం!

ఇనుప కండరాలు, ఉక్కు నరాలు సంతరించుకొని ఆత్మవిశ్వాస సంభూతులై జీవన సమరాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలని మార్గ నిర్దేశం చేసిన స్వామి వివేకానందుడి పాత్ర యువతను కలత నిదుర నుంచి లేపి జీవితంలో అజేయులై నిలిచేందుకు తోడ్పడేదే!

ఆత్మవిశ్వాసం అంటే నలుగురితో కలిసి మెలిసి ఉండక, గుంభనంగా ఆధిక్యత ప్రదర్శించడం కాదు. తనకున్న ఏ ఒక్క ప్రత్యేకత ఆధారంగానూ అహంకారం ప్రదర్శించి అందరిలోనూ తాను విభిన్నం, అధికం అని చాటుకోవడం కాదు. ఆత్మ విశ్వాసం ఓ బలవర్ధక పానీయం వంటిది. ఆ భావం పిరికితనాన్ని పారదోలుతుంది. విద్యార్జనకు, ఆరోగ్యసాధనకు తోడ్పడుతుంది. భిన్నత్వం గల సమాజంలో ఏకతా భావన సాధించేందుకు బలం ఇస్తుంది. ఆత్మ, పరమాత్మకు భిన్నంకాదు కాబట్టి ఆధ్యాత్మిక అంశంలో సైతం ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. ఆధునిక కాలంలో యువత కోరుకొనే ఎత్తులకు ఎదిగేందుకు ఉపకరణమవుతుంది. ఏ వయసువారైనా పట్టు సాధించవలసిన మహత్తర అంశం ఒక్క ఆత్మవిశ్వాసం మాత్రమే !

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment