Sunday, June 12, 2022

పాదసేవ

 పాదసేవ


జ్ఞాన భండారం మనిషి మస్తిష్కం కరుణ కురిపించేవి కళ్లు, మంచి బోధనలు చేసేది నోరు, సేవలు చేసేవి చేతులు, రక్షణ కల్పించేవి బాహువులు, అక్కున చేర్చుకునేది హృదయం శక్తిని, యుక్తిని, అనురక్తిని ఇచ్చేవి ఇతర అవయవాలు, వీటన్నింటి మూలాలు పాదాల్లో కేంద్రీకృతమై ఉంటాయని వైజ్ఞానిక శాస్త్రం చెబుతోంది. ఆ పాదాలు ఎల్లవేళలా భూమితో అనుసంధానమై ఉంటాయి. అన్ని శక్తులకు ఆలవాలమైన భూమి నుంచి నిత్యం వెలువడే సానుకూల తరంగాలు పాదాల్లోనే నిబిడీకృతమై ఉంటాయి. అంటే పాదాలు మనిషిలోని అన్ని శక్తులకూ ఆలంబనలు అందుకే పాదాలకు నమస్కరిస్తే మూర్తీభవించిన అన్ని లక్షణాలకూ ఏకకాలంలో నమస్కారం చేసినట్టే. అధర్వణ వేదంలో పాద నమస్కార విధులు, ప్రయోజనాల వివరణ ఉందన్నది వేదవేత్తలు చెబుతున్న మాట.


పెద్దలు మనకంటే ఎక్కువ కాలం ఈ భూమిపై జీవించారు. ఎక్కువ జ్ఞానాన్ని, అనుభవాన్ని గడించారు. అనేక శక్తులను కూడగట్టుకున్నారు. కాబట్టి, వారి పాదాలకు గౌరవసూచకంగా నమస్కరిస్తే వారి మార్గాన్ని అనుసరిస్తున్నామనే సంకేతాన్ని వారికి ఇచ్చినట్లు అవుతుంది. అది నిరహంకార తత్వానికి నిదర్శనం. అదీకాక ముఖం ఎదురుగా ముఖం ఉంచి మాట్లాడటం ఆహంకారం. కళ్లకెదురుగా కళ్లు పెట్టి చూస్తే ఆ తీక్షణత తట్టుకోవడం కష్టం. మిగిలిన అవయవాల వైపు చూడటం సంస్కారరాహిత్యం.. వీటన్నింటికీ ఏకైక పరిష్కారం పాద నమస్కారం. సీతమ్మవారి నగలను గుర్తించే సమయంలో లక్ష్మణుడు సీతాదేవి. పాద మంజీరాలు తప్ప మరి వేటినీ గుర్తు పట్టలేదు!. అంతేకాకుండా మన జ్ఞాన భాండా గారమైన శిరస్సును ఆ అనుభవజ్ఞుల పాదాలకు తాకించడం మన జ్ఞానాన్ని వారి అనుభవాలతో అనుసంధానం చేయ కోరుతున్నాను అనే భావానికి సంకేతం

అవుతుంది. అది శరణాగతి తత్వానికి సూచన పెద్దల పాదాలకు నమస్కరించడంలో శాస్త్రీయమైన కారణం మరొకటి ఉంది. మానవ శరీరంలోని నరాలు, మెదడు నుంచి మొదలై, శరీరమంతా వ్యాపించి, చేతులు/కాళ్ల వేళ్ల చివర్లలో ముగుస్తాయి. పాదాలకు నమస్కరించే వారి చేతివేళ్ళ ఆ శక్తి గ్రాహకాలుగా మారతాయి. అప్పుడు పెద్దవారి పాదాలు శక్తిదాయకాలుగా మారతాయి. పెద్దవారి హృదయం నుంచి సానుకూల శక్తితో నిండిన తరంగాల పరంపర ఆ పాదాల కొనల నుంచి చేతుల ద్వారా నమస్కరించే వారి శరీరంలోకి చేరతాయి. అవి మనసు మీద సానుకూల ప్రభావాన్ని చూపుతాయి.


పాదాలకు నమస్కరించడం వల్ల మానసిక శారీరక ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది. పండితుల అభిప్రాయం ప్రకారం, పాదాలను తాకడానికి ప్రధానంగా మూడు మార్గాలు ఉన్నాయి. ముందుకు వంగి పాదాలను తాకడం, మోకాళ్లపై కూర్చుని అవతలి వ్యక్తి పాదాలను తాకడం, నుదురు నేలను తాకించి చేసే సాష్టాంగ ప్రణామం. ఈ ప్రక్రియల ద్వారా పాదాలను తాకడానికి ముందుకు వంగిన కారణంగా వెన్ను, నడుము, మోకాళ్లు వంగి శరీరంలోని కీళ్లన్నీ సాగుతాయి. దీనివల్ల శరీరంలోని నరాలు, మెదడులోని నాడులు అన్నీ ఉత్తేజితం అవుతాయి. ఫలితంగా శారీరక మానసిక ఆరోగ్యం సుస్థిరంగా ఉంటుంది. పెద్దల పాదాలకు నమస్కరించే పద్ధతి భారతదేశంలో వేదకాలంలోనే

ప్రారంభమైంది.


సేకరణ. మానస సరోవరం 👏

No comments:

Post a Comment