Thursday, July 7, 2022

ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు! తన ఆవేదన...

 ఈ మధ్యన రికార్డుల నిర్వహణకి, అధికారుల విజిట్స్ కి అదనపు పనుల నిర్వహణకి చాలా భయపడాల్సి వస్తోంది.

 ఎంతంటే   సస్పెండ్ అయిపోతామేమో అన్నంత...


నిజంగా టీచింగ్ లోని అనుభూతిని ఆస్వాదించటం కన్నా , మరమనుషుల్లాగా రిజిష్టర్లు నిర్వహించటం, మీటింగ్ లకు హాజరవటం, వాట్సాప్ మెసేజ్ ల ఉత్తర్వులను భయం భయం గా చదివేసుకుని రేపు ఏ ప్లెక్సీ కట్టాలి, ఏఫొటో పెట్టాలి, ఏయాప్ ని డౌన్లోడ్ చేయాలి.....ఇదే నిద్రలో కూడా కలవరింత..  చాలా ఇష్టపడి బి.ఇడి చేసాను...కానీ నాకున్న పనిగంటలలో చదువు చెప్పే అవకాశం కోసం కక్కుర్తి పడాల్సి వస్తోందంటే అబధ్ధం కాదు.


నా బడిలో ...నా అందమైన  ఆలోచనలకేమాత్రం స్థానం లేదు. నేను, నా పిల్లలు కలిసి సమ్మర్ హిల్ పాఠశాలలోలాగా ప్రజాస్వామ్య విలువల సారంతో కలిసిపోయిన స్వేఛ్చా విద్యా కార్యక్రమాల రూపకల్పనకు అవకాశమే లేదు. ఏరోజు ఏకార్యక్రమం చేయాలో ఎక్కడో రూపకల్పన జరుగుతుంది. అక్కడినుంచి *అర్జెంట్* గా వాట్సాప్ గ్రూపులలో హెడ్మాష్టర్ల మెదడులోకి ప్రవేశిస్తుంది.


 అర్జంటు...అర్జంటుగా ఏవో రెండు ఫోటోలు కావాలని సిఆర్పీ నుంచి ఫోన్ వస్తుంది. యాప్ లో సమాచారం పెట్టలేదని మెసేజ్ వస్తుంది. చెప్పుకుంటూ పోతే.....భగవంతుడా నాలోని సున్నితమైన, అధ్భుతమైన టీచర్ చచ్చిపోయాడు. 


యాప్ లలో, వెబ్ సైట్ లలో సమాచారాన్ని నింపే కంప్యూటర్ ఆపరేటర్ , బియ్యం కోడిగుడ్లు పంచే కిరాణా వ్యాపారి, రిజిష్టర్లు రాసుకునే గుమాస్తా, నాడు-నేడు పనులు చేయించే కంట్రాక్టర్ ..   ఇలా ఎన్నో రూపాంతరాల మధ్య అసలైన అధ్భుతమైన టీచర్ అణగారిపోతున్నాడు. పుస్తకాల్లోని నాలెడ్జ్ ని పిల్లల మనసుల్లోకి అందంగా ఆవిష్కరిస్తూ తానే ఒక సైంటిస్ట్ లా, తానే ఒక రచయితగా, వక్తగా, శాస్త్రవేత్తగా , సర్వం తెలిసిన మహాజ్ఞానిలా పసిపిల్లల మనసుల్లో గొప్ప స్థానాన్ని అధిరోహించే టీచర్ కుంచించుకు పోతున్నాడు. 


రిజిష్టర్లు రాసుకోవటానికి సిఇసి గ్రూపుతో ఇంటర్మీడియట్ చదువు చాలు, గుడ్లు,బియ్యం పంచటానికి 5వ తరగతి చదువు చాలు, యాప్ లలో డేటా నింపటానికి డిప్లొమా చాలు....కానీ పిల్లలకు చదువుని బోధించటానికి మాత్రం సృజనాత్మక కలిగిన మేధావియైన  టీచర్ ఉండాలి. స్వతంత్రంగా ఆలోచిస్తూ పిల్లల్ని సహజమైన వాతావరణంలో అభ్యసనకు పురికొల్పే సమర్ధుడైన జాతి నిర్మాత కావాలి....

దురదృష్టమేమిటంటే  నేటి కాలంలో అలాంటి టీచర్స్ అరుదు.  ఎక్కడైనా ఉన్నా... ఈ వ్యవస్థలో పడి కొట్టుకుపోతూ రెక్కలు తెగిన జటాయువులా ....సహజశక్తిని కోల్పోతున్నారు. 


అధికారుల ఉత్తర్వులు, వాట్సాప్ మెసేజ్ లు అమలు చేసే కార్యకర్తల్లాగా టీచర్స్ మారిపోతున్నారు. అభినందన, ప్రశంస, ప్రోత్సాహం మరిచిపోయి షోకాజ్ నోటీసులు, సస్పెన్షన్లు, దబాయింపులతో ఉన్నతాధికారులు విద్యాశాఖను పోలీస్ శాఖలా మార్చేస్తున్నారు. దారుణ మైన ఒత్తిడి లో సహజమైన టీచర్ అంతర్గతంగా చచ్చిపోతున్నాడు. జాతి భవిష్యత్ ని చక్కదిద్దే ఉపాధ్యాయుడు మరమనిషిలా మారిపోతున్నాడు. వీలైతే రక్షించండి ! 


ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు!

No comments:

Post a Comment