మత్పరః.....🙏🌷
భరతనాట్యం చేసే కళాకారిణి నెత్తి మీద నీటి కలశాన్ని పెట్టుకొని చక్కగా హావభావాలు ప్రదర్శిస్తూ నాట్యం చేస్తుంది. తాళానికి అనుగుణంగా ఎంతగా నాట్యంలో లీనమైపోయినా ఆమె దృష్టి అంతా నెత్తి మీది నీటి కలశం పైనే ఉంటుంది. అంటే ఆమె లక్ష్యం నెత్తి మీద నీటి కలశంలో నుండి నీరు క్రింద పడిపోకూడదు అని. అలాగే కలశం కూడా పడిపోకూడదు అని. అందుకే ఆమె దృష్టినంతా లక్ష్యం మీదనే ఉంచుతుంది. బాణ ప్రయోగం చేసేవాడు తన దృష్టినంతా లక్ష్యం మీదనే ఉంచుతాడు. గురితప్పకుండా లక్ష్యాన్ని వేయాలనే పట్టుదలతో ఉంటాడు. మిగిలిన విషయాలేవీ అతడికి పట్టవు.
ద్రోణాచార్యుడు శిష్యుల విలువిద్యా పాటవాన్ని పరీక్షించటం కోసం ఒక చెట్టుమీద పక్షిబొమ్మనుంచాడు. అందరిని పిలిచి ఒక్కొక్కరితో బాణాన్ని సంధించమన్నాడు.🙏🌷 ధర్మనందనా.. పక్షి కనబడుతున్నదా..? అన్నాడు. ఆ! అన్నాడు ధర్మరాజు. కొమ్మ కనిపిస్తున్నదా..? అన్నాడు. ఆ అన్నాడు ధర్మరాజు. చెట్టు కనిపిస్తున్నదా..? అంటే ఆ కనిపిస్తున్నది అన్నాడు. సరే! నీవు లక్ష్యాన్ని ఛేదించలేవు పొమ్మన్నాడు. అలాగే దుర్యోధన దుశ్శాసనులను, నకుల సహదేవులను పిలిచి అడిగితే వారూ అలాగే చెప్పారు. అప్పుడు అర్జునుని పిలిచి శరసంధానం చేసిన తర్వాత, అవే ప్రశ్నలు అడిగాడు. పక్షి కన్ను కనిపిస్తున్నది. పక్షిగాని, కొమ్మగాని, చెట్టుగాని ఏమీ కనిపించటం లేదు అన్నాడు అర్జునుడు. సరే వెయ్ బాణాన్ని అనగా అర్జునుడు బాణాన్ని వేశాడు. అది పక్షి కంటికి తగిలింది. అంటే దృష్టి లక్ష్యం మీదనే ఉన్నది.🙏🌷
అలాగే మానవుని దృష్టి ఎల్లప్పుడు ఈశ్వరుని మీదనే ఉండాలి. ఈశ్వరుని లక్ష్యంగా పెట్టుకొని కర్మలు చెయ్యాలి. మనం ఏపని చేసినా అది మనను భగవంతునికి దగ్గర చేస్తుందా.. లేదా... అని ఆలోచించాలి. ప్రతి సందర్భంలోను మానవునికి ఎన్ని పనులు వున్న, ఎన్ని అవరోధాలు వున్న, మన ఆలోచనలు మాత్రం ఎల్లవేలల ఈశ్వరుని పైనే వుంచాలి... అదే మత్పరః...🙏🌷
సేకరణ
No comments:
Post a Comment