Wednesday, July 6, 2022

జీవితానికి సార్థకత

జీవితానికి సార్థకత

సకల సౌకర్యాలున్న అద్దె ఇంటిని వదిలిపెట్టాల్సి వస్తే దానిపై పెంచుకున్న వ్యామోహం వల్ల ప్రాణం విలవిల్లాడుతుంది. శరీరం కూడా అలాంటిదే! కానీ, ఎప్పటికైనా దాన్ని వదిలిపెట్టక తప్పదు. అందుకే శరీరంపై ఉన్న మమకారాన్ని జయించాలి. ఎందుకంటే, అదే మానవునికి శోకదాయకం, బంధకారణం అవుతున్నది. ఏ శరీరమైనా ఎప్పటికైనా పడిపోవాల్సిందే! ఈ యుగంలో మానవుల జీవితకాలం సుమారు వందేండ్లు అంటున్నాం. కానీ, పూర్వయుగంలో ఆయుర్దాయం వేల ఏండ్లుగా ఉండేది.
శతాబ్దాలు జీవించేవాళ్లు. ఎన్నేండ్లు బతికినా చివరికి దేహం వదలాల్సిందే! అలాంటప్పుడు దానిపట్ల ఇంత అభిమానం ఎందుకు?
వేల ఏండ్లు రాజ్యపాలన చేసిన శ్రీరామచంద్రుడి వంటి అవతార పురుషులు కూడా, శరీరాలు వదిలిపెట్టిన వారే! దాంతో పోలిస్తే మనం శరీరాలు వదిలిపెట్టడం అసలు విషయమే కాదు. కానీ, మనిషి మాత్రం జరామరణాలు జయించాలని, కలకాలం సశరీరంగా ఉండాలని ఆశపడుతూ ఉండటం హాస్యాస్పదం. ఆప్తులు ఎవరైనా దూరమైనప్పుడు, మనసులో వారి స్మృతులు తిరుగుతూ తెగ హైరానా కలిగిస్తాయి. ఆ వ్యక్తులు కూర్చున్నప్పుడు, నిలబడ్డప్పుడు, మాట్లాడినప్పుడు జరిగిన సంఘటనలన్నీ గుర్తుకువచ్చి బాధిస్తుంటాయి. నాలుగు రోజులు పోతే మనమూ పోతామన్న యథార్థం మరిచి వగస్తూనే ఉంటాం. ‘మనం ఉన్నది వీటన్నిటినీ గుర్తు చేసుకోవడానికేనా!’ అని ఎవరూ ప్రశ్నించుకోవడం లేదు.
నిజానికి పోయినవారు మనసును బాధించడం లేదు. వారి తాలూకు స్మృతులే మనల్ని బాధిస్తాయి. ఆ విషయాన్ని గుర్తించలేకున్నాం. స్మృతులే బాధిస్తున్నాయని రూఢీ అవుతున్నది కాబట్టి, వాటిని తొలగిస్తే శోకం దూరం అవుతుందని స్ఫురించడం లేదు. అసలు ఆప్తవియోగ స్మృతులు మనిషిని బాధించడానికి చాలా కారణాలుంటాయి. పోయిన వ్యక్తి రూపరేఖా విలాసాలు, వారితో మనకున్న అనుబంధం ఇవన్నీ చెప్పుకోవచ్చు. కానీ, మనిషి రూపం అతని శరీరం పడిపోయాక కాలిబూడిదయిపోతుంది. వారితో ఉన్న అనుబంధాన్ని తలచుకునే క్రమంలోనూ ఆ పోయిన వ్యక్తుల శరీరాలు మనోఫలకంపై కదలాడుతుంటాయి. ఈ శరీరాల స్మరణ నిత్యం జరుగుతూ ఉండటం వల్ల మళ్లీ మళ్లీ శరీరాలు ధరించాల్సి వస్తున్నది. అంటే జన్మ పరంపరలు కొనసాగడానికి ఇదీ ఒక కారణం.
ఎప్పుడు రాలిపోతాయో తెలియని శరీరాల గురించి ఇంత వెర్రి అభిమానం ఎందుకు? దుఃఖం కలుగుతున్నప్పటికీ ఎందుకు తొలగించుకోవడం లేదు? అని ప్రశ్నించుకోవాలి. శరీరాలు పతనం చెందకుండా ఉంటే సమస్య పరిష్కారం అవుతుంది కదా, అంటారా! అందుకోసం మనిషి శాశ్వతంగా జీవించే ఉపాయం కావాలి. భూమిపై శాశ్వతంగా ఉండిపోవాలన్న తపన అనాది నుంచి ఉన్నదే! అందుకే కదా, హిరణ్యకశిపుడు, రావణుడు తదితరులు ఘోర తపస్సులు చేసి వరాలు పొందింది. అయినా, పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు అన్నది సృష్టి నియమం. దాన్ని అనుసరించి ఎన్ని వరాలు పొందినా, ఇంకెన్ని మాయోపాయాలు చేసినా అంతిమంగా వారి శరీరాలు కూలిపోయాయి. ఏతావాతా శరీరాలను శాశ్వతంగా నిలబెట్టాలన్న అభిప్రాయం తప్పని తేలుతున్నది.
ఇక ఇప్పుడు మిగిలింది స్మృతులు. అవి విజృంభించే మనసు. వీటిని సరిదిద్దుకోవలసింది మనమే. అదెలాగంటే, మనసులోంచి మానవ శరీరాలను, తత్సంబంధ జ్ఞాపకాలను నిర్దాక్షిణ్యంగా తరిమికొట్టాలి. ఇది ఒకే పద్ధతి వల్ల మాత్రమే సాధ్యం. భగవద్రూపాలు బంధ కారణాలు కావు. విముక్తి హేతువులు. కాబట్టి, దివ్యమైన భగవంతుడి రూపాలతో, అమూల్యమైన స్మృతులతో, సత్యమైన అనుభూతులతో రేయింబవళ్లూ మనసును నింపగలగాలి. అప్పుడు నిరతిశయానందం మనిషికి సొంతం అవుతుందనడంలో సందేహం లేదు. భగవంతుడి రూపాన్ని, భావనను మనసులో సదా నిలుపుకోగలిగితే జీవితానికి సార్థకత కలుగుతుంది. ఈ శరీరం ఎప్పుడు పడిపోయినా, మళ్లీ శరీరాన్ని ధరించే జన్మ పరంపర చక్రం నుంచి విముక్తి లభిస్తుంది.

సేకరణ

No comments:

Post a Comment