Wednesday, July 13, 2022

నిత్యశాంతి

 *నిత్యశాంతి*


‘నేనెక్కడ ఉన్నాను అని కాకుండా ‘నాలో ఏముంది అనే విషయాన్ని వివేకంతో ఆలోచించగల వారే సాధకులు. ‘నాకుముంది అని కాకుండా ‘నేనెలా ఉన్నాను అని తమను తాము చూసుకోగల సాధకులే ఏనాడైనా ప్రగతిని సాధిస్తారు. మనకు ఆనందం కావాలి కాని, దుఃఖం కోసం శ్రమిస్తున్నాం. మనకు మోక్షం కావాలి కాని, బంధం వైపు నడుస్తున్నాం. ఆనందాన్ని, మోక్షాన్ని, పొందే శక్తి మనకు ఉంది. ఇది దైవశక్తి. దుఃఖాన్ని, బంధాన్ని పెంచుకునే శక్తి కూడా మనకు ఉంది. ఇది అసురశక్తి. ఈ రెండూ మనలోనే ఉన్నాయి. వీటి మధ్యే ఘర్షణ. నిప్పు అగ్నిని బాధించదు, నీళ్లను బాధిస్తుంది. కారణం, నిప్పు స్వభావం నీళ్ల స్వభావానికి విరుద్ధమైనది. నిప్పు మీద నీళ్లు కళపెళలాడుతాయి. పొయ్యి మీద నుండి దించిన కొంతసేపటికి నీళ్లు యధాస్థితికి చేరుకుంటాయి. చల్లదనం నీటి సహజ స్వభావం. కాని దుఃఖము, అశాంతి-వాటిని కల్పించే రాగద్వేషాలు మనిషి స్వభావం కాదు. అందుకే నిరంతరం దుఃఖం నుండి విడిపడి శాంతిని పొందాలి అని మనిషి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆకలిదప్పులు దేహానికే కాదు, మనసుకూ ఉన్నాయి.


ఆశలు, ఆవేశాలు, ఆవేదనలు, ఆందోళనలు, మానసికమైన ఆకలిదప్పులు. ఆకలిదప్పులను భరించలేనట్లే కొందరు ఆవేశాలను, ఆవేదనలను కూడా భరించలేరు. యోగః చిత్తవృత్తి నిరోధః యోగం ద్వారా చిత్తవృత్తులను నిరోధించి శాంతిని పొందవచ్చునని కొందరి అభిప్రాయం. మాట వినని పిల్లవాడిని కొడితే ఏమి ఉపయోగం? తాత్కాలికంగా అల్లరి ఆపి ఆ తరువాత మళ్లీ మొదలుపెడతాడు. అలాగే మనసులోని కోరికల్ని అణగద్రొక్కితే ఏం ప్రయోజనం? అవి బీజరూపంలో అడుగున ఉండి, అను కూల వాతావరణంలో అంకురిస్తాయి. కోరికల్ని లేకుండా చేయడం యోగానికి సాధ్యపడదు. నీళ్లను అగ్నిమీద పెడితే కాగి, ఆవిరై, పాత్ర ఖాళీ అవ్ఞతుంది. జ్ఞానాగ్నిలో మనసు తప్తమైతే కోరికలు నిర్వీర్యమై అదృశ్యమవ్ఞతాయి. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మాప్నోతి నైష్ఠికీం కర్మయోగి కర్మఫలాలను త్యజించి పరమశాంతిని పొందుతున్నాడు. యుక్తః అంటే యోగయుక్తుడు. రాగద్వేషాల వల్ల అశాంతి ఆవరించింది కనుక రాగద్వేషాల నుండి విడిపడగానే హృదయంలో శాంతి నిండుతూ ఉంది. రాగద్వేషాల నుండి విడిపడిన కర్మయోగికి కర్మలతో సంబంధం లేదు.


కర్మఫలాలతో సంగత్వం లేదు. రాగద్వేషాలు ఉన్నపుడే కర్మలలో మంచి, చెడు అనే భేదం కనిపిస్తూ ఉంది. రాగద్వేషాలు ఉన్నపుడే అనుకూలం ఫలం, ప్రతికూల ఫలం అనే భావన కలుగుతూ ఉంది. రాగద్వేషాలు తటస్థపడిన కర్మయోగికి ఏ ఫలమైన నిష్ఫలమే. ఎందుకని? అతనికి కావలసింది మోక్షఫలం. మోక్షం కర్మఫలం కాదు. రాగద్వేషాల నుండి విడిపడి కర్మఫలాల యందు సంగత్వం లేనపుడే సంఘర్షణ దూరమై మనసులో శాంతి కలుగుతూ ఉంది. ధ్యానాత్కర్మ ఫలత్యాగః త్యాగాచ్ఛాంతి రనంతరమ్‌ ధ్యానము కంటే కర్మ ఫలత్యాగం ఉన్నతం. కర్మ ఫలత్యాగం వల్ల శాంతి కలుగుతూ ఉంది. ధ్యానం మనిషి ఎంత కాలమని చేయగలడు? ధ్యానం ఆగగానే మళ్లీ అశాంతి మొదలవ్ఞతుంది. కర్మఫలత్యాగం వల్ల కలిగే శాంతి దేశకాలపరిస్థితులపై ఆధారపడి ఉన్నది కాదు. అది సహజమైన స్వతస్సిద్ధమైన శాంతి. నీటికి చల్లదనం లాగ శాంతి మనిషి సహజస్థితి.


సేకరణ. మానస సరోవరం

No comments:

Post a Comment