Saturday, December 17, 2022

 *శివపురాణం* -25 వ  భాగం:(B)

ఈ నలుగురు నిలబడి తాండవం చూస్తూంటారు. ముప్పది మూడు కోట్లమంది దేవతలు అక్కడే ఉంటారు. బ్రహ్మ శ్రీమహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటారు. పతంజలి తప్ప మిగిలిన దేవతలు ఎవరికీ తోచిన వాద్య విశేషణాన్ని వారు వాయిస్తూంటారు. డమరుకం కదలిక చేత ఇన్ని రకములయిన సృష్టి ప్రారంభం అయింది. ఆయన చేతిలో ఉన్న డమరుకం కారణంగా ఈయన సృష్టికర్త అయ్యాడు. పరమేశ్వరుని సృష్టి కదలిక వలన కొత్తగా కొన్ని ప్రాణులు లోకంలోకి వచ్చాయి. ఈ లోకంలోకి కొత్తగా ప్రాణులు రావడం అనే సమస్త కదలికలకు డమరుక సంకేతం. ఇవన్నీ జరుగుతున్నాయి అనడానికి ఆయన కదలికే కారణము. ఈశ్వరుని కదలికకు నర్తనమని పేరు. ఇదే ఆనంద తాండవము. ఆనంద తాండవ మూర్తి చేతిలో కుడివైపు డమరుకం ఉంటుంది. ఎడమచేతి వైపు అగ్నిహోత్రం ఉంది. ప్రపంచంలోని అన్ని వస్తువులు చివరకు భస్మమే అయిపోతాయి. ఈ విషయం లోపల బాగా నాటినట్లయితే వ్యక్తి తప్పుడు పనులు చేయడు. ఏది కాలంలో వచ్చిందో అది కాలమునందు ఉండదు అని మీకు అర్థం అయిపోతే మీ నడవడి యందు మార్పు వచ్చేస్తుంది. నటరాజ స్వామిని పరిశీలించినట్లయితే ఆయన కుడికాలి క్రింద ఒక రాక్షసుడు ఉన్నాడు. ఈయన కాలుకింద పడుకుని తల ఎత్తి నవ్వుతూ ఉంటాడు. ఏడవడు. మాయను గెలవడమే కుడికాలి కింద రాక్షసుని తొక్కి పట్టడం. ఎడమ కాలు బ్రాహ్మీ స్థితిని సూచిస్తుంది. కుడికాలు మాయను తొక్కితే పైకి లేచేది ఎడమకాలు. అందుకే ఆనంద తాండవ మూర్తి ఎడమకాలు పైకి లేచి ఉంటుంది. నీవు ఊర్ధ్వ ముఖ చలనము చేసి ఈశ్వరుడిని తెలుసుకునే ప్రయత్నం చేసి బ్రాహ్మీభూతుడవై ధ్యానము చేసి ధ్యానమునందు ఆనందమును పొంది ‘నేనుగా ఉండడం’ నీవు నేర్చుకో. నీవు నేనై ఉన్నాను అని తెలుసుకో. దానికి ధ్యానం అవసరం. ఇది చెప్పడానికి ఎడమచెయ్యి పైకి లేచిన ఎడమ పాదమును చూపిస్తుంది. కుడి చేయి అభయ ముద్ర పట్టింది. శివుడు చాలా తేలికయిన వాటిని పుచ్చుకుని పెద్ద శుభ ఫలితములను ఇస్తాడు. ఇది చెప్పడానికే ఆయన అభయముద్రను ప్రదర్శించాడు. పాపమును హరిస్తానని చెప్పాడు. హరించినప్పుడు ఉపాసకుడు క్రమంగా పెరుగుతాడు. పెరిగి ‘శివ’ – అంటే మంగళమును చేరతాడు. ఈ ‘శివ’ నుండి ఆనంద తాండవ మూర్తిలోనికి లయం అయిపోవాలి, తాను ఆనందంగా మారిపోవాలి. అలా మారిపోతుంటే ఇప్పుడు ఆయన దిగంబరుడుగా వచ్చాడు. అంటే శరీర భ్రాంతి లేకపోవడాన్ని ఆనందం అంటారు. ఆత్మస్వరూపి అయిన ఆనంద తాండవ మూర్తియండు సాధకుడు కలిసిపోతే తానె ఆనంద తాండవ మూర్తి అయిపోతాడు. ఆయనకి మరల చావడం అనేది ఉండదు. ఇదే ఆఖరి చావు. శివుని విశేషములను వేటినీ మీరు సామాన్యముగా తీసుకొనుటకు ఉండవు. మీరు కేవలం ఒక నటరాజ స్వామి వారి మూర్తిని పెట్టుకుని అష్టోత్తరం చేస్తాను, సహస్రం చేస్తాను అంటే మీకు ఈ తత్త్వము ఆవిష్కరింపబడదు. ఇలా చూడాలన్న కోరిక పుట్టడమే చాలా కష్టం. కోరిక పుట్టినా అది నిలబడడం చాలా కష్టం. ఎందుకు అంటే కింద కుడికాలిక్రింద నవ్వుతూ ఒకడు బ్రతికే ఉంటాడు. వాడు ఎప్పుడు లేచి పట్టేసుకుంటాడో మనకి తెలియదు. ఎప్పుడయినా మాయ మళ్ళీ పట్టేస్తుంది. మళ్ళీ కూపంలోకి పడిపోతాడు. ఉదాహరణకు రావణాసురుడు శంకరుని ప్రార్థన చేశాడు. తనకు ఎటువంటి శంకరుని చూడాలని ఉన్నదో వివరిస్తూ స్తోత్రం చేశాడు “జటాటవీ గలజ్జల’ అని. ఇంత స్తోత్రం చేసిన రావణాసురుడు అలా నిలబడ లేకపోయాడు. పరమేశ్వరుని తనతో లంకకు రమ్మన్నాడు. ఏమయిపోయింది ఈ స్తోత్రం. అంటే అంతలో మాయ కమ్మింది. అడగడం కాదు. అడిగినవాడు నిలబడడం కూడా చాలా కష్టం. నిలబడడానికి శివానుగ్రహం ఉండి తీరాలి. శివానుగ్రహం కలిగితే ఆయనే నడిపిస్తాడు. కాబట్టి అటువంటి ఆనంద తాండవ మూర్తి అనుగ్రహం మనకు కలిగి మనుష్యజన్మ ప్రయోజనం నెరవేరేటట్లుగా నిర్హేతుక కృపాకటాక్షవీక్షణముల చేత ఈశ్వరానుగ్రహం మనయందు ప్రసరింపబడాలని ఆ సర్వేశ్వరుని ప్రార్థన చేద్దాము.

ఇంతటితో శివపురాణం -25 వ  భాగం సమాప్తమైనది... 

|| ఓం నమః శివాయ ||  

No comments:

Post a Comment