Saturday, December 17, 2022

78 - శ్రీ రమణ మార్గం: ‘త్యాగమనే పదం మహా పురుషులకు వర్తించదు. ఒక వస్తువుపై మమకారము ఉండి దానిని వదలలేక, వదలలేక, ఎలాగో వదిలేస్తే, దానికి త్యాగమని పేరు పెట్టవచ్చు.

 *🧘‍♂️78 - శ్రీ రమణ మార్గం 🙏

*శ్రీ రమణ మహర్షి సందేశం పునర్జన్మ ఉన్నట్టా? లేనట్టా?*

*స్పష్టమైన చూపు*

‘త్యాగమనే పదం మహా పురుషులకు వర్తించదు. ఒక వస్తువుపై మమకారము ఉండి దానిని వదలలేక, వదలలేక, ఎలాగో వదిలేస్తే, దానికి త్యాగమని పేరు పెట్టవచ్చు. 

అంటే మనకు ఏ ఉల్లిపాయ మీదనో ఉర్లగడ్డ మీదనో అమిత ఇష్టము ఉండి, ఏ గయలోనో దానిని ఇక ముట్టనని శపథం చేసి వదిలేస్తే, అది త్యాగంగా కనిపించవచ్చు. దాని గురించి మనం ఘనంగా నలుగురికి చెప్పుకుంటూ తిరగవచ్చును.

భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో 'ఆలోచనా పూర్వకంగా' చేసిన అనేక మంది 'త్యాగాలు’ ఈ కోవలోకే వస్తాయి. 

ఏదో ఒక ఊపులో, ఓ మానసిక ఉద్రేకంలో, పెల్లుబికిన ఉత్సాహంలో ఒక ఉద్యోగానికి రాజీనామా చేయడమో, జైలుకు పోవడమో, ఊరేగింపులో పాల్గొంటూ లాఠీ దెబ్బలకు గురికావడమో మరేదో సంభవించేది. క్షణికోద్రేకంలో ఏమైనా జరిగి ఉండవచ్చు. కానీ ఆ తర్వాత పరిణామాలు జూచినప్పుడు, మనిషి మనస్సు మారిపోవడం కద్దు. అప్పుడు ఆ 'త్యాగమనే దానిని ఏదో విధంగా సొమ్ముచేసుకోవాలనే బలీయమైన కాంక్ష బయలుదేరుతుంది.

ఎవరో కొందరు దేశాన్ని గాఢంగా ప్రేమించిన అసలు సిసలైన దేశభక్తుల్ని మినహాయిస్తే మిగతావారందరిలోనూ ఈ స్వార్థం ప్రకటితమవడం గమనిస్తూనే ఉండే వాళ్ళం.

 నిజమైన దేశభక్తుల నోటివెంట 'త్యాగ'మనే మాట వినిపించేదికాదు. మహా పురుషులకు విషయం తేట తెల్లంగా విశదంగా కనిపించినట్లే, నిజమైన దేశభక్తులకు కూడా దేశ దురవస్థ విశదంగా 'కనిపించేది'. తానూ, తన మనసూ, తన మేలును గురించి ఆలోచన స్థానే ఎట్ట ఎదుటనున్న తన దేశస్థుల బానిసస్థితి ప్రస్ఫుటంగా కనిపించేది. 

పరిస్థితి అంత స్పష్టంగా కనిపించినప్పుడు అతడి కర్తవ్యమేమిటో కూడా అంత బాగానూ కనిపించేది. ఇది ఏ ఆదర్శాన్ని, అంటే ఏ ఆలోచనా సరళిని అనుసరించినది కాదు. ఎట్ట ఎదుట ఉన్న పరిస్థితే ఈ ప్రాణిని ఒక విధమైన చర్యకు పురి కొల్పుతున్నది. 

ఈ చర్యకు ఇతడు నిమిత్తమాత్రమైన కర్త అవుతున్నాడు. ఆలోచనా రహితమైన, సహజంగా జనించిన ఈ చర్యను ఇవతల నుంచున్న మనం 'త్యాగ’మని వర్ణించవచ్చు కానీ అతడు దీనిని త్యాగంగా భావించే వ్యవధానమేది? అలా అనుకునే లోగానే ఆ చర్య జరిగిపోయి ఉంటుంది.

పులిని చూచి నక్క వాతలు పెట్టుకున్నట్లు, ఆ చర్య ఫలితంగా ఆ మనిషికి దక్కిన కీర్తి ప్రతిష్టలను చూచి, మరొక వ్యక్తి ఆలోచనా పూర్వకంగా ఆ చర్యను అనుకరించవచ్చు. 

సంఘానికి కళ్లు అంత బాగా కనిపించవు కాబట్టి అసలు సరుకునూ, ఈ నకిలీ సరుకునూ సమానంగానే ఆదరించవచ్చు. ఆ మాటకొస్తే, అసలు సరుకు తన విషయం తాను ప్రకటించుకోదు కాబట్టి, అతిగా ప్రకటించుకునే ఈ నకిలీ సరుకుకే మరింత ప్రచారం లభించవచ్చు.

మనకు అనేక వస్తువుల మీద వ్యామోహం అధికం కాబట్టే, వాటిని వదిలేసిన వారిని చూచి ఎంతో త్యాగం చేశారని కీర్తిస్తాం. మన దృష్టికి అవి త్యాగంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. 

కానీ ఎదుటనున్న దృశ్యాన్ని మోహరహితంగా స్పష్టంగా ఉన్నది ఉన్నట్లు చూచే కళ్ళున్న వారికి 'కర్తవ్యం' కనిపిస్తుంది కానీ, 'త్యాగం' కనిపించదు. ‘తాను’ ఈ పనిచేస్తున్నాననే ఆలోచన ప్రవేశించకముందే కర్తవ్య నిర్వహణ పూర్తయి పోతుంది.

అలా బ్రతికిన పుణ్య పురుషులెందరో ఉన్నారు. వారిలో ఒకరైన శ్రీ అరుణాచల రమణులు బ్రతికిన తీరు వివరిస్తాను. విషయం చిన్నదిగా కనిపించినా, ఆహారం స్వీకరించేప్పుడు ఆయన ఎలా వ్యవహరించేవారో గమనించండి.

 ఆశ్రమంలో అందరికీ వడ్డించడానికని ఒకావిడ పూరీలు వేయించింది. పూరీలన్నీ నూనెలో వేయించి, కొన్ని పూరీలు మాత్రం ప్రత్యేకంగా నేయిలో వేయించింది. అలా నేతిలో వేయించిన వాటిని పూరీల దొంతరపై భాగాన ఉంచుకొని, సద్దు చేయకుండా వాటిని రమణునికి వడ్డించి, మిగతావి అక్కడున్న వారందరికీ వడ్డించాలని ఆవిడ ఉద్దేశం.

 వడ్డన పూర్తయిన తర్వాత శ్రీరమణులు ఆవిణ్ణి విడిగా పిల్చి, “లక్ష్మీ ఈ పని మళ్ళీ చేయకు. ఇలా గనక మనిషి మనిషికీ తేడా చేశావంటే, నువు వండిన ఏ పదార్థమూ ఇక ముట్టను” అని ఖండితంగా తనతో చెప్పేశారని తర్వాత ఆవిడే నలుగురికి చెప్పుకున్నది.

అసలు విషయం ఆయనకెలా తెలిసిందో అంతుబట్టక ఆవిడ ఆశ్చర్యపోయింది కూడాను. రమణుడు ఈ విషయం ఎలా గ్రహించాడు అనే విషయం అలా వదిలేసి, మనమిందులో చూడవలసింది ఏమిటంటే నలుగురికీ వడ్డించిందే తనకూ వడ్డించాలనే రమణుని పట్టదల. మామిడి తొనలు వడ్డించే సమయంలో కూడా, తనకు ప్రత్యేకంగా పెద్దవి వడ్డిస్తే అలా చేయవద్దని అప్పటికప్పుడే హెచ్చరించేవాడు.

జీవితమంతా అతికొద్ది బట్టతో, నలుగురూ తినే సామాన్యమైన తిండితో, కొద్ది పాటి చోటులో పదిమంది మధ్యా శయనిస్తూ గడిపాడు. ఎవరు ఏ ఖరీదైన బహుమానం ఇవ్వజూపినా ఏదో విధంగా, వారి మనసు నొవ్వకుండానే మర్యాదపూర్వకంగా దానిని వదిలించుకునేవాడు.

 ఆఖరికి తన ఆరోగ్యం కోసం విలువైన ఆయుర్వేద ఔషధాలు ఇద్దామని ఎవరైనా ప్రయత్నించినా, “ఇది అందరూ కొనుక్కోగలిగిందేనా? కానప్పుడు నాకు మాత్రం ఎందుకు?” అని దానిని తీసుకునేవాడు కాదు.

మధ్యాహ్న భోజనానంతరం, రోజు 12 గంటల వేళ రమణుడు పల్లకొత్తుకు నడిచి వెళ్లి ఒకటిన్నర గంటలలోగా తిరిగివచ్చేవాడు. ఇసకతో నిండిన ఆదోవ అంతా మిట్ట మధ్యాహ్నపు ఎండకు కాలిపోతుండేది. పాదరక్షలు లేకుండా మొదట్నించీ ఉత్త కాళ్ళతోనే నడవడం అలవాటైన రమణుడు ఎండైనా వానైనా అలా నడిచి వెళ్ళివస్తూనే ఉండేవాడు.

 తాను మెల్లిగా నడుస్తూ కూడా తనతో వచ్చే అనుచరుడితో మాత్రం “పరుగెత్తి వెళ్ళి ఆ చెట్టునీడన నుంచో, భుజం మీది వస్త్రం తీసి పాదాలకింద వేసుకొని కాసేపు అలాగే నిలబడు,” అని అనుచరుడి బాధను గురించి ఆదుర్గా ప్రకటించే వాడే కానీ, తాను మాత్రం అలవాటు ప్రకారం నెమ్మడిగా, ఒడుదుడుకులు లేకుండా తన పాదయాత్రను సాగించేవాడు. ప్రతి జీవియెడలా అతడి హృదయం అంత మృదువై పోయింది.

రమణుడి జీవితం మన కంటికి 'త్యాగమయంగా కనిపించవచ్చు. కానీ రమణుడి దృష్టిలో తనలో నుండి పుట్టుకు వచ్చింది 'త్యాగం' కాదు; అభేద భావం, స్పష్టమైన చూపులో నుండి జనించిన మహాకరుణ.

No comments:

Post a Comment