Thursday, December 15, 2022

*****సరాసరి: మీరిప్పుడు అనుభవించే సుఖం సరాసరి సుఖమే. మీరిప్పుడు అనుభవించే దుఃఖం సరాసరి దుఃఖమే.

 [12/15, 07:00] +91 73963 92086: 51. సరాసరి
____

"వాడికేం... సుఖపురుషుడు...
నాకున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు..."

"దేవుడు నన్ను చిన్న చూపు చూశాడు..."

"పగవాడికి కూడా వద్దురా బాబూ ఈ కష్టాలు...!"

ఇలాంటి మాటలు మనం తరచూ వింటూ ఉంటాం.

అంటే దాని అర్థం- మిగతావారి కంటే తనకే కష్టాలు ఎక్కువుగా పెట్టాడు దేవుడు...అని.

నిజానికి అలాంటి పక్షపాతం ఏమీలేదు దేవుడికి.

* * *

అన్ని విషయాల్లో కాకపోయినా, కొన్ని విషయాల్లోన్నైనా స్వేచ్ఛగా కర్మలు చేయగలిగే వెసులుబాటు ఉంది మనిషికి.
అన్నింటినీ "భగవదిచ్ఛ" అని వదిలేయడం పలాయనవాదం అవుతుంది.

దుష్టజంతువు వెంటబడింది...పరుగెత్తి చెట్టు ఎక్కగలిగే శక్తీ తనకు ఉంది... ఎక్కు...

ఎక్కాక ఆ తర్వాత ఎటూ పోలేని పరిస్థితి...
ఇక ఏమీ చేయలేని దుస్థితి...
అప్పుడు మాత్రమే "భగవదిచ్ఛ" అనాలి.

ఏ ప్రయత్నమూ చేయక, భగవదిచ్చ...అనడం
అది సోమరి లక్షణం....
అది పనికిమాలిన వైరాగ్యం...

* * *

అటువంటి స్వేచ్ఛాయుత కర్మలను 
ధర్మానికి ముడిపెట్టి చేయడం అనేదే 
మోక్షానికి ముఖ్య సాధనగా చెప్పాయి శాస్త్రాలు.

ధర్మం అంటే-
తాను ఇతరులతో మనసా-వాచా-కర్మణా 
ఇబ్బంది కలిగించని వ్యవహారాన్ని కలిగి ఉండటం.

ఒకరికి ఇవ్వడం అంటే, తనకు తాను ఇచ్చుకోవడమే...అనే అద్భుతమైన విషయాన్ని కనిపెట్టారు ఋషులు.

దానినే "త్యాగం" అన్నారు...

త్యాగేనైక అమృతత్వ మానశుః
త్యాగం ఒక్కదాని వల్ల మాత్రమే అమృతత్వం లభిస్తుంది అన్నది ఉపనిషత్తు.

మానవులందరినీ కలిపి ఒకే మానవుడుగా(ఒకే శరీరంగా) అనుభూతి చెందినప్పుడు మాత్రమే ఈ త్యాగబుద్ధి అత్యంత సహజంగా కలుగుతుంది.

* * *

రైతు తన పొలంలో విత్తనాలను వెదజల్లినప్పుడు
అతడు విత్తనాలను నేలపాలు చేశాడని అనగలమా?
నూరురెట్ల ఫలాన్ని అతడు తిరిగి పొందగలడు.

నదులు సముద్రంలో కలిసి నిరుపయోగం అవుతున్నాయని అనగలమా?

అవి ఆవిరై మేఘమై మన పంటలపై వర్షంగా కురుస్తోంది.

కాబట్టి "ఇవ్వడం అంటే పొందటం" అనే సూత్రాన్ని బాగా అర్థమయ్యేట్టు పిల్లలకు నీతి కథలుగా చెప్పాలి.

* * *

కర్మఫలం కర్మ చేసినవానికి మాత్రమే చెందదు.
ఆ ఫలం ప్రపంచంలో ఉన్నవారందరికీ
సరాసరిన పంచబడుతుంది...అంటారు గురువుగారు.
వానచుక్క సముద్రంలో పడి సముద్రవ్యాప్తమైనట్టుగా...

* * *

కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన
మా కర్మఫలహేతుర్భూః మా తే సంగోఽస్త్వకర్మణి

శాస్త్ర విహిత కర్తవ్య కర్మను చేయటం వరకే నీకు అధికారం. ఆ కర్మ ఫలముల పైన నీకు హక్కు లేదు...అంటే, 

ఆ కర్మఫలం నీ ఒక్కడి సొత్తు కాదు, అది సరాసరిన అందరికీ పంచబడుతుంది...అని అర్థం.
ఆ పంపకంలో నీవొక భాగస్వామివి మాత్రమే.

* * *

కంటిలో కలక పడినా, 
కాలికి ముల్లు గుచ్చుకున్నా
శరీరం మొత్తం బాధకు గురి అవుతుంది.

అలాగే ఏదైనా మధుర పదార్థం నాలుక మీద వేసుకున్నప్పుడు శరీరమంతా సుఖానుభూతిని పొందుతుంది.

అలాగే కుటుంబంలో...
ఒకడు మరణిస్తే,  ఆ కుటుంబం అంతా దుఃఖం అనుభవిస్తుంది.
లేదా ఒకడికి ఉద్యోగం వస్తే, ఆ కుటుంబమంతా ఆనందం పొందుతుంది.

అలాగే గ్రామం, దేశం, విశ్వాంతరాళం...

విశ్వాంతరాళంలోని మనకు తెలిసిన, తెలియని సమస్త చరాచరజీవుల సుఖానుభవం లేక దుఃఖానుభవం ప్రతి జీవి చేత సరాసరి లెక్కన అనుభవింపబడుతుంది.

అందువల్ల తేలిందేమంటే-
నీ సుఖదుఃఖాలు నీ ఒక్కని స్థితిపై ఆధారపడిలేదు. జగత్తు  యొక్క మొత్తపు సుఖదుఃఖాల మీద ఆధారపడి ఉంది. 

ఒక ధనికుడైనా, ఒక దరిద్రుడైనా 
వారికి అనుభవంలోకి వచ్చేది కేవలం విశ్వంలోని సరాసరి సుఖదుఃఖాలే.

ఇతరుల దృష్టిలో 
ఒకడు బెంజికారులో తిరగొచ్చు...
మరొకడు గంజికూడు తిని బ్రతకొచ్చు...
అనుభవంలో మాత్రం సరాసరి సుఖమే, సరాసరి దుఃఖమే కలిగేది.
అంతకు మించి వచ్చేది కల్ల.

నాకు అన్నీ ఉన్నాయి...కానీ మనశ్శాంతి లేదు...
అంటాడు బెంజికారులో తిరిగేవాడు.

రేపటి గుఱించి ఏ మాత్రం ఆలోచన లేకుండా
ఏ రోజు కథను ఆరోజు తృప్తిగా అనుభవిస్తాడు గంజి త్రాగేవాడు.

కారణం ప్రకృతిలోని ఈ సరాసరి లెక్కయే.

* * *

సరాసరి అనుభవిస్తున్నాడని 
అందరికి ప్రకటన ఒకే విధంగా ఉండదు.

ప్రకటన పలువిధాలుగా ఉన్నప్పటికీ సుఖదుఃఖానుభవాల్ని సరాసరి లెక్కనే అనుభవిస్తుంటారు. 

ఒక లోభికి ఒక్కరూపాయి నష్టం, 
ఒక ఉదారుడికి కోటిరూపాయిల నష్టంతో సమానం. 

ఉదారుడు కోటిరూపాయిల నష్టాన్ని అనుభవించే అనుభవం 
లోభి ఒక్కరూపాయి నష్టంలోనే అనుభవిస్తాడు.

కాబట్టి ఇవన్నీ ఇతరుల దృష్టిలో నుంచి చెప్పబడిన మాటలే. స్వానుభవంలో సరాసరియే అనుభవంలో ఉంటుంది.

కాబట్టి పైకి కనబడే దృశ్యంలో తేడాలున్నట్టు కనబడుతుంది.
వారు లోపల అనుభవించేది మాత్రం సరాసరి సుఖదుఃఖానుభవాన్నే.

మీరిప్పుడు అనుభవించే సుఖం సరాసరి సుఖమే.

మీరిప్పుడు అనుభవించే దుఃఖం సరాసరి దుఃఖమే.

* * * 

లోకా సమస్తాన్ సుఖినోభవంతు సమస్త సన్మంగళానిభవంతు...అన్న ఋషుల వాక్కులోగానీ,

నీ వలె నీ పొరుగువారిని ప్రేమించు...అన్న క్రీస్తు వాక్కులోగాని అంతరార్థమిదే.

నీ కొఱకు, నీ శాంతి కొఱకు, నీ సుఖం కొఱకు, నీ క్షేమం కొఱకు...
నీ అవసరం కాబట్టి విశ్వశాంతి, విశ్వసుఖం, విశ్వక్షేమం కోరమన్నారేగాని, విశ్వం కొఱకు కాదు.
[12/15, 07:00] +91 73963 92086: నీ శాంతి పైన విశ్వశాంతి ఆధారపడి ఉండలేదు.
విశ్వశాంతిపైన నీ శాంతి ఆధారపడి ఉంది.

ఇందుకు ఏం చేయాలన్నది నిర్ణయించుకోవలసింది నీవే.
నీ పరిమితులను బట్టి
నీ శక్తి సామర్థ్యాలను బట్టి
నీ అవకాశాలను బట్టి 

నీ శాంతిని పెంపొందించుకోవడానికిగాను
విశ్వశాంతికి నీవు తోడ్పడాలి...
వేఱే మార్గమే లేదు...

అవసరం నీది...ఏం చేస్తాం...?

* * *

No comments:

Post a Comment