Thursday, December 15, 2022

భక్తితో, సంపూర్ణ ప్రేమతో, పెట్టిన ఏ కాస్తయినా, అది ఏదయినా, తిన్న వారికీ పెట్టిన వారికీ, ఇరువురికీ కూడా గొప్ప ఆత్మ సంతృప్తినిస్తుంది. నిజమైన ఆత్మ సంతృప్తి నిచ్చే ఏ కార్యంలోనైనా పరమాత్మ తొంగిచూస్తూనే ఉంటాడు.

 *🧘‍♂️77 - శ్రీ రమణ మార్గము

*శ్రీ రమణ మహర్షి సందేశం పునర్జన్మ ఉన్నట్టా? లేనట్టా?*

*ప్రేమతో పెట్టిన కాస్త...*

ఒకసారి శ్రీ రామకృష్ణ పరమహంస జన్మదినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ ఒక పేద అభిమానురాలు తన వద్ద నున్న కొన్ని డబ్బులతో నాలుగు రసగుల్లాలు కొనుక్కొని వాటిని రామకృష్ణుడికి ఇవ్వటానికి దక్షిణేశ్వర్ వచ్చింది. నహబత్ గృహంలో నివసిస్తున్న రామకృష్ణుడి సతీమణి శారదా మాత చేతికి చ్చి, వాటిని రామకృష్ణుడి వద్దకు పంపించి తినిపించమని వేడుకున్నది. శారదా మాత సహచరులు, “గురువు గారు భక్తులతో ప్రసంగిస్తూ ఉన్నారు. ఇవి తీసుకొని ఈ సమయంలో ఆవిడ అక్కడికి ఎలా వెళుతుంది? అదీకాక గురువుగారి భోజనం అయిపోయింది. ఇప్పుడిక మళ్ళీ ఏమీ తినరు. తింటే జబ్బు చేస్తుంది కూడాను” అని నిరుత్సాహ పరిచారు.

ఆ పేదరాలు చాలా నిరాశకు గురయింది. తాను తెచ్చిన పదార్థం తన స్వామి ఆరగిస్తే సంతోషిద్దామనుకున్న మనిషికి విచారమే మిగిలింది. ఈ ఘట్టాన్ని తన రచన ద్వారా మనకు తెలియజేస్తూ, ఆవిడ ఇలా అనుకొని ఉంటుందనే ఊహ చేస్తాడు రామకృష్ణ. శిష్యుడైన శ్రీ రామచంద్రదత్త. “మహానుభావా, నువ్వు దీనులపాలిటి దైవానివి. ప్రస్తుతం ధనవంతులైన నీ భక్తులు ఎంతో వ్యయంతో విందు నీకేర్పాటు చేశారు. నీవు అందులో మునిగి ఉన్నావు. ఇకనేనా, ఒక సామాన్యురాలిని. ఎలాగో నాలుగు కానులు (ఆనాటి రూపాయిలో పదహారవ వంతు) మిగిల్చి ఈ రసగుల్లాలు కొనుక్కు వచ్చాను. వీళ్ళేమో ఇవి నీకందించే వీలు లేదంటున్నారు. నేనేం చేయాలో నాకు తోచడం లేదు. నీవు దీన జనోద్ధారకుడివి కాదేమోనని నాకనిపిస్తున్నది.” చదువురాని ఓ బీద వనిత ఇంత వివరంగా ఇంత హేతుబద్ధంగా ఆలోచించి ఉండకపోవచ్చు. కానీ ఆవిడలో నైరాశ్యం, అసంతృప్తి తొంగి చూశాయి అనేది మాత్రం ఖాయంగా చెప్పవచ్చు. ఆ నైరాశ్యానికే దత్త ఇలాంటి అందమైన రూపకల్పన చేసి ఉంటాడు.

ఆ తర్వాత జరిగిన సంఘటన మాత్రం ఎవరూ కల్పించింది కాదు. అక్కడ రామకృష్ణుడు అకస్మాత్తుగా తానున్న భవనంలో నుండి కింది వరండాలోకి దిగివచ్చాడు. అక్కణ్ణించి కనిపించే నదీ ప్రవాహం వంక కాసేపు చూస్తూ నుంచున్నాడు. అటు తర్వాత వరండా నుండి నాలుగు మెట్లు దిగి శారదా మాత నివసించే నహబత్ గృహానికి నడుస్తూ వచ్చాడు. అక్కడికి రాగానే ఎవరి కోసమో వెతుకుతున్నట్లు కలియ చూడడం ప్రారంభించాడు. అక్కడే నిలబడిన పేదరాలిని చూచి, “ఆకలేస్తున్నది తల్లీ. ఏదైనా ఉంటే పెట్టు” అని తనంటత తానే అడిగాడు. అమితానందంతో ఆ బీద మనిషి తాను తెచ్చిన రసగుల్లాలు అతడి చేతిలో పెట్టింది. సంతృప్తిగా తిన్నాడు రామకృష్ణ. సంతృప్త మనస్సుతో సెలవు తీసుకుంది ఆ బీద వనిత. 

తమ తమ కాలాల్లో పురాణ పురుషులైన రాముడూ కృష్ణుడూ కూడా, ఆతిథ్య మెవరిస్తున్నారు, ఏమిస్తున్నారు అనేది చూడకుండా, భక్తినే ప్రధానంగా ఎంచి, తమ చేత పెట్టిందేదో మారు మాట్లాడకుండా తినేవారు. శ్రీ రాముడు గుహుని అతిథ్యం స్వీకరించాడనీ, శబరి ఇచ్చిన ఎంగిలి ఫలాలను నిరభ్యంతరంగా భుజించాడని వాల్మీకి అంటాడు. రాయబారం నెరపటానికి కౌరవ సభకు వచ్చిన శ్రీకృష్ణుడు, లాంఛన ప్రాయంగా వారు ఏర్పాటు చేసిన బ్రహ్మాండమైన విందులో పాల్గొనకుండా, ఊరు బయట నివసిస్తున్న విదురుని బీద కుటీరానికి వెళ్ళి అక్కడున్న విదురుని సతితో “ఆకలేస్తున్నది, ఏదైనా ఉంటే పెట్టమని” అడిగాడని వ్యాసుడు రాస్తాడు. కృష్ణ భక్తితో నిండిన విదురసతి, కృష్ణ దర్శనంతో వివశురాలై, అరటిపండు తొక్కలు వడ్డించినా, వాటిని పరమానందంతో కృష్ణుడు తిన్నాడంటారు.

"భక్తి కలుగుకూడు పట్టెడైనను చాలు” అనే సూత్రం అవతారపురుషులైన రాముడికీ కృష్ణుడికే కాకుండా, మనమధ్య జీవించి కాలంచేసిన శ్రీరామకృష్ణ, శ్రీ రమణుని వంటి భగవద్భక్తులకు కూడా వర్తిస్తుంది.

ఒకనాటి మధ్యాహ్నం రెండు గంటలవేళ ఎందరో భక్తులు తెచ్చి ఇచ్చిన భక్ష్యాలు భోజ్యాలు శ్రీ అరుణాచల రమణునితో బాటు ఆశ్రమ వాసులందరికీ వడ్డించడానికి సన్నాహాలు జరుగుతున్న సమయంలో, ఒక వృద్ధురాలు మర్రి ఆకు దొన్నెలో రెండు మూడు దోసెలు పెట్టుకొని వచ్చి, స్వతంత్రంగా రమణుని సమీపించి, “ఇదుగో ఈ దోసెలు తిను స్వామీ. వేరే ఏమీ తెచ్చేందుకు లేకపోయింది. ఏంచేయను?” అంటూ ఆ దొన్నె ఆయనకు అందించబోయిన విషయం వివరిస్తారు శ్రీమతి సూరి నాగమ్మ తన గ్రంథంలో.

రమణుని అనుసరించి ఉన్నవారు, "అక్కడ పెట్టవమ్మా” అని ఆవిణ్ణి నివారింప జూశారు. ఆవిడకు కోపం వచ్చింది. "ఉండండయ్యా మీరు, మహా చెప్పవచ్చారు. నిన్నగాక మొన్న వచ్చిన వారు మీరు; మీకేం తెలుసును? ముందు ఈ సామికి ఇక్కడ తిన్నె కట్టించి పెట్టింది నేను కాదా? నన్నేమో దగ్గరకు పోరాదంటారు. చాలు చాలును” అంటూ గద్దించింది.

అక్కడున్న వారంతా విస్తుపోయారు. రమణులు మాత్రం ఆవిడ చేతిలోని దొన్నె ఆప్యాయంగా తీసికొని "అవ్వా, వాళ్లు తెలియని పిల్లలు. ఏమీ అనుకోకు. ఈ దోసెలు ఏ పిండితో చేశావ్? అని కుశల ప్రశ్నలడుగుతూ, “ఆ భక్ష్యాలన్నీ అందరికీ పంచిపెట్టి మీరూ తినండయ్యా. నేను ఈ దోసెలు తింటాను” అని చెప్పి, సరిగా కాలీ కాలని ఆ దోసెలు అమృత తుల్యంగా తినసాగారు. ఆ ముదుసలి ఆనందానికి మేర లేదు.

రమణులకు ఎవరి మనసునూ నొప్పించే అలవాటు లేదు. అందుకని దోసెలు తింటూ తింటూ “ఆ భక్ష్యాలన్నీ ఇటు తెండి" అని తెప్పించి, వాటిన్నిటి నుండీ రవంత తుంచుకొని, “ఊ, నాకిక చాలును. నావంతు కూడా ఆ అవ్వకిచ్చి పంపండి. నాకు ఈ దోసెలు చాలును.” అని తన వంతు పిండి వంటలు కూడా ఆ వృద్ధురాలికిచ్చి పంపించారు.

భక్తితో, సంపూర్ణ ప్రేమతో, పెట్టిన ఏ కాస్తయినా, అది ఏదయినా, తిన్న వారికీ పెట్టిన వారికీ, ఇరువురికీ కూడా గొప్ప ఆత్మ సంతృప్తినిస్తుంది. నిజమైన ఆత్మ సంతృప్తి నిచ్చే ఏ కార్యంలోనైనా పరమాత్మ తొంగిచూస్తూనే ఉంటాడు. 

No comments:

Post a Comment