Thursday, January 19, 2023

శ్రీ రమణాయ అధ్యాయము 32 భగవాన్ ఉవాచ తరువాయి భాగం

 ఓం నమో భగవతే శ్రీ రమణాయ 
అధ్యాయము 32
భగవాన్ ఉవాచ తరువాయి భాగం 

     భగవాన్ పలికిన అమూల్యమైన మాటలు కోట్లు కలవు . కాని అన్ని చెప్పుటకు అసాధ్యం . కావుననే కొన్నింటిని మాత్రం సేకరించి చెప్పడమైనది . ఒకసారి ఒక భక్తుడు భగవానుని సాధన గురించి ప్రశ్నింపగా భగవాన్ ఇట్లనినారు . “ సాధన ? దేనికి *సాధన ? ఏముంది సాధన చేయటానికి ? ఇలా కూర్చోవటమే సాధన . ఎల్లప్పుడు ఇలాగే కూర్చొని ఉండేవాణ్ణి . అప్పటికీ ఇప్పటికీ తేడా ఒక్కటే . అప్పుడు కళ్ళు మూసుకొనే వాడిని . కాకపోతే ఇప్పుడు కళ్ళు తెరుస్తున్నాను . నేను తప్ప వేరొకటి ఉంటే కదా సాధన . తనను తాను చూడక అశాశ్వతమైన శరీరాన్ని చూసి భ్రమించేవాడికి అటువంటి భ్రమను వీడుటకు సాధన అవసరమని* ” భగవాన్ చెప్పారు . జ్ఞానియైన పిదప అనగా ఆత్మజ్ఞానము పొందినవారు ఆత్మగానే ఉండేవారికి ఏ సాధనతో పనిలేదని గ్రహించవలెను . ఊరికే ఉన్నచోటున కూర్చుని ఆత్మను ఎరుకతో ఉంటే చాలు . సాధన శరీర వ్యామోహము కలిగిన వారికి ఆ అవిద్యను తొలగించుటకు ఉపయోగపడేది . భగవాన్ ఒక్క నేను తప్ప మరియొకటి లేదు అనే దృఢ నమ్మకముతో ఉన్నారు . కాబట్టే వారు నేను తప్ప వేరొకటి ఉంటేకదా సాధన అని అన్నారు . మరియొక సందర్భములో భగవాన్ వారికి గురువు లేరని చెప్పారు . కాని సాధన చేసేవారికి గురువెంతో అవసరమని శరీరమే తానని అనుకున్న వారికి మనోవ్యాపారాల భ్రాంతిలో ఉన్న వారికి ఆ భ్రమని తొలగించటానికి గురువు అవసరమని భగవాన్ చెప్పారు . 

               భగవాన్ శ్రీ రమణ మహర్షులు సాక్షాత్తు కుమార స్వామి అవతారమని ముందుగానే చెప్పుకున్నాము . దీనికి నిదర్శనముగా ఒక భక్తుడు ఎన్నో ఏళ్ళ నుండి సుబ్రహ్మణ్య స్వామి మంత్రాన్ని జపిస్తున్నప్పటికీ ఆ స్వామి సాక్షాత్కరించలేదని నిరుత్సాహముతో భగవాన్ కి చెప్పగా భగవాన్ ప్రక్కనున్న మరియొక భక్తుడు ఇట్లనిరి , “ *మీ ఎదుట ఉన్నవారు ఎవరనుకుంటున్నారు ?* " అని అనగా ఆ భక్తుడు తదేకముగా స్వామిని చూసి ఆనందముతో పొంగిపోయినారు . త్రివేణిగిరి98 స్వామి అనే మరియొక సుబ్రహ్మణ్యస్వామి భక్తుడు తిరుచందూరు సుబ్రహ్మణ్యేశ్వరాలయములో ఉంటూ కాలం గడిపే రోజులలో వారు ధ్యానములో ఉండగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఇట్లనినారు , " *నేను ఇక్కడ మాట్లాడని దేవుడిగా ఉన్నాను . తిరువణామలైలో మాట్లాడే మరియు నడిచే దేవుడిగా ఉన్నాను , అక్కడి వెళ్ళు* " అని అన్నారు . 

    భగవాన్ ధ్యానము గురించి చెప్తూ *తలంపులను ఎప్పుడైతే తీసివేస్తామో అదే ధ్యానమని ఆ తలంపులు ఎప్పుడూ ఉంటాయని వాటిని తొలగించటానికి ఒక సంకల్పముపైన దృష్టిని ఉంచటమే ధ్యానమని అటువంటి అభ్యాసము చేయగా చేయగా మనస్సుకు శక్తి కలుగుతుంది* అని చెప్తూ భగవాన్ తన ధ్యానమార్గము దీనికి భిన్నమైనదని ధ్యానించే వాడినే ధ్యానించాలని అనగా ఆ నేనును పట్టుకుని దాని మూలాన్ని కనుక్కోవాలని ఇలా చేయగా నిజమైన నేను అనగా ఆత్మ స్వరూపముగా మిగులుతుందని చెప్పారు . అసలు నేను అను తలంపు పుట్టిన తరువాతే ఈ నేనును ఆశ్రయించుకొనే మరెన్నో తలంపులు పుడతాయని కావున ఈ నేనెవరు అని నిరంతరం ప్రశ్నిస్తే ఈ నేను అదృశ్యమై నిజమైన నేను తెలుస్తుందని భగవాన్ చెప్పినారు . భగవాన్ దీనికొక ఉపాయాన్ని కూడా చెప్పినారు . నిద్రపోయే ముందు మరియు మేల్కొనిన తరువాత నేనెవడనని ప్రశ్నించుకోమన్నారు . ఈ నేను అనునది ఆత్మ నుండి పుట్టుకు వస్తుంది కనుక నేనుపై ధ్యాస ఉంచి నేనును పట్టుకుంటే ఆత్మలోకానికి వెళ్తామని భగవాన్ రహస్యాన్ని చెప్పినారు .* అసలు ఆత్మను తెలుసుకున్నవాడే నిజమైన పుట్టినవాడని ఆ రోజే పుట్టిన రోజని చెప్పారు* . కావున భగవాన్ సూచించిన దేమనగా ప్రతి మనిషిలో రెండు నేనులుంటాయని ఒకటి మిథ్యా నేను మరియొకటి సత్యమైన నేను . తన్ను తాను విచారించగా మిథ్యానేను అదృశ్యమై నిజమైన నేను మిగుల్తుందని ఇదే ముక్తి మరియు మోక్షమని భగవాన్ చెప్పారు . *కావున ముక్తి అంటే మరియు మోక్షమంటే అవేవో మనము మరణించిన తరువాత మరేదోలోకములో పొందుతామని కాదు . ప్రతివారు ఆ రెండు నేనులలో ఉన్న మిథ్యానేనును తొలగించుకొని అసలైన నేనును పట్టుకుంటే ఆ పట్టుకున్నవాడు తాను జీవించి ఉండగనే ముక్తుడౌతాడు . అనగా అతడే జీవన్ముక్తుడు . అతనికే మోక్షము కలిగినట్లు* . మరి ఈ మిథ్యానేనును వదులుటకు మరియు అసలైన నేనును పట్టుకొనుటకు కావలసిన శక్తిని భగవాన్ని మనమందరము వేడుకుందాం . మనము జీవించి ఉండగనే జీవన్ముక్తులగుదాం . మోక్షమును పొందుదాం . కావున ఆ భగవానుని పరిపూర్ణముగా సర్వశ్య శరణాగతి అంటూ వేడుతూ ఓ భగవాన్ నీవే మాకు శరణాగతి .
 అరుణాచల శివ.  

No comments:

Post a Comment