Sunday, February 5, 2023

🧘‍♂️92 - శ్రీ రమణ మార్గము🧘‍♀️* *భేదభావ నిర్మూలన:-*

 *🧘‍♂️92 - శ్రీ రమణ మార్గము🧘‍♀️*


*భేదభావ నిర్మూలన:-*

‘భారతజాతి ప్రగతి సాధించాలంటే వర్ణాశ్రమ ధర్మాన్ని అంతం చేయాలి గదా?’ అని అరుణాచల రమణుణ్ణి, ఆయన దర్శనార్థమై వచ్చిన ఓ పెద్దమనిషి అడిగాడు. అందుకు రమణుడు, 'వర్ణాశ్రమం అవసరమో, అనవసరమో చెప్పడానికి ఎలా వీలవుతుంది? ఇలాంటి విషయాల మీద నేనేమీ చెప్పజాలను. వర్ణాశ్రమ ధర్మంపై మీ అభిప్రాయమేమిటని, వచ్చిన వాళ్ళు నన్నడుగుతుంటారు. నాకు తోచినది నేనేదైనా చెప్తాననుకోండి, అది తీసుకువెళ్లి పత్రికల్లో వేసుకుంటారు. ఫలాని ఆయన కూడా ఈ అభిప్రాయం వెలిబుచ్చాడంటారు. ఏ శాస్త్రాలైతే ఈ వర్ణాశ్రమ ధర్మాన్ని ప్రతిపాదించాయో అవే శాస్త్రాలు ఈ జీవులందరూ ఒకటేననీ, వీరి యెడల అభేద బుద్ధి కలిగి ఉండటం ఒక్కటే వాస్తవమనీ కూడా చెప్పాయి. జీవులందరూ ఒకటేననీ, సమస్త జీవరాశి వెనుక ఉన్నదొక్కటేనని చెప్పడం కంటే, గొప్ప సత్యాన్ని బోధించడం సాధ్యమా? జాతినంతా సంస్కరించే ముందు, మనిషి ప్రథమంగా తనను తాను సంస్కరించుకోడం ఎంతైనా అవసరం. ప్రతి మనిషి మొదట తన స్వరూప స్వభావాలు ఏమిటో తెలుసుకోవడం అత్యవసరం. ఇది చేసిన తర్వాత, దేశాన్ని కానీ జాతిని కానీ సంస్కరించాలి అని భావిస్తే సంస్కరణకు పూనుకోవచ్చును. (అవిభక్త పంజాబ్ కి చెందిన) స్వామి రామతీర్థుడు ఓ మారు ఒక ప్రకటన వంటిది జారీ చేశాడు. “సంస్కరణకర్తలు కావాలి - కానీ ముందు తమని తాము సంస్కరించుకున్న వారే ఇందుకు అర్హులు సుమా !” అన్నాడు.

ఈ లోకంలో ఏ ఇద్దరూ ఒకలాగా వుండరు, ఒకే మాదిరిగా కర్మను ఆచరించరు. మనము తొలగిద్దామని ఎంతగా ప్రయత్నించినప్పటికీ మనిషికీ మనిషికీ బాహ్యంగా కనిపించే భేదాలు ఉండి తీరుతాయి. సంఘ సంస్కర్తలనబడేవారు ఈ వర్ణాశ్రమం సృష్టించిన భేదాలను అంతం చేద్దామని ప్రయత్నించారు. వారు ఆ ప్రయత్నంలో విజయం సాధించకపోగా, తమ ప్రయత్నం ద్వారా మరికొన్ని వర్ణాలను, అనగా బ్రహ్మ సమాజీయులు, ఆర్య సమాజీయులు అనే వర్ణాలను మాత్రం సృష్టించారు. 

అందువల్ల ఎవరికి వారు తమ నిజ స్వరూప స్వభావాలను కనుగొనడం ఒక్కటే మార్గం" అని సమాధానమిచ్చాడు.

శ్రీ రమణుణ్ణి గురించి కృష్ణ భిక్షు అనే శిష్యుడు ఒక చిన్న ఉదంతం చెప్పుకొస్తాడు. ఒక మారు రమణుడు ఆశ్రమ భోజనశాలలో కూర్చొని ఉన్నప్పుడు, తాను బ్రాహ్మణుడని కానీ, బ్రాహ్మణేతరుడని కానీ తనకు అనిపించదు అని అన్నాడు. అందువల్ల తాను వర్ణాశ్రమ ధర్మానికి చెందని 'అతి ఆశ్రమి'గా పేర్కొనవచ్చునన్నాడు.

రమణుడు జీవించిన రోజుల్లో భోజనశాల మధ్యగా ఒక తెర కట్టేవారు. బ్రాహ్మణులందరూ ఒక వంక కూర్చునేవారు. బ్రాహ్మణేతరులు తెరకు అవతల పక్కన కూర్చుండేవారు. రమణుడు తెర కట్టిన చోట దానికి ఎదురుగా గోడ వద్ద భోజనానికి కూర్చొనేవాడు. ఏకకాలమందు తెర ఇవతల అవతల నున్నవారికి కనిపిస్తుండేవాడు. ఒక రోజున రమణుడి బంధువైన ఒక బ్రాహ్మణుడు తాను వెళ్ళి బ్రాహ్మణేతరుల నడుమ కూచుంటానన్నాడు. ఆశ్రమ సర్వాధికారి అంగీకరించలేదు. వారిద్దరూ ఆ విషయమై వాదులాడుకుంటూ ఉండగా, రమణుడు ఆ సమయానికి అటు వస్తూ విషయమేమిటని అడిగాడు. “ఇతడు తాను ఏ కులానికి చెందనివాణ్ణి అంటున్నాడు. శ్రీ రమణుల సమక్షంలో అందరూ సమానులేనట. తాను కేవలం మనిషినే కానీ, తనని ఈ కులమతాలు, జాతి భేదాలు బంధించలేవనీ, అందువల్ల తాను వెళ్ళి బ్రాహ్మణేతరుల మధ్య కూచుంటానంటున్నాడు” అని వివరించాడు సర్వాధికారి.

“అలాగా?” అంటూ రమణుడు తన ఆశ్చర్యాన్ని ప్రకటిస్తూ, “అలాగైతే, అతణ్ణి బ్రాహ్మణుల మధ్యే కూచొని భోజనం చేయమని నువ్వు బలవంతపెట్టటం భావ్యం కాదు.” అని సర్వాధికారితో అంటూ, ఇటు తన బంధువు వంకకు తిరిగి “కానీ నీదీ పొరపాటే. తెర ఇవతల కూచున్న వీరంతా తాము బ్రాహ్మణేతరుల మనుకుంటున్నారు. నువ్వా, కులభేధం లేనివాడివైతివి. మరి కులాన్ని గుర్తుంచుకున్నవారి మధ్య నువ్వు ఎలా కూర్చుంటావ్? తాను బ్రాహ్మణుడిని కానీ బ్రాహ్మణేతరుణ్ణి అని కానీ గుర్తించని మనిషిని ఇక్కడ నేనొక్కణే ఉన్నాను. అందువల్ల నువ్వు నాతో కూర్చోవచ్చు" అంటూ అక్కడున్న ఒక సహాయకుణ్ణి పిలిచి “ఇతడికి నా పక్కనే ఒక విస్తరి వేయండి. నాతోనే కూర్చొని భోంచేస్తాడు" అన్నాడు. రమణుడి బంధువైన ఆ యువకుడికి, మహానుభావుడైన శ్రీ రమణుడి సరసనే కూచొని, తానూ కులభేదానికి అతీతంగా ఎదిగానని ప్రకటించుకోడం దుస్సాహసమనిపించి, మారు మాటాడకుండా వెళ్లి బ్రాహ్మణ పంక్తిలో కూచున్నాడు.

ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించాల్సింది రమణుడికి, అతడి బంధువుకీ, మానసిక స్థితిలోనున్న తేడా. మనమందరం ఆ యువకుడి వంటి వారమే. ఆలోచనా పూర్వకంగా “మేము కులమత భేదాలు పాటించడం లేదని” ఆర్భాటంగా ప్రకటించవచ్చును. కానీ బలవంతంగా సాధించిన ఈ భేద భావ నిర్మూలన ఎక్కువ కాలం నిలవదు. ఆలోచన అనేది ఎప్పుడూ ఏదో ప్రయోజనము ఆశిస్తునే ఉంటుంది. ఐడియా, ఐడియాలజీ, ఆదర్శం మొదలైన వాటి ఆధారంగా నిర్మించుకున్న సిద్ధాంతాలన్నీ కూడా ఆలోచన నుండి జనించేవే. వీటన్నిటికీ చివరకు ఫలితం దక్కాలి. మనసు ఊహించిన ఒక అనుభూతి కలగాలనే ఆశ ఉంటుంది.

 మనసులో ఆ ఆశ ఉన్నంతకాలం, ఆశాభంగమూ, దాని వెన్నంటే ఉంటుంది. ఏదో ఒకనాడు ఎక్కడో ఆశాభంగం జరగక తప్పదు. వర్గ విభేదాలు నశింపజేయడానికి ఆలోచనా పూర్వకంగా ప్రయత్నించి, అతి పెద్ద విప్లవాలు లేవదీసిన వారు, అందుకు అనుకూలంగా రాజ్యాలు నెలకొల్పిన వారు కూడా, మనుష్య స్వభావాన్ని బలవంతంగా మార్చలేక నిరాశోపహతులైనారు.

భేదభావం, వర్ణ, వర్గ విభేదాలు, నశించే వీలున్నది. అయితే అది ఆలోచనతో సాధించలేము. వాస్తవాన్ని దర్శిస్తేనే నశిస్తుంది. భేదాలు సృష్టించేది ఈ మనసేనని కనుగొన్నప్పుడు, ‘లేని భేదాన్ని పట్టుకు వేళ్ళాడుతున్నానని, భ్రమపడి తిరుగుతున్నానని తెలిస్తే, భేదభావం దానంతట అదే రాలిపడిపోతుంది.

కాబట్టి చేయవలసిన ప్రయత్నం, భేదం తొలగించడానికై కాదు. మనసు ఈ ‘లేని భావాన్ని’ ఎలా సృష్టించుకున్నదీ, ఎందుకు సృష్టించుకున్నదీ, దీని ఫలితంగా తన దృష్టి ఎలా సంకుచితమైనదీ, అనే విషయాలన్నీ తనలో తాను అమూలాగ్రంగా కనుగొనాలి. 
సంఘపు విలువలను తాను ఎందుకు గౌరవిస్తున్నదీ, ఇందులో నుండి బయలు దేరుతున్న క్రౌర్యంలో తానెలా పాలుపంచుకొంటున్నదీ, అన్నీ గనక కంటికి నిజంగా కనిపిస్తే, భేద భావం నశిస్తుంది.

పులిని చూచి నక్క వాత పెట్టుకున్నట్లుగా, శ్రీ రమణుణ్ణి చూచి అతడ్ని అనుకరిద్దామని వ్యర్థంగా ప్రయత్నించిన అతడి బంధువులాగా కాకుండా, నిజంగా భేదం నశించి రమణుని మానసిక స్థితి ఏమిటో అర్థం చేసుకొని, దాని నందుకోవాలి.

*వ్యవహారదశ సమాధి - ·*

వ్యవహార దశలో కూడా సమాధి వున్నది. సమాధిని విడిచి మన వ్యవహారానికి ప్రత్యేక సత్తా లేదు. బొమ్మలు ప్రదర్శితమౌతున్నా కాకపోయినా, సినిమా తెర ఉండనే ఉన్నది. అదే రీతిగా వ్యవహారంలోనూ శాంతిలో కూడా ఆత్మ నిత్య సిద్ధమే.

No comments:

Post a Comment