సీతాదేవి గుణగుణాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి.............!!
స్త్రీ పాత్ర ‘సీత' లేనిదే రామాయణం లేదు. సీత లేకుండా రాముని జీవితాన్ని అసలు ఊహించలేము. కాబట్టే రామాయణ ఇతిహాసంలో ఆమె పాత్రపై ఎందరో మహానుభావాలు మరియు మేథావులు పరిశోధనలు కూడా చేశారు. సీతలోని సుగుణాలు నేటి మగువలకు ఎంతో ఆదర్శం. ఆమె చరితం ఓ స్ఫూర్తిదాయకమైన కథాసాగరం.
రామాయణంలో ఏ ఘట్టం తీసుకున్నా సీత గుణగుణాలు ప్రతి ఒక్కరికీ ఎంతో ఆదర్శప్రాయంగా నిలుస్తాయి...
* ధర్మమూర్తి
సీత ఒక ఇల్లాలిగా తన భర్త బాధ్యతలో, కర్తవ్య దీక్షలో తను కూడా పాలుపంచుకొని ఆదర్శ గృహిణిగా మారిన మహాసాధ్వి ‘సీతాదేవీ'. రాముడు తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి అరణ్యవాసానికి వెళ్లినప్పడు తన భర్త అడుగుజాడల్లో తనూ నడిచి, అతని కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి సిద్దమైన ధర్మపత్నిగా తన ధర్మాన్ని నిర్వర్తించింది.
* దయాశీలి
పేదవారిని ఆదరించి అన్నం పెట్టాలన్న దయాగుణం గల స్త్రీమూర్తి సీత. అదే భావనతో తనింటికి మారువేషంలో బిక్షాటన వచ్చిన రావణుడికి లక్ష్మణరేఖ దాటి మరీ భిక్షం వేసిన దయామూర్తి ఆమె. తన రక్షణ కోసం పెట్టుకున్న నియమం కన్నా దానమే గొప్పదన్న నీతిని ఆమె ఈ సందర్భంలో వెల్లడిస్తున్నది.
* ధైర్యశాలి
పాతివ్రత్య నిరూపణ కోసం సీతను అగ్నిప్రవేశం చేయమని రాముడు అడిగినప్పుడు ధీరత్వంతో ఆ పనికి సిద్ధమైన ధైర్యశాలి సీత. రాముని మాటలు ఆమె గుండెను గాయపరిచినా సహనంతో భరించింది. తానే తప్పు చేయలేదన్న ఆమె ఆత్మవిశ్వాసం చివరికి నిందారోపణ చేసిన వారిని సైతం తలదించుకునేలా చేసింది.
* అభిమానవతి
సీతకు ఆత్మాభిమానం ఎక్కువ. చిత్రకూటానికి సీతారాములు వచ్చారని తెలిసి, ఆమె తండ్రి జనకుడు వారిని కలిసి వనవాసం పూర్తయ్యేదాకా మిథిలా నగరానికి వచ్చి తనతో పాటు ఉండమని కోరినప్పుడు, ఆ మాటలను సున్నితంగా తిరస్కరించిన ఆత్మాభిమాని సీత. మెట్టినింటి కొచ్చాక ఎన్ని విషమ పరిస్థితులు
ఎదురైనప్పటికీ తమే పరిష్కరించు కోవాలి గానీ, పుట్టింటి వారిని ఇబ్బంది పెట్టకూడన్న అభిమానవతి సీత.
* వివేకవంతురాలు
రావణాసురుడు తనను అపహరించి తీసుకెళ్లిపోతున్నప్పుడు, రాముడికి తన ఆనవాళ్లు చిక్కడం కోసం బంగారునగలను నేల మీద జారవిడిచిన వివేకవంతురాలు సీత.
* ప్రేమమూర్తి
సీతకు రామునిపై ఎంతటి ప్రేమానురాగాలంటే..ఆ ప్రేమలో తనను తానే మైమరిచిపోయేది. రావణుడి చెరలో బందీగా ఉండి కూడా నిత్యం శ్రీరామనామస్మరణ చేస్తూ అనుక్షణం పతి క్షేమాన్ని కోరేది.
* చైతన్యశీలి
సీత ఎంత చైతన్యశీలి అంటే అపాయంలో కూడా భయంతో ఆమె శత్రువులకు లొంగలేదు. రావణడు సీతను బెదిరించి, తన వశం కావాలని ఆదేశించినప్పుడు, ఒక గడ్డిపరకను అడ్డంగా పెట్టుకొని నువ్వు నాకు దీనితో సమానం అని చెప్పకనే చెప్పి అతని ధర్మహీనతను ప్రశ్నించిన ప్రజ్ఝావంతురాలామె.
* క్షమాగుణం
రాక్షస సంహారం తర్వాత సీతను అవోకవనం నుంచి విడిపించి తీసుకువెళ్తున్న సమయంలో, తను బందీగా ఉన్నప్పుడు ఆ వనంలో తనను మాటలతో హింసించిన రాక్షసులకు ఏ కీడు తలపెట్టవద్దని, వారు స్వామిభక్తితో తమ బాధ్యతను మాత్రమే నిర్వర్తించారని హనుమంతునితో చెప్పిన క్షమాగుణం సీత సొంతం.
* ఆదర్శమూర్తి
అడవిలో ఆశ్రమవాసిగా కాలం గడుపుతూ కూడా తన కుమారులను ప్రయోజకుల్ని చేయాలని ఎల్లవేళలా తపిస్తూ, వారిని కార్యసాధకులుగా తీర్చిదిద్దడం ఆమె ఉత్తమ పెంపకానికి నిదర్శనం.
No comments:
Post a Comment