🌹 *ధర్మ సందేహాలు* 🌹
*(శ్రీహరిప్రియ గోష్టి నుండీ)*
(సేకరణ: పి. యల్. నరసింహాచార్య దాసన్)
(14.2.23)
*(కోపాన్ని జీవితములో ఎలా అధిగమించాలి?)*
*మౌనంగానే ఎదగమనీ ఎదిగేకొద్దీ ఒదగమనీ చెట్టు మనకు చెబుతుందీ...*
ఎన్ని కష్టాలెదురైనా వెనక్కు తగ్గకూడదనీ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలనే జీవిత సత్యాన్ని ప్రతి ఒక్కరూ అవలంభించాలనీ...మెట్లెక్కుతూ పోవాలనీ ...మొదటి ప్రయత్నములో ఓటమినెదుర్కుంటే చేయాలనుకున్న కార్యాన్ని విరమించుకోరాదనీ నిరాశచెందరాదనీ మనకు ఎందరో ఋషులు చెప్పినారు కదా? విశ్వామిత్ర మహర్షి ఎలాంటి నిష్పృహ చెందకుండా ఎలా సాధన
చేసి చివరకు బ్రహ్మర్షి పదవిని సాధించాడో ~ ఆ మహర్షి మనకు ఆదర్శము కావాలి.
దెబ్బలు తిన్న శిల శిల్పమవుతుంది ~ ఆలయాన వెలసి పూజలందుకుంటుంది.
గాయాలపాలైన వెదురు వేణువౌతుంది.
చీదరింపులకు గురయ్యే గొంగళిపురుగు సీతాకోక చిలుకగా
అవతరిస్తుంది.
నలిగిన గింజలే కడుపు నింపుతాయి కదా?
కరిగితేనే కొవ్వొత్తి కాంతినివ్వగలుగుతుంది.
మనోవేదనే బొయవాడిని ఆదికవి వాల్మీకిని చేసింది.
అరణ్యవాసాన్ని చేసినందుకే శ్రీరాముడి జీవన గాధ రామాయణ ఇతిహాసకావ్యమయ్యింది కదా?
నిచ్చెన మెట్లు ఎక్కితే కాళ్ళు నొప్పి పెడుతాయంటే నీ జీవితయానములో ఉన్నత శిఖరాలనెలా ఎక్కుతావు? అవరోధాలకు జంకితే సాహసాలను చేయలేము కదా?
దాని తలమీద అనేక దెబ్బలు తగిలితేనే మేకు లోపలివరకూ దిగుతుంది.
చిన్న మొక్క తుఫాను గాలివానలకు తట్టుకోకపోతే ఎలా వటవృక్షమై ఎదుగుతుంది?
విల్లును వంచితేనే బాణము ముందుకు దూసుకుపోతుంది.
మండితేనే మందుగుండు ప్రేలుతుంది.
అపజయాలకు వైఫల్యాలకు బెదిరిపోకుండా ధైర్యంగా ముందుకు పోవాలి.
అందుకే మన పెద్దలు ఇలా అన్నారు:⬇️
Failure is a stepping stone to achieve a goal in our life.
కష్టాలు, కడగండ్లు చుట్టు ముట్టినపుడే మన మనస్సు బాధపడుతుంది; దుఃఖము, కోపము కట్టలు తెంచుకుంటుంది.
దాని ఫలితంగా మనము విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి అంతఃసంగర్షణకు లోనవుతాము.
ఆ బలహీన క్షణాలలో జరుగుతున్న దాన్ని జాగ్రత్తగా గమనిస్తే విఫలంగావడము వల్ల వచ్చే కోపము చైతన్య శక్తికి ప్రతిరూపమేనని తేటతెల్లమవుతుంది.
అందులే కోపతాపాలను జయించి తీరాలి ~ ఆటు పోట్లను తట్టుకుని ఎదగాలి గమ్యాన్ని చేరేవరకూ.
నిరాశ నిస్ప్రుహలకు లోను కాకూడదు.
ఇదే జీవిత సత్యము...
No comments:
Post a Comment