Tuesday, February 28, 2023

ఆత్మజ్ఞానం

 🪔🪔 ఆత్మజ్ఞానం🪔🪔

🌹తనను తాను తెలుసుకోవడాన్నే ఆత్మజ్ఞానం లేదా ఆత్మజ్ఞత అంటారు ఆధ్యాత్మిక వేత్తలు. అన్ని జ్ఞానాల కన్నా మహోన్నతమైన జ్ఞానమిది! దీన్ని గురువులు బోధించరు. విద్యాలయాల్లో చెప్పరు. గ్రంథ పఠనం వల్ల సమకూర్చుకోలేం. అయినప్పటికీ సులభంగా పొందగలం. దానికి మార్గం హృదయ పరిపక్వత, పరిశుద్ధత, ఆత్మాన్వేషణ, ఆత్మావలోకనం. 

🌹వీటన్నింటిలో ఎవరికి వారు తామంత తాముగా ప్రయత్నం చేస్తేనే అది సాధ్యం. ఆ సాధనను ఆత్మశోధన అంటారు.ఆత్మాన్వేషణకు నిర్మలమైన మనసు, సరళమైన ఆలోచనా విధానం ఉండటం ముఖ్యం. అవి ఆత్మ పరిపక్వత, సత్యాన్వేషణ, సదసద్వివేచనలకు కొంతవరకు ఉపకరిస్తాయి. అవే మహాద్భుత రహస్యాలను సైతం వెల్లడిస్తాయి. ఆ పరిపక్వత స్థాయిని నిర్ణయించడం, నిర్ధారించడం సామాన్యులకు శక్యం కాదు.

🌹గీతాంజలిలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఒక చోట 'కష్టసుఖాలను సమానంగా తట్టుకునే శక్తిని నాకివ్వు భగవంతుడా!' అంటారు. ఆ మాటలు చదివిన చాలామందికి 'కష్టసుఖాలను సమానంగా తట్టుకునే శక్తి ఇమ్మని అడిగే బదులు అవి లేకుండా చేయమని అడగవచ్చు కదా?' అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ ఆత్మావలోకనం చేసుకునే ఆలోచన, జ్ఞానం ఉన్నవాడు కాబట్టే అలా అడిగాడు. 

🌹నిన్న ఉన్న సంతోషం రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అలాగే ఈ రోజు ఉన్న కష్టం రేపటికి ఉండకపోవచ్చు. కష్టసుఖాలు వచ్చిపోయే బంధువుల్లాంటివి. ఇహలోక బంధాలన్నీ ఆ కోవకే చెందుతాయి. ఆయా క్షణాల్లోనే మనిషిలోని బలహీనతలు బయటపడి అతడి అసలు స్వరూపం బహిర్గతం అవుతుంది. అందుకే ఆ క్షణం కాస్త ఓర్చుకోగలిగితే మనిషి మహోన్నతుడవుతాడు. అలా కావాలనుకునేవారు కోరుకోవలసింది తట్టుకునే శక్తినే కాని, అవి లేకుండా చేయమని మాత్రం కాదు.

🌹స్వామి వివేకానంద ఒక ప్రసంగంలో 'నేను కొన్ని ఒప్పులు చేసి, చాలా విషయాల్లో తప్పులు చేసినందుకు సంతోషిస్తాను. ఎందుకంటే వాటినుంచి నా జీవితంలో గొప్ప పాఠాలు నేర్చుకొన్నాను. కాబట్టి. తెలివైనవారు తమ తప్పును వెంటనే తెలుసుకొని, మంచి మార్గంలో వెళ్ళే ప్రయత్నం చేస్తారు. వారు చేసిన పొరపాట్ల నుంచి మరిన్ని కొత్త పాఠాలను నేర్చుకొని, తమ జీవితాన్ని ఉత్తమ భావాలతో, ఆదర్శాలతో నింపి పురోగతి చెందుతారు. దీన్నే ఆత్మాన్వేషణ' అంటారు.

🌹ఇలా ఎవరికి వారే తమలోనే ఓ విమర్శకుణ్ని పెంచి పోషించుకోవాలి. తమ ప్రతి ఆలోచనను, ఆచరణను ముందు ఆ విమర్శకుడి విచక్షణకు వదిలివేయాలి. అక్కడి నుంచి సరయినదన్న అభిప్రాయం వచ్చాక, ఇక ఎవరి విమర్శకూ మనం వెరవనక్కరలేదు. మనలో తీర్చిదిద్దుకున్న ఆ విమర్శకుడు అంతరాత్మలా నిరంతరం మనకు మార్గనిర్దేశం చేయాలి. మన తప్పొప్పుల్ని మనమే సమీక్షించుకుంటూ, మనకున్న శక్తుల్ని మనమే సమీకరించుకుంటూ ముందుకు సాగిపోతే అదే అసలైన ఆత్మజ్ఞానం.🙏

- ✍️అయ్యగారి శ్రీనివాసరావు

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment