Tuesday, February 28, 2023

అంతర్యామి - 34* 🥀 *పనే పరమేశ్వరుడు!*

 *అంతర్యామి - 34*
     🥀 *పనే పరమేశ్వరుడు!* 🥀
           ✍️ *డాక్టర్‌ పులిచెర్ల సాంబశివరావు*
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️

చేస్తున్న పని పట్ల శ్రద్ధ కనబరిస్తే అది పలువురి ప్రశంసలు పొందుతుంది. ఫలితం బాగుంటుంది. ఏడుపు ముఖంతో ఇష్టం లేకుండా చేసేపనికి ఫలితం ఏడుస్తున్నట్లే ఉంటుంది. ఈ సూత్రం అన్ని రంగాలకూ వర్తిస్తుంది. యజమానులు తమ అంచనాలకు తగ్గట్టుగా పనిచేసే వారిని ఇష్టపడతారు. 

అందరికీ అసలు యజమాని *పరమేశ్వరుడు.* మానవత్వంతో ప్రవర్తించే మనుషులంటే ఆయనకు పరమప్రియం. *‘కాయకమే కైలాసం’* అని చాటిన బసవేశ్వరుడు *‘పని చేయడమే కైలాసం చేరుకునే మార్గం’* అని భావించాడు. తనను ఆడంబరాలతో తెగ పూజించే వారికంటే, లభించిన వృత్తినే పరమ పవిత్రంగా భావించి నిజాయతీతో పనిచేసే వారిని ఈశ్వరుడు ఇష్టపడతాడు. 

బసవ పురాణంలో వర్ణించిన కష్టజీవుల కథలు ఇందుకు నిదర్శనం.

ఆధ్యాత్మిక మేరు శిఖరం ఆదిశంకరులు. *‘ఆధ్యాత్మిక తత్త్వాన్ని మాత్రమే సాధించండి... ప్రాపంచిక జీవితాన్ని వదిలేయండి!’* అని ఆదిశంకరులు చెప్పలేదు. అదే ఆయన బోధనలో విశిష్టత. జీవధర్మాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహించమని బోధించారు. 

మానవ జీవనధర్మం కర్తవ్య నిర్వహణ. మహాత్ముల జీవనవిధానం చూస్తే పని ప్రాధాన్యం తెలుస్తుంది.

కోల్‌కతాలో డాక్టర్‌ మహేంద్రనాథ్‌ పేరు ప్రఖ్యాతులున్న వైద్య శిఖామణి. ఆ వృత్తిలో రెండు చేతులా సంపాదించాడు. రామకృష్ణ పరమహంస గురించి విని ఆయనను దర్శించడానికి వెళ్ళాడు. పూలతోట వద్దకు వెళ్ళేటప్పటికి,  *‘పరమహంస వద్దకు వట్టి చేతులతో పోకూడదు. పూలు సమర్పిస్తే బాగుంటుంది...’* అనిపించింది. తోటలో ఒక వ్యక్తి పనిచేస్తూ కనబడ్డాడు. ‘ఏయ్‌ తోటమాలీ! మంచి పూలు కొన్ని కోసి ఇవ్వు’ అని అడిగాడు మహేంద్రనాథ్‌. ‘మీకు పూలతో పనేమిటి?’ అని అడిగాడు పనిలో నిమగ్నమైన వ్యక్తి. ‘రామకృష్ణ పరమహంసకు సమర్పించాలి!’ అన్నాడు మహేంద్రనాథ్‌.

ఆ వ్యక్తి ఇచ్చిన పూలు తీసుకొని ఆయన లోనికి వెళ్ళాడు. అప్పటికే చాలామంది భక్తులు అక్కడ పరమహంస దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇంతలో పరమహంస అక్కడకు రానే వచ్చారు. భక్తులందరూ ఆయనకు ప్రణామం చేశారు. మహేంద్రనాథ్‌ నిర్ఘాంతపోయాడు. ఇందాక పూల తోటలో పనిచేస్తున్న వ్యక్తి ఆయన! 

పూలను పరమహంస పాదాలపై పెట్టి,  ‘స్వామీ! ఇందాక మిమ్మల్ని తోటమాలిగా భావించి అలా మాట్లాడాను... మన్నించండి!’ అన్నాడు మహేంద్రనాథ్‌ పశ్చాత్తాపంతో. 

‘నాయనా! తోటపనీ భగవదారాధనే... నువ్వు చేసే పనినే దైవపూజగా భావించు. నీ వృత్తిలో దేవుణ్ని చూడు’ అని పరమహంస బోధించారు.

జనకుడు రాజు. ధనానికి కొదవ లేదు. సంపాదనపై ఆయనకు ఆశ లేదు. అయినా అనునిత్యం కృషి చేస్తుండేవాడు. ఒక సామాన్య రైతు లాగా హలం చేతపట్టి పొలం దున్నుతూ ఉండేవాడు. రుషిలాగా నిరాడంబర జీవితం గడుపుతూ రాజర్షి అని ప్రఖ్యాతి గాంచాడు. ఆయన పొలం దున్నుతున్నప్పుడే సీత లభించింది. జనకుడి జీవితం వాస్తవానికి ప్రతిబింబం. కష్టాలు పడే కుమార్తెకు తండ్రి ఆ రైతు! ఎన్ని కష్టాలు వచ్చినా అనుభవించడానికి సిద్ధంగా ఉండే నిత్య కృషీవలుడు జనకుడు ధన్యజీవి.

కొందరు ఏ పనికీ ముందుకు రారు. ఏం చేయమన్నా ఒకటే సమాధానం - ‘అబ్బే... నాకేం చేతనవుతుందండీ... నా మొహం! నా వల్ల ఏమవుతుంది?’ అని. పని చేయడానికి వాళ్లు ముందుకు రాకపోగా అందరిలో నిరుత్సాహాన్ని నింపుతారు. ఆత్మవిశ్వాసమే ఇందుకు మందు. 

అర్జునుడు కురుక్షేత్రంలో ముందు నిరుత్సాహానికి గురవుతాడు. పార్థసారథి అర్జునుణ్ని తన గీతా ప్రబోధంతో కర్తవాన్ని గుర్తుచేసి, ఉత్సాహవంతుడిగా మార్చి విజయుణ్ని గావించాడు.

*లోకాస్సమస్తా సుఖినోభవంతు*

*Courtesy* : *ఈనాడు*

🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

No comments:

Post a Comment