Tuesday, February 28, 2023

అంతర్యామి - 33* 🥀 *వినయమే విజయగానం* 🥀

 *అంతర్యామి - 33*
      🥀 *వినయమే విజయగానం* 🥀
             ✍️ *వెంకట్ గరికపాటి* 
✍️🌹🌹🌹🙏💐🙏🌹🌹🌹✍️

మనిషి ఎంతటి ఉన్నత స్థాయిలో ఉన్నా, వినయం లేకపోతే - ఆ మనిషి సాధించిన ఉన్నతి కానీ, చదువుకున్న చదువు కానీ శోభించవు. మనిషి ఎండలోగానీ, వానలోగానీ ఇబ్బంది పడకుండా గొడుగు ఎలా రక్షిస్తుందో, ఆదే విధంగా మనిషికి వినయం అన్ని సందర్భాల్లోనూ, సర్వవేళల్లోనూ రక్షకవచంగా నిలుస్తుంది. *'విద్యాదదాతి వినయం'* అనేది ఆర్యోక్తి. 

నిజమైన వినయంతో చరించి, జనులను కార్యాలను సాధించమని తెలపడమే విద్య పరమార్ధం.  విద్యవల్ల పండితుడు గర్వించక వినయాన్ని కలిగి ఉంటేనే ఆ విద్య ఉన్నతమైనది ఆవుతుంది. అటువంటి ఉన్నత విద్యను కలిగి ఉన్నవాడే జగతిలో ఉత్తముడిగా నిలిచి, జనహితానికి పాటుపడగలడు.

శ్రీరామచంద్రుడు దశరథ చక్రవర్తి కుమారుడే అయినా, ఎడతెగని వినయాన్ని ఆభరణంగా కలిగినవాడై, నిరాడంబరంగా మహర్షి విశ్వామిత్రుడితో వనాల్లో పాదచారియై చరించి, ఆయన తల పెట్టిన యజ్ఞసంరక్షణా విధిని నిర్వర్తించాడు. ఆ క్రమంలోనే అనితర సాధ్యమైన ఎన్నో దివ్యాస్త్రాలను విశ్వామిత్రుడు ఉపదేశించగా వినయశీలియై సాధించాడు.

మహాబలశాలి అయిన ఆంజనేయుడు అతివిశాలమైన జలధిని లంఘించి, సింహికను భంజించి లంకను చేరి సీతమ్మను దర్శనం చేసుకున్నాడు. ఆ తరవాత ఆయన పలికే మాటలు- హనుమ వినయ సంపదకు నిలువెత్తు అద్దం పడతాయి. సీతమ్మతో హనుమ, అమ్మా! నేను నిన్ను అన్వేషించడానికి నియోగితుడైన సామాన్యుడిని. సాధారణంగా లోకంలో ఏదన్నా కార్యాన్ని తల పెట్టినప్పుడు ముందుగా తక్కువబలం ఉన్నవారిని వినియోగిస్తారన్న విషయం నీకు తెలుసు కదా! ఆ విధంగా నిన్ను వెదికే క్రమంలో నేను ఈ లంకానగరికి వచ్చాను. నన్ను మించిన మహాబలశాలురు సుగ్రీవుడి సైన్యంలో ఎందరో విరాజిల్లుతున్నారు. వారితో కూడి శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై లంకకు వచ్చి రావణుణ్ని జయించి, నిన్ను చేపట్టగలడు. అంటూ ఎనలేని వినయంతో పలుకుతాడు. దైన్యస్థితిలో ఉన్న సీతాదేవికి శ్రీరాముడి రాకపై, విజయంపై అపార విశ్వాసాన్ని కలిగిస్తాడు. ఒక దూతగానే గాక, కార్యసాధకుడి వర్తనలో చూపవలసిన వినయం హనుమలో మనకు ఎన్నో రామాయణ ఘట్టాల్లో అత్యున్నతంగా దర్శనమిచ్చి, మార్గదర్శనం చేస్తుంది. 

విద్యాధికులకంటే, బలవంతులకంటే వినయసంపన్నులే అప్రతిహత విజయాలను సొంతం చేసుకున్న సంఘటనలు కోకొల్లలుగా మనకు చరిత్రలోనూ దర్శనమిస్తాయి.

అదే నీతి, స్ఫూర్తి పిల్లల కథల్లోనూ ప్రతిఫలిస్తాయి. కుందేలు, తాబేలు కథ - వినయంగా వర్తించడం వల్ల కలిగే ప్రయోజనాన్ని మనకు సాక్షాత్కరింపజేస్తుంది. ఒకసారి ఒక తాబేలు, కుందేలుతో పందెం వేసుకుని, ఎవరు ముందుగా నిర్దేశిత గమ్యాన్ని చేరగలిగితే వాళ్లదే విజయం అన్నప్పుడు - కుందేలు గర్వంతో విర్రవీగింది. నిదానపు నడకకు మారు పేరైన తాబేలు తనను ఏ విధంగానూ గెలవలేదని భావించి, సగం దూరం దాటాక నిద్రించింది. తాబేలు ఎటువంటి తొట్రుపాటూ లేక, ముందుకు సాగి గమ్యం చేరి విజయాన్ని సాధించింది.

వినయంతో కూడిన విద్య మనలో నిలువెల్లా నిండినప్పుడు విశ్వంలోని ప్రతి అంశాన్నీ సమదృష్టితో చూస్తూ, నియతితో ముందుకు సాగగలమంటుంది భగవద్గీత. అది అక్షర సత్యం. అందరిలో సమభావం తొణికిసలాడితే, ఈ ప్రపంచమంతా ఒక ఆనందాల పొదరిల్లుగా, శుభాలతో నిండి వర్ణరంజితమైన హరివిల్లుగా పరిఢవిల్లుతుంది.

*Courtesy* : *ఈనాడు*
🙏 *లోకాస్సమస్తా సుఖినోభవంతు*
🙏 *సర్వే జనాః సుఖినోభవంతు* 
🚩 *హిందువునని గర్వించు*
🚩 *హిందువుగా జీవించు*

*సేకరణ:*

No comments:

Post a Comment