Tuesday, February 28, 2023

శివాద్వైతం

 *శివాద్వైతం*
             ✍️ డా. శ్రీ గరికపాటి నరసింహారావు గారు.
⚜️🌹🪷🌹🪷🕉️🌹🪷🌹🪷🔱

🔱 *అన్నింటిలోనూ తానై ఉన్నవాడు... జగమంతా తానే అయినవాడు శివుడు. యోగమూ శివుడే... భోగమూ శివుడే. ఆయనది ప్రధానంగా జ్ఞానదృష్టి, ఆయనకు ఎక్కువ తక్కువల పట్టింపు లేదు. సమభావమే ఆయన మతం.* ⚜️

🔱┉┅━❀🕉️❀┉┅━⚜️

⚜️ జీవుడికీ దేవుడికీ భేదం లేదన్నారు ఆదిశంకరులు. ఆ అభేదం... ఆ అద్వైతం... ఆ జ్ఞానాన్ని పొందడానికే శివరాత్రిని పెద్దలు ఏర్పరిచారు. ఆనాడు తిండి, బట్ట, నిద్ర అనే ప్రాధమిక అవసరాలను వదిలిపెట్టి శివధ్యానం చేయాలి. సదాశివుణ్ణి సోహం భావనతో పూజించాలి. మనసులోని భేదభావాలు పోవాలి. అంతర్ముఖులమై శివదర్శనం చేయాలి. 

🔱 *నమశ్శివాయ* అనే పంచాక్షరిని ప్రాణవాయువుకు జోడించాలి. రేచక, పూరక, కుంభకాలతో మంత్రాన్ని జోడిస్తే దానిని మంత్రశాస్త్రంలో సగర్భజపం అంటారు. అలా కొద్దిసేపు జపం చేసినా చాలు... జపసాధన పరమార్గంగా లభించవలసిన మనశ్శాంతి మనకు తప్పకుండా లభిస్తుంది. అజ్ఞాచక్రంలో శివదర్శనం జరుగుతుంది. ఇదే మనోదృష్టి. కనులు మూసుకున్నా కనిపించేది. అదే నిజమైన శివదర్శనం.

⚜️ సదాశివుడు త్రయంబకుడు. పురాణాల్లో శివుడు మూడోకన్ను తెరిస్తే ప్రపంచం భస్మమైపోతుందని చెబుతారు. ఆ మాటకు అసలైన అర్థం ప్రపంచంలో ఉన్న భేదాలన్నీ పోతాయని. జ్ఞాన నేత్రం తెరుచుకుంటే మనలో దృష్టి మారుతుంది. మన గుండెలో ఉండే ఆత్మయే శివలింగం. దానిని దర్శించగలిగిననాడు అన్ని భేదభావాలు పోతాయి.

🔱 *'నేనే నీవని తెలుసుకో'* అని శివుడు మనకు బోధిస్తున్నాడు. పురాణకాలంలో ఒకనాడు ఇదే *మాఘ బహుళ చతుర్దశి* నాడు బ్రహ్మవిష్ణువులకు మహాగ్నిలింగంగా కనిపించాడు. ఆద్యంతాలు లేని తన తత్త్వాన్ని వారిముందు ఆవిష్కరించాడు. ఆ తత్వాన్ని భావనలోకి తెచ్చుకుంటే మన ఎదురుగా ఉన్న ప్రతిపదార్ధమూ శివుడు. వర్తమానంలోని ప్రతిక్షణమూ శివుడే. మనకు దక్కిన ప్రతి అనుభూతి శివుడే.

*Courtesy:* 'భక్తి' మాసపత్రిక

*సేకరణ:*

No comments:

Post a Comment