Tuesday, February 28, 2023

తొలి ఏకాదశి కధ

 తొలి ఏకాదశి కధ 

ముంబై ఎయిర్ పోర్ట్ లో దిగాక నెమ్మదిగా అమ్మమ్మని చేయిపట్టుకొని నడిపించుకుంటూ వెళ్తూ అడిగాడు ఆదిత్య. "అమ్మమ్మా ! నీ ఆధార్ కార్డు రెడీగా ఉందా ? "

"ఆధార్ కార్డు, పెన్షన్ బుక్కు రెండూ రెడీగా వున్నాయిలేరా ?" అంది మనవడితో ఆప్యాయంగా, మురిపెంగా. 

గేట్ దగ్గర ఆవిడ ఐడెంటిటీ చెక్ చేశాక సెక్యూరిటీ గార్డు "వీల్ చైర్ తెప్పించమంటారా ?" అని ఆదిత్యని ఇంగ్లీషులో గౌరవంగా అడిగాడు.  

"ఐ కాన్ వాక్ ! గాడ్ ఈజ్ కైండ్ టూ మీ !" అని ఒక చిరునవ్వు నవ్వి ముందు కు కదిలింది అన్నపూర్ణమ్మ గారు. గార్డు కొద్దిగా నోరు తెరిచేశాడు.

బోర్డింగ్ పాస్ దగ్గర కూడా దాదాపు ఇదే సన్నివేశం. 
సెక్యూరిటీ చెక్ దగ్గర మాత్రం గార్డు వీళ్ళను చూసి హిందీ లో "ఔరత్ కో యహా సే జానా హై" అన్నాడు కొద్దిగా దర్పంగా !

"మై సిర్ఫ్ ఔరత్ నహీ ! బుజుర్గ్ హో !" అందావిడ చిరునవ్వుతో. 
ఆవిడ ఆధార్ కార్డు చెక్ చేశాక ఆ గార్డ్ ముఖంలో దర్పం తగ్గి సగౌరవంగా ఆమెని చెక్ చేసి "ధన్యవాద్ మేమ్ సాబ్ ! మాఫ్ కర్నా !" అన్నాడు.

ఆదిత్యకి ఇది మామూలే అన్నట్టు మగవారి వైపు లైన్ లో నుంచి సరదాగా చూస్తున్నాడు. 

 ***** ******* ********

ముంబై విశాఖపట్నం ఫ్లైట్ లో ఎక్కి కూర్చున్న తర్వాత ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని చిరునవ్వు నవ్వుకున్నారు. 

 "అమ్మమ్మా ! నేనెప్పుడూ అడగలేదు. నువ్వు మాట్లాడగా కూడా వినలేదు. నీకు అసలెన్ని భాషలొచ్చు ? "
 
ఆవిడ వేళ్ళ మీద లెక్కెట్టుకుని, "ఎనిమిది భాషలు అర్ధం అవుతాయిరా ! తెలుగు, ఇంగ్లీషు, హిందీ, తమిళం మాట్లాడుతాను. మీ అమ్మ ఒక్కతే పిల్ల మాకు. మీ తాతకి బంధు వర్గం పెద్దది. వాళ్లకి ఏ అక్కర వచ్చినా మీ అమ్మని చంకనేసుకుని ఒక్కదాన్నే ఊళ్ళ మీద తిరిగే దాన్ని. దేశం నలుమూలలా తిరిగాను. అంచేత ఈ భాషలు పట్టుబడ్డాయి."

"అందుకేనా ? అమ్మకి ఎనిమిదో తరగతి వరకే చదివించారు?"
ఆవిడ ముఖం కొద్దిగా మ్లానమైంది.

 "లేదురా ! నాకు మీ అమ్మ పుట్టినపుడే సిజేరియన్ అయి, గర్భసంచీలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయనీ పూర్తిగా గర్భసంచీ తొలగించాలని అప్పటిలో డా. సత్యభామా రెడ్డి గారు చెప్తే మారు మాట్లాడకుండా 'డాక్టర్ గారూ ! ఆవిడ ఆరోగ్యం నాకు ముఖ్యం, మా పసిదానిని నన్ను చూసుకోవడానికి ఆవిడకి ఏం చేస్తే మంచిదో పూర్తిగా మీరు నిర్ణయించండి అని నిబ్బరంగా చెప్పారు మీ తాతయ్య.
  
"మీ అమ్మని కూడా చాలా గారాబంగా పెంచారు. స్కూల్ లో ఎనిమిదో తరగతిలో మాష్టరు ఎవరో పిల్లాడిని కొడుతుంటే చూసి భయం పెట్టుకుని జ్వరం తెచ్చుకుంటే స్కూల్ మానిపించేసి ఇంట్లోనే పదో క్లాసు వరకు చెప్పి ప్రైవేటుగా పరీక్ష రాయించారు. పదో తరగతి తరువాత మా మేనల్లుడు, అదే మీ నాన్న,, మీ అమ్మనే చేసుకుంటానని పట్టుబడితే వెంటనే పెళ్ళి కూడా చేసేశారు. ఏ మాటకామాటే మీ నాన్న ఉత్తముడు ! అతనితోనే, మీ అమ్మతోనే మా జీవితాలు అనుకున్నాం. మాకు రిగ్రెట్స్ లేవు !"

******* ******* ******* 

మంద్రంగా వినిపిస్తున్న ఇంజన్ల శబ్దానికి అన్నపూర్ణమ్మ గారు ఇట్టే నిద్రపోయింది. ఆదిత్య ఆవిడని చూసి 'అమ్మమ్మా ! నువ్వు గ్రేట్ !' అనుకున్నాడు. తన అన్నదమ్ములు ఇద్దర్నీ, అక్కనీ, చెల్లాయినీ అమ్మమ్మ, తాతయ్యలే పెంచారు. తాతయ్యని "తాతయ్యా" అని పిలిచినా అమ్మమ్మని నలుగురు పిల్లలూ "అమ్మా!" అనే పిలిచేవారు.

 నాన్నగారిది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం అయ్యేసరికి రెండు మూడేళ్ళకి ట్రాన్స్ఫర్ లు అవడంతో అందరూ ఆలోచించించుకుని కాకినాడలో అమ్మమ్మ గారి ఇంట్లో ఉండి చదువుకునేలాగు నిర్ణయం చేసుకున్నారు. ఆ నిర్ణయం ఆదిత్య, భాను ప్రసాద్ ఇద్దరూ కాకినాడలో జె ఎన్ టి యూ లో ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని, ఆఖరి పిల్ల లక్ష్మి కూడా పి ఆర్ కాలేజీలో బీ యస్ సీ పూర్తి చేసి ప్రైవేట్ గా కంప్యూటర్ కోర్సు పూర్తి చేసేదాకా దిగ్విజయంగా అమలు జరిగిపోయింది. 

పెద్ద అక్క శ్రీ దేవి బీ కామ్ అయిపోగానే పెళ్ళి చేసేశారు. ఆమెకి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఆఖరు అమ్మాయి లక్ష్మికి కూడా పెళ్ళి చేసేశాక మగ పిల్లలు ఎమ్ టెక్ లు చదివి ఉద్యోగాలు కూడా సంపాదించుకోగానే పెళ్ళిళ్ళు చేసేశారు. అన్నిటికీ ఆధ్వర్యం అన్నపూర్ణమ్మ గారు, వెంకటప్పయ్య గార్లే ! 

***** ******* ********

"అమ్మమ్మా ! వైజాగ్ వచ్చేస్తోంది. ఏమైనా సద్దుకోవాలా ? "

"అక్కరలేదు నాన్నా ! నాకున్నవన్నీ ఇదుగో నువ్వు కొనిచ్చిన ఈ బ్యాగ్ లో సరిపోయాయి. భుజానికి తగుల్చుకోవడం, చలోరే ఛల్ !" నవ్వారావిడ. 

ఆ పక్క నుంచి వెళ్తున్న ఎయిర్ హోస్టెస్ ఆగి చిరునవ్వుతో "ప్రయాణం బాగా జరిగిందా ? మొదటిసారిట కదా మీకు విమాన ప్రయాణం !" అన్నది ఇంగ్లీషులో. 

"ఎవ్రీ థింగ్ ఏ ఓకే ! థాంక్ యూ !" అన్నదావిడ.

ఆదిత్య కు అది ఇంకొక ఆశ్చర్యం. కొత్త వాళ్లతో కూడా ఇట్టే కలిసిపోతారావిడ. బహుశా వెంకటప్పయ్య తాతయ్య హెడ్ మాస్టర్ గా చేసినపుడు అనేక మంది అతిధులు, ట్యూషన్ పిల్లలు, చుట్టాలు వీరందరికీ అలువు లేకుండా అన్నీ అమర్చి పెట్టేవారావిడ. అందరికీ ఆవిడ అన్నపూర్ణమ్మ తల్లే ! సార్ధక నామమధేయురాలు అని పొగిడేవారు. 

తాతయ్య వయసు మీరి స్వర్గస్థుడైన తర్వాత ఆయన పెన్షన్ తోనే ఆవిడ గడిపేవారు. అల్లుడు "అత్తయ్యా ! ఏమైనా డబ్బు అవసరమా ?" అని అడిగినా "నాకేం అవసరాలు సుందరం ? ఎప్పుడైనా పండగలు వస్తే పిల్లలకు ఇవ్వడానికి నా పెన్షన్ డబ్బులు భేషుగ్గా సరిపోతాయిలే !" అని కొట్టి పారేసేవారావిడ. 

మనవళ్ళు , మనవరాళ్లు వచ్చినపుడల్లా ఆవిడకు చీరలు పట్టుకొచ్చి అందులో డబ్బులు పెట్టి చీర ఆవిడ చేతిలో, చెయ్యి ఆవిడ నోటిమీద మూసేసి తర్జనితో బెదిరించి వెళ్ళిపోయేవారు. 

****** ******* ******* 

సీతమ్మ ధారలో ఇంటికి వెళ్ళిపోయాక స్నానాలు చేసి భోజనాలు చేశాక తల్లి తండ్రులతో అమ్మమ్మతో కూర్చుని ఆ కబురు ఈ కబురు చెప్పాక "అమ్మమ్మా ! నాకు మళ్ళీ రేపు మధ్యాహ్నం రెండు గంటలకి ఫ్లైటు. పన్నెండు గంటలకైనా ఎయిర్ పోర్ట్ లో ఉండాలి. అందుకని పదకొండున్నరకి భోజనం పూర్తి చేసుకోవాలి. అందుకని.... " పూర్తి చెయ్యకుండానే అందుకున్నారావిడ "పదింటికల్లా వంట మొదలెట్టాలి అంతేగా ?" 

"నువ్వు సూపరే అమ్మమ్మా ! నీ ఆప్యాయతకు కడుంగడు సంతసించితి. నీకు కోరిక ఏమైనా ఉంటే వెంఠనే అడిగెయ్ ! మంచి మూడ్ లో ఉన్నాను !" అన్నాడు ఆదిత్య.

"నాకింక కోరికలేమున్నాయిరా ? నా జీవితం నిండు విస్తరి. పూర్తిగా అనుభవించాను. నీ చిన్నపుడు అమ్మమ్మా నేను పెద్దయ్యాక విమానం ఎక్కిస్తానేం ! అనేవాడివి గుర్తుందా ? ఇవాళ ఆ కోరికా తీర్చావు. ఈ వయసులో ఎందుకురా ? అంటే కాటరాక్ట్ ఆపరేషన్ లు చేయించావు. నేను అమ్మ నాన్న దగ్గరే ఉంటానని అంటే బిజీగా ఉండి కూడా స్వయంగా విమానం ఎక్కించి తీసుకొచ్చావు. ఇంకా ఏం కావాలంటావు నాకు ? 

"నా పెద్ద మనవరాలు శ్రీ దేవికి కూడా మనవరాళ్లు ! నాకు యిని మనవరాళ్లు తెలుసా ? ఎంతమందికి పడుతుంది నాయనా ఈ అదృష్టం ?" అని కళ్ళ నీళ్ళు తుడుచుకుందావిడ. 

"సరె సరేలే ! పడుకో అమ్మమ్మా ! రేపు తొలేకాదశి. పూజ చేసుకోవాలి కదా !" అని ఆవిడని ఇట్టే మూడ్ మార్చేశాడు ఆదిత్య. 

****** ****** ********

పొద్దుట ఆదిత్య తొమ్మిది గంటలకి స్నానం పూర్తి చేసుకునే సరికి అమ్మమ్మ గారు పూజ ముగించుకుని కూతురికి వంట సాయం చేసి, కూర తరిగి ఇచ్చి, "కాసేపు ధ్యానం చేసుకుంటానే అమ్మాయీ !" అని క్రింద ఆసనం వేసుకుని దాని మీద కూర్చుని కళ్ళు మూసుకుని మళ్ళీ ఇంక కళ్ళు తెరవనే లేదు. 

"ఋణానుబంధం తీర్చుకోక పోతే ఆ విమానం ఎక్కించక పోతే ఇంకా ఉండే దానివి కదా అమ్మమ్మా !" అని చిన్న పిల్లాడిలా ఏడ్చాడు యాభై ఏళ్ళ ఆదిత్య . 

వెక్కిళ్ళ మధ్యనే తల్లి కొడుకుని ఓదార్చింది "నాన్నా ! అమ్మమ్మ చాలా పుణ్యం చేసుకుందిరా ! తొలి ఏకాదశి నాడు మరణం. విష్ణు లోకాలకే వెళ్ళిపోయిందిరా ! పూర్ణ జీవి ! 103 ఏళ్ళు జీవించి దర్జాగా తను అనుకున్న చోట ఏమీ కోరికలు లేకుండా వెళ్ళి పోయింది " అని తను కూడా గొల్లుమంది.

No comments:

Post a Comment