*🧘♂️95 - శ్రీ రమణ మార్గము🧘♀️*
*శాస్త్ర ప్రయోజనం !*
ఆధ్యాత్మిక సాధనను గురించి ప్రస్తావిస్తూ శ్రీ లక్ష్మీకాంతానంద స్వామి తన కోదండరామ శతకంలో, “చేయగల్గిన వారు చెప్పకుండ్రు, చెప్పగలిగినవారు చేయ కుంద్రు" అని రాశాడు. అయితే 'చేయగలిగినవారు కూడా ఎవరైనా ఏదైనా సందేహ నివృత్తి చేసుకోదలచి నప్పుడు, వారి ప్రశ్నకు వివరంగా సమాధానం చెప్పడం జరుగుతుంది.
అరుణాచల రమణుడు ఏనాడూ ఏ సభను ఉద్దేశించి ప్రసంగించలేదు. భాషణలు ఇవ్వడమంటే ఏమిటో ఎరగడు. రమణుడిని ఉత్తర హిందూస్థాన పర్యటనకు తీసుకు వెడదామనీ, అక్కడ ఉపన్యసింపచేద్దామనీ అనుకున్న ఓ స్వామి కోర్కెను రమణుడు సున్నితంగా వమ్ము చేశాడు. విద్య పట్ల శ్రద్ధ ఉన్నవారే అయితే తానెక్కడ నివసిస్తే అక్కడికే వస్తారులే అన్నట్లుగా అరుణగిరి వద్దనే ఉండిపోయాడు. పాశ్చాత్యులు కానీ, భారతీయులు కానీ, మహానుభావులు కానీ సామాన్యులు కానీ, ఆయన స్థిరంగా ఉండి పోయిన అరుణాచలానికే వచ్చి తమ తమ అర్హత కొద్దీ విద్యను ఆర్జించి వెళ్ళారు.
రమణుడు అడపా దడపా మాట్లాడినప్పటికీ, ఒకింత రాసినప్పటికీ మొత్తం మీద మహా మౌనంలోనే తన జీవితం గడిపాడని చెప్పుకోవచ్చు. ఆ మాటకొస్తే ఆయన మౌనాన్ని అర్థం చేసుకోగలిగిన ఉత్తమ సాధకులకు, అదే బోధగా పరిణమించేది. ఆయన జీవించే తీరూ, మనుషులతో వ్యవహరించే పద్ధతి మొదలైనవే గొప్ప గుణ పాఠంగా రూపొందుతుండేవి. ఆయన 'మౌనసందేశాన్ని' స్వీకరించగలిగిన తాహతులేని వారు, ఆయనతో ప్రసంగించి తమ సందేహాలు తీర్చుకొని వెళ్ళేవారు. ఇక అనర్హులైన మిగతా వారు ఆయనతో ఎన్నాళ్ళు కలిసి జీవించినా, ఎంతగా సంభాషించినా చాలా కొద్దిగానే గ్రహించేవారు.
ఈ 'నేర్చుకోడం’ అనే క్రియకు గ్రంథ పాండిత్యం దోహదకారి కాకపోగా ఒక్కొక్కసారి అవరోధంగా కూడా పరిణమించేది. శ్రీ గణపతిముని రమణుడి ప్రియమైన మిత్రుడు; కావ్యకంఠ బిరుదాంకితుడు. అసాధారణ ప్రతిభావంతుడు కూడాను.
కానీ శ్రీ గణపతి ముని రమణుని సన్నిహితుడై ఉండి కూడా ఆయన సూచించే ఆత్మ విచారాన్ని ఆశ్రయించే బదులు ఇతర సాధనలు, అనుష్ఠానాలు, తపశ్చర్యలు, మంత్రోచ్ఛాటనతో సతమతమవుతూ ఉండేవాడు. "గణపతి మునికి మోక్షప్రాప్తి ఉంటుందంటారా?” అని ఎవరో రమణుణ్ణి ఒకమారు అడగగా, “అంత పాండిత్యం ఉన్న మనిషికి మోక్షమార్గం ఎలా కనిపిస్తుంది?" అని విచారంతో అన్నాడు రమణుడు.
ఇతర విధాల ఆధ్యాత్మికతపై ఎంతో శ్రద్ధాసక్తులు ఉన్న శ్రీ గణపతిమునికే, పాండిత్యమనేది అంత పెద్ద అవరోధమయింది. ఇక అటువంటి కఠిన తపశ్చర్య మృగ్యమై కేవల గ్రంథ పాండిత్యంపై ఆధారపడేవారి విషయమెలా వుంటుందో చెప్పాలా?
శ్రీ జిడ్డు కృష్ణమూర్తిగారు ఏ గ్రంథం పేరూ ప్రస్తావించేందుకు ఒప్పుకునేవారు కాదు. "మీ పవిత్ర గ్రంథాలనేవైనా మనిషి మెదడు సృష్టించినవే కదండీ? వాటిని పూజిస్తూ పారాయణ చేస్తూ కూచుంటే మీకేమి సిద్ధిస్తుందండీ? మీ జీవితమనే గ్రంథాన్ని తెరచి అందులోని ప్రకరణాలన్నీ జాగ్రత్తగా చదవండి. మీ చరిత్రేకాక, మానవాళి చరిత్ర యావత్తూ అందులో లభిస్తుంది. ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది" అంటూ గ్రంథాలను తోసిపుచ్చేవారు. శ్రీ రమణుడు అంత తీవ్రమైన సరళిని అనుసరించక పోయినప్పటికీ శాస్త్ర పాండిత్యం మీద రమణుడికి కూడా ఏమాత్రం ఆదరం లేదనేది ఒక శిష్యుడు చెప్పిన సంఘటన ద్వారా మనకు తెలుస్తుంది.
“ఒకసారి కొందరు సంస్కృత పండితులు ఆశ్రమంలోని పాత హాలులో కూచొని భగవాన్ సమక్షంలో ఉపనిషత్తులు మరికొన్ని శాస్త్రాలను చర్చిస్తున్నారు. వారు తమ సందేహాలను వెలిబుచ్చి శ్రీవారి సమాధానం కోరగా, రమణులు సమాధానమిస్తున్నారు. ఇదంతా చూచి నేను “వీరందరూ ఎంత బాగా చదువుకున్నారు ! ఎంతటి శాస్త్ర విజ్ఞానం ! భగవాన్తో కూర్చుని చర్చించగలిగిన వీరి సామర్థ్యం నాబోటి వాళ్లకు అసలు ఎన్నటికైనా సిద్ధిస్తుందా?” అని లోలోన అనుకున్నాను.
పండితులందరూ భగవాన్ వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత భగవాన్ నావైపు తిరిగి, నా ఆలోచనలను గ్రహించినట్లు "ఈ శాస్త్ర విజ్ఞానమంతా పై ఊక మాత్రమే. శాస్త్రాలను వల్లె వేయడమూ అప్ప జెప్పడమూ ఎందకూ కొరగానిపని.
సత్యాన్ని
గ్రహించడానికి ఈ శ్రమ, ఈ చెఱ, యావత్తూ అనవసరం. గ్రంథపఠనం వల్ల సత్యం లభించదు. ప్రశాంతంగా వుండు, అదే సత్యం; నిశ్చలంగా వుండు; అదే దైవం” అన్నారు.
అటు తర్వాత ఆయన మళ్ళీ నావంక తిరిగి "నీకు నువ్వే షేవ్ చేసు కుంటుంటావా?” అని అకస్మాత్తుగా అడిగారు. ఆయన ఇలాంటి ప్రశ్న ఎందుకు వేస్తున్నారో తెలియక, మొదట్లో కాస్త ఖంగారు పడి కొద్దిగా వొణుకుతూ నేను “చేసుకుంటూ వుంటాను" అన్నాను.
“మరి షేవ్ చేసుకోడానికి అద్దం వాడతావు కదా? అద్దంలో చూచుకుంటూ నీ ముఖాన్ని షేవ్ చేసుకుంటావ్. అంతే కానీ అద్దంలో కనిపించే నీ ముఖాన్ని షేవ్ చేయవు కదా? అలాగే ఈ శాస్త్రాలన్నీ కూడా నీ ఆత్మసాక్షాత్కారానికి దోవ చూపించేందుకు ఉన్నటు వంటివి. నువు సరిగా ఆచరించడానికీ, సాధించవలసింది సాధించడానికి ఉద్దేశించినవి. కేవల గ్రంథ పఠనం, వాటిపై చేసే చర్చలు, అద్దంలోని ప్రతిబింబానికి షేప్ చేసిన చందంగా ఉంటుంది” అన్నారు. ఆనాటి నుండి “నేను చదువుకోలేదే, మిగతా వారితో పోలిస్తే నాకేమంత శాస్త్ర విజ్ఞానం లేదే” అనే ఆత్మన్యూనతా భావం నాలో పూర్తిగా తొలగిపోయింది” అంటాడు.
No comments:
Post a Comment