0211. 1-5. 030223-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
భక్తికన్న జ్ఞానమే మిన్న…!
*జ్ఞానశక్తి*
➖➖➖✍️
*ఈ సృష్టిలో జ్ఞానాన్ని మించిన శక్తిలేదు. జ్ఞానశక్తి మానవుడికి లభించిన మహా వరం. ఏ యుగమైనా, ఏ కాలమైనా- జ్ఞానానికి గల మహిమ, జ్ఞానానికిగల గౌరవం అపారమైనవని వేదపురాణాలు ప్రత్యక్ష నిదర్శనాలతో ప్రతిపాదిస్తున్నాయి.*
*జ్ఞానం మనిషిని మనిషిగా తీర్చి దిద్దుతుంది. సంస్కారం, సత్ప్రవర్తన, భూతదయ, పరోపకారబుద్ధి, ధ్యానశీలత మొదలైన సద్గుణాలతో మానవ జీవితానికి పరిపూర్ణత్వం, పరిపక్వత ప్రసాదిస్తుంది. అహంకారాన్ని, అల్పజ్ఞతను, అవివేకాన్ని పూర్తిగా హృదయంనుంచి దూరం చేస్తుంది.*
*'తమసోమా జ్యోతిర్గమయ' అన్న సూత్రానికి అనంతమైన భాష్యం అభివ్యక్తంచేసే సులక్షణం జ్ఞానానికే ఉంది. ఎంత విద్య, ధనం, పదవి, గౌరవం, కీర్తి ఆర్జించినా అవన్నీ జ్ఞానంవల్లనే రాణిస్తాయన్నది అక్షరసత్యం.*
*అధ్యయనం చేసినకొద్దీ 'నేనెంత అజ్ఞానినో, నేనెంతటి అల్పజ్ఞానినో అన్న సత్యం తెలియవస్తోంది' అన్న భావన జ్ఞానప్రాప్తికి తొలి సోపానం.*
*అహంకార రూపంలో ఉన్న అజ్ఞానం జ్ఞానిననుకున్న విశ్వామిత్రుడికి, దూర్వాసమహర్షికి ఎంతటి అవమానం, ప్రాయశ్చిత్తం కలిగించిందో తెలిసిందే!*
*జ్ఞానాలన్నింటిలోకీ ఉత్తమ జ్ఞానం ఆత్మజ్ఞానం. ఐహిక వాంఛలను వదిలించుకుని, ఆముష్మిక పథంవైపు వేలు పట్టి నడిపించుకుపోయే ఆత్మీయబంధువే ఆత్మజ్ఞానం.*
*నరుడు తన అవిజ్ఞతను తొలగించుకుంటున్నకొద్దీ జ్ఞానజ్యోతికీ, ఆత్మజ్ఞాన పరంజ్యోతికీ దగ్గరవుతుంటాడు.*
*భగవంతునితో తనకుగల బంధం పెనవేసుకుంటున్నకొద్దీ భావశృంఖలాలు ఒక్కొక్కటే తెగిపోతుంటాయి. జిజ్ఞాసువుకు, ముముక్షువుకే అది సాధ్యం. అలా సాధ్యమైన తరవాత ఆత్మజ్ఞానం సులువుగా సంప్రాప్తమవుతుంది.*
*ఏండ్లు మీరినవాడు వృద్ధుడు కాడనీ, జ్ఞానసంపదతో పరిపూర్ణత్వం సాధించినవాడే వృద్ధుడనీ, అటువంటివాడే జాతికి పథ నిర్దేశకుడు కాగలడనీ ఆర్యోక్తి.*
*మనదేశాన్ని ఎందరో రాజులు, రారాజులు పరిపాలించారు. వారిని మంత్రులైన జ్ఞానవృద్ధులే నడిపించారు. తిమ్మరుసు, చాణక్యుడు ఆ కోవకు చెందినవారే! వారి జ్ఞానసంపదే ఆయా సామ్రాజ్యాలకు కీర్తిసంపద తెచ్చిపెట్టింది. అసలైన జ్ఞాని తన జ్ఞానాన్ని జాతి అభ్యున్నతికోసం, దేశప్రగతికోసం వినియోగిస్తాడు. తన జ్ఞానసంపదను సర్వులకూ పంచిపెడతాడు.*
*జ్ఞాని పారమార్థికతత్వ ప్రబోధమే తన పరమావధిగా, పరమవిధిగా గుర్తిస్తాడు. జ్ఞాని సలహాలు, సూచనలు మానవుడి మహోన్నత దశకు, దిశకు ఎంతగానో ఉపకరిస్తాయి. సామాజిక, సాంస్కృతిక విలువలకు వన్నెలు దిద్దుతాయి. ఆధ్యాత్మిక క్షేత్ర మూలాలను అవగతం చేసుకునేందుకు తోడ్పడతాయి.*
*నేడు సమాజంలో జ్ఞానం పెరిగినకొద్దీ, దాన్ని అక్రమ ధనార్జనకు, అశాశ్వత సుఖవిలాసాలకు దుర్వినియోగం చేయడమే కనిపిస్తోంది. అలాంటి అకృత్యాల విషపునీడల మేడలలో తిష్ఠవేసే జ్ఞానం జ్ఞానమే కాదు. జ్ఞానమనేది చెలమలోంచి ఊరుతూ వచ్చే తీయని నీటి ఊట. కోరినకొద్దీ గురువు అచ్చమైన జ్ఞానమిస్తాడు. కనుక జ్ఞానప్రాప్తికి గురువే శరణ్యం. సద్గురువే పతీ, గతీ, సర్వస్వం. గీతలో జ్ఞానబోధ చేసి అర్జునుణ్ని జాగృతం చేసింది పరమగురువు కృష్ణ పరమాత్మేనని నమ్మినవాడు- ఆ బోధ కేవలం అర్జునుడికే కాదు, అఖిల మానవజాతికీ అందిన అపురూప వరమని నమ్మకమానడు. అందుకే 'జ్ఞానానందమయం దేవం' అని కీర్తిస్తున్నాం మనం.*
*రామకృష్ణ పరమహంస, వివేకానంద, బుద్ధుడు, అరవిందుడు మొదలైనవారంతా లోకసంక్షేమార్థం జ్ఞానార్జనకోసం తపస్సు ఆచరించినవారే! వారి వారి జ్ఞానార్హతలను అనుసరించి, మనసు క్రమంగా పరిపక్వస్థితికి చేరుకుంటుంది. జ్ఞానస్థితినిబట్టే నాస్తికుడు ఆస్తికుడవుతాడు. ఆస్తికుడు జిజ్ఞాసువవుతాడు. జిజ్ఞాసువు జ్ఞాని అవుతాడు. జ్ఞాని ముముక్షువవుతాడు. కనుక భక్తి కన్న జ్ఞానమే మిన్నని ఉపనిషత్తులూ ఉద్ఘాటించాయి.*
*భగవంతుణ్ని సృష్టిలోని అణువణువునా, సర్వభూతాల్లోనూ దర్శించగలవాడే నిజమైన జ్ఞాని.*
*జ్ఞానంతో సమానమైనదేదీ లేదనీ, కైవల్య ప్రాప్తిని కలిగించేదీ జ్ఞానమేనని గీతావాక్యం చెబుతోంది.*
*సృష్టి అంతా ఆధ్యాత్మిక భావనాకేంద్రమని అర్థం చేసుకోగలిగేవాడే జ్ఞాని.*
*'ముక్తిప్రదాత జ్ఞానశక్తే' అని గ్రహిస్తే చాలు, మనకు జ్ఞానవరం లభించినట్లే!*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
No comments:
Post a Comment