Saturday, September 2, 2023

విద్యాధికారి

 *🌻విద్యాధికారి🌻*


🥀కాంచనపురిని పరిపాలించే చంద్రసేనుడు మంచి పరిపాలనాదక్షుడు. తండ్రి తరువాత అతి పిన్నవయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించి, అతడు పరిపాలనాపరంగానే కాక, సామాజికంగా కూడా చాలా మార్పులు తీసుకు వచ్చాడు. యువకుడు, సంస్కరణాభిలాషి కావడంచేత, విద్యాబోధనలో మార్పురావాలని తలచాడు, చంద్రసేనుడు. ఆస్థాన విద్వాంసులనూ, రాజగురువునూ, ప్రముఖకవి, పండితులనూ ఆహ్వానించాడు. సుదీర్ఘచర్చల అనంతరం, రాజ్యమంతటా ఒకే విధమైన విద్యాబోధన జరగాలనీ, విద్యార్థులు వేద వేదాంగాల్ని అభ్యసిస్తూనే, తమకిష్టమైన వృత్తి విద్య, సామాజికనీతి, రాజనీతి వంటివి కూడా తప్పని సరిగా నేర్వాలనీ, వారు నిర్ణయించారు.

🥀ఆపత్సమయంలో ఆత్మరక్షణ కూడా ముఖ్యమే! అందుచేత, శారీరక దృఢత్వం కోసం …యువకులు, వ్యాయామం, శస్త్రాస్ర్త విద్యలూ కూడా నేర్వాలని నిర్ణయం జరిగింది. ఇందుకుగాను, సమర్థుడైన ఒక విద్యాధికారిని నియమించి, ఆయన ఆధ్వర్యంలో రాజ్యంలోని గురుకులాలన్నీ ప్రమాణాలకు అనుగుణంగా నడుచుకోవాలని తీర్మానించారు.

🥀అయితే, విద్యాధికారి పదవి సామాన్యమైనది కాదు గనక, ఆ పదవిని అలంకరించే వ్యక్తిగొప్ప విద్యావంతుడూ, యుక్తాయుక్తాలు క్షుణ్ణంగా తెలిసినవాడూ అయివుండాలి. ఇందుకుగాను, రాజు చంద్రసేనుడు, విద్యాధికారిని నియమించే అధికారం, రాజగురువు మహేంద్రభట్టుకు అప్పగించాడు. మంచి ఉన్నత స్థానం, రాజుగారి వద్ద ప్రత్యేక ప్రాపకం, తగిన పారితోషికం లభించే విద్యాధికారి పదవి కోసం సహజంగానే పోటీ మొదలయింది.

🥀ఎంతో మంది యువకులు తమ అదృష్టాన్ని పరీక్షంచుకోవడానికి రాజధానికి రాసాగారు. రాజగురువు మహేంద్రభట్టు అనన్య సామాన్యమైన మేధావి. ఆయన అభ్యర్థులను ముందుగానే వ్యక్తిత్వ పరీక్షలకు  గురిచేసి, ఆ పిమ్మట మౌఖిక పరీక్షలు నిర్వహించదలచాడు.


🥀 ఈ విధంగా, వ్యక్తిత్వ పరీక్షలలోనే చాలామంది వెనుదిరగవలసి వచ్చింది. కాంచనపురి రాజ్యంలోని సుందరవరం అనే గ్రామంలో, ఇంద్రదత్తుడు అనే యువకుడుండేవాడు. అతడు గురుముఖంగా శాస్ర్తాలన్నీ నేర్చి, చిన్నతనంలోనే కాశీ వెళ్ళి గొప్ప పాండిత్యం సంపాయించాడు. తర్వాత, తన స్వగ్రామానికి తిరిగివచ్చాక, తను నేర్చిన విద్యలను ఇతరులకు బోధించాలన్న కుతూహలం కలిగింది. ఆ తరుణంలోనే ఇంద్రదత్తుడికి, రాజాస్థానంలో విద్యాధికారి పదవి విషయం తెలియవచ్చింది.

🥀అతడు వెంటనే రాజధానికి బయలుదేరాడు. రాజధాని చేరిన తర్వాత, ఇంద్రదత్తుడు ఒక పూటకూళ్ళ ఇంటిలో బసచేశాడు. రెండు రోజులపాటు రాజధానీ నగరం అంతా కలయ తిరిగి ముఖ్యమైన ఎన్నో విషయాలు తెలుసుకున్నాడు. ఎందరో యువకులు తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలనే తపనలోవున్నారని, అతడికి అర్థమయింది. అభిరుచి వున్నా అవకాశం లేక ఎందరో యువకులు విద్యార్జన
చేయలేక పోవడం అతణ్ణి కలవరపరిచింది.

🥀మూడవ రోజు ఉదయాన్నే ఇంద్రదత్తుడు, రాజగురువు దర్శనార్థం వెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ తుదిపోటీకి సైనికాధికారి కొడుకు దుర్జ…యుడు, కోశాధికారి కొడుకు విక్రముడు మిగిలారని అతడికి తెలిసింది. ఇంద్రదత్తుడిని చూస్తూనే మహేంద్రభట్టుకు సదభిప్రాయం కలిగింది. ఆయన, అతణ్ణి గురించిన వివరాలు అడిగి తెలుసుకుని, ‘‘సరే, నీవు రాజధానికి వచ్చిన తర్వాత, రెండు రోజులు కాలయాపన చేయడానికి కారణం ఏమిటి?’’ అని అడిగాడు.

🥀‘‘ఆర్యా, క్షమించాలి, అందుకు కారణం కొంత వివరంగా చెబుతాను. నేను ఆశించే పదవి చాలా బాధ్యతాయుతమైనది. ఆ కారణంగా చాలా సమాచారం సేకరించవలసి వచ్చింది. మన నగరంలో మొత్తం ఎనిమిది విద్యాలయాలున్నాయి. రాజ్యం మొత్తంలో గురుకులాలనూ, విద్యాలయాలనూ కలిపితే, నూరుకు మించవు. మన రాజ్యంలోని విద్యార్థుల సంఖ్యకూ, సంస్థలకూ పొంతన కుదరడం లేదు, గురువుల అభిరుచిని బట్టి విద్యనేర్పడం జరుగుతున్నది.

🥀అందుచేత విద్యార్థుల మనస్తత్వాన్ని బట్టీ, అర్హతలను బట్టీ అందరికీ అవకాశం కల్పించే సంస్థలు కావాలి.


🥀ఈ సమాచార సేకరణకు, నాకు రెండు రోజుల సమయం అవసరం అయింది,’’ అన్నాడు ఇంద్రదత్తుడు. విద్యాధికారి పదవీబాధ్యతలను, అంత బాగా ఊహించిన ఇంద్రదత్తుడి మీద అభిమానం కలిగింది, మహేంద్రభట్టుకు.
‘‘ఈ పదవి నీకే లభిస్తుందని, ఎలా అనుకుంటున్నావు?’’ అని అడిగాడు మహేంద్రభట్టు. ‘‘పూనిన ఏ కార్యాన్నయినా సాధించి తీరాలన్నది నా నైజగుణం. అంతే కాక, ఆశ అనేది లోపిస్తే, భవిష్యత్తు శూన్యం అవుతుంది,’’ అన్నాడు ఇంద్రదత్తుడు.

🥀ఆ సమాధానానికి తృప్తి చెందిన మహేంద్రభట్టు, ఇంద్రదత్తుణ్ణి, దుర్జయ, విక్రములతో పాటుగా పరీక్షంచేందుకు పిలిచి, ‘‘అతి వేగంగా పయనించేది మనసుగదా, సరే! ఆ తర్వాత రెండవ స్థానంలో వుండేది ఏది?’’ అని అడిగాడు. ‘‘గాలి!’’ అన్నాడు దుర్జయుడు. ‘‘కాదు, అగ్ని!’’ అన్నాడు విక్రముడు.

🥀 ‘‘నా ఉద్దేశంలో, మీ ప్రశ్నకు సమాధానం, వార్త! అది కేవలం కొన్ని నిమిషాలలోనే గాలి కన్నా, అగ్నికన్నా వేగంగా పయనిస్తుంది. ఎక్కడో మారుమూలనున్న మా గ్రామానికి, ఈ పోటీ గురించి మీరు ప్రకటించిన వార్త వెంటనే చేరిపోయిందంటే, వార్త యొక్క వేగం ఊహించవచ్చు!’’ అన్నాడు ఇంద్రదత్తుడు. ‘‘మరొక ప్రశ్న. మనిషిని కాల్చేది ఏది?’’ అని ప్రశ్నించాడు మహేంద్రభట్టు. ‘‘నిప్పు!’’ అన్నాడు వెంటనే దుర్జయుడు.


🥀‘‘అవును, నిప్పు మనిషినే కాదు, దేనినైనా కాలుస్తుంది!’’ అన్నాడు విక్రముడు. ‘‘ఆర్యా! నిప్పును మించి కాల్చి బాధించేది అపనింద! నిప్పువల్ల మనిషిలో మార్పురావచ్చు కానీ, అపనింద మనిషిని అంతర్గతంగా దగ్థం చేస్తుంది,’’ అన్నాడు ఇంద్రదత్తుడు.

🥀‘‘తదుపరి ప్రశ్న మృత్యువును మన దగ్గరికి చేర్చేది?’’ ‘‘అనారోగ్యం!’’ అన్నాడు దుర్జయుడు. ‘‘చింత!’’ అన్నాడు విక్రముడు.

🥀‘‘ఆర్యా! అనారోగ్యం, చింత, మృత్యువును దగ్గరికి చేర్చేవే కానీ, ఆ రెంటికీ కూడా ముఖ్య కారణం క్రోధం! అది మనలోని వివేకాన్ని దూరం చేస్తుంది. అకారణ ద్వేషాన్ని పెంచుతుంది. అనేక ప్రకంపనలకు లోనైన శరీరాన్ని మృత్యువు తేలికగా కబళించగలదు,’’ అన్నాడు ఇంద్రదత్తుడు. ఈ సమాధానానికి మహేంద్రభట్టు చిరునవ్వు నవ్వి, ‘‘ఇంద్రదత్తా! నువ్వు సమాధానం చెప్పిన తీరు బావుంది.

🥀అయితే, నీకీ విద్యాధికారి పదవి లభిస్తే, ఎలా నిర్వహిస్తావు?’’ అని అడిగాడు. ‘‘పెద్దల అభిప్రాయాలను మన్నిస్తాను. దేశంలో ఎందరో …యువతీ…యువకులు, తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలన్న తపనతో వున్నారు.
అలాంటి వారికి అవకాశాలు కల్పిస్తే ఒక్కొక్కరూ ఒక్కొక్క విద్యాసంస్థగా మారి, విద్యాభ్యాస అవకాశాలు లేక నిర్లిప్తతకులోనై వున్నవారికి ఉత్సాహం కలిగించి, విద్యాబోధ చేయగలరు. నాకున్న విజ్ఞానాన్ని, తమబోటి విజ్ఞుల అనుభవంతో మిళితం చేసి, కాంచన పురి రాజ్యంలోని ప్రతి యువతినీ, యువకుణ్ణీ అపర సరస్వతీ మూర్తిగా రూపొందించేందుకు శాయశక్తులా కృషి చేస్తాను.

🥀ఆ విశ్వాసం నాకున్నది!’’ అన్నాడు ఇంద్రదత్తుడు ఉత్సాహంగా. ఆ తర్వాత, వారం గడవకుండానే, విద్యాధికారి పదవికి ఇంద్రదత్తుడు తగినవాడని నిర్ణయించాడు మహేంద్రభట్టు. ఆయన నమ్మకం వమ్ము కాలేదు. విద్యాధికారిగా ఇంద్రదత్తుడు అత్యంత ప్రతిభాశాలి అనిపించుకున్నాడు. ఆ విధంగా, రాజు చంద్రసేనుడి పాలనలో కాంచనపురం విద్యార్థుల పాలిట కల్పవృక్షంగా చిరకాలం నిలిచింది.


☘️☘️🌻🌻🌻🌸🌻🌻🌻☘️☘️

No comments:

Post a Comment