Friday, November 3, 2023

తొందరపాటు

 *తొందరపాటు* 
           
 *మనిషి తన దైనందిన కృత్యాల్లోను, వివిధ కార్యక్రమ ప్రణాళికా రచనలోను రెండు సూత్రాలను ప్రధానంగా గుర్తుకు తెచ్చుకుంటాడు.*

*‘ఆలస్యం అమృతం విషం’ అని, ‘నిదానమే ప్రధానం’ అని..!*

*నిజానికి ఈ రెండు సూత్రాలూ కార్యసాఫల్యానికి అవసరమైనవే. ఆయా సందర్భాలు, సన్నివేశాలు, పరిస్థితులను బట్టి ఈ సూత్రాలను ఆచరణలోకి తేవాల్సి ఉంటుంది.* 

 *ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు తన బుద్ధితోనే గాక, తన హితం కోరేవారు, ఆత్మీయుల బుద్ధిని కూడా ఉపయోగించుకోవడం పురోగతి కోరుకునేవాడి  లక్షణం.* 

*తనకు తోచిందే సరైనదని వెనకా ముందూ ఆలోచించకుండా అనుకున్న వెంటనే పని మొదలెట్టడం వైఫల్యానికి, అవమానానికి కారణభూతమవుతుంది. విపరీత ఫలితాలు ఎదుర్కొన్నాక పశ్చాత్తాపం చెందడం చేతులు కాలాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది.*

*ఈ తొందరపాటు ప్రతి మనిషి జీవితంలోనూ కనిపిస్తుంది. అదే శోక కారణమవుతుంది. అనుభవజ్ఞుల సలహాలు, సూచనలను విని విశ్లేషించుకుని అహంకరించక, వివేకంతో ముందడుగేసేవాడు కచ్చితంగా కార్యసాధకుడు కాగలడు.* 

 *తొందరపాటు వల్ల జీవితంలో దిద్దుకోలేని అగచాట్లు ఎదురవుతాయి. నిరంతరం దుఃఖం అనుభవించే సంఘటనలూ జరుగుతుంటాయి.* 
 
 *ప్రధానంగా కామక్రోధ లోభమోహాది అరిషడ్వర్గాల వల్ల, మానసిక ఒత్తిళ్ల వల్ల, భావోద్వేగాలకు బానిస కావడం వల్ల తొందరపాటుతో తప్పులు దొర్లుతుంటాయి. ఈ బలహీనతలను అధిగమించి, వివేకంతో సంయమనంతో సమయజ్ఞతతో వ్యవహరించే వాడెప్పుడూ విజేతే అవుతాడు.*                           కైక తొందరపడి అనాలోచితంగా, అసందర్భంగా దశరథుణ్ని కోరిన రెండు వరాల వల్ల ఎంత అపఖ్యాతి పొందిందో తెలిసిందే.* 

*శకుని పన్నాగాలకు ప్రభావితుడై దుర్యోధనుడు అనేక తొందరపాటు చర్యల వల్ల ఎంతగా ఎన్నిసార్లు భంగపడ్డాడో తెలియనిదెవరికి?* 

 *ధర్మరాజు రాజసూయ యాగం ప్రారంభించిన సందర్భంలో అగ్రపూజకు వాసుదేవుణ్ని ఆహ్వానించినప్పుడు శిశుపాలుడు ఆవేశంతో, అహంకారంతో, పరమాత్మను దుర్భాషలాడి చావును కొనితెచ్చుకున్నాడు.* 

*తార చెప్పిన హిత వాక్యాలను పెడచెవిన పెట్టి వాలి అహంకారంతో సుగ్రీవుడితో యుద్ధానికి తలపడి ధర్మమూర్తి శ్రీరామచంద్రుడి చేతిలో హతుడయ్యాడు.* 

*అనాలోచితంగా, భవిష్యత్తును గురించి ఆలోచించకుండా వేసే ఏ అడుగైనా తొందరపాటు చర్యే అవుతుంది.* 

 *చిన్న చిన్న కారణాలకే దంపతులు విడాకులు తీసుకోవడం, యువత ఆత్మహత్యలకు పాల్పడటం తొందరపాటు వల్లనే.     కొన్ని క్షణాలు ఆలోచించి ‘ఇలా చేయడం అవసరమా?’ అని మనసులో నిదానంగా విశ్లేషించుకుంటే ఇటువంటి అనర్థాలే జరగవు.* 

*ప్రతిదానికీ విపరీతమైన స్పందన, అసందర్భమైన ఉద్రేకం మనిషిని వివేకహీనుణ్ని చేసి దుశ్చర్యలకు ప్రేరేపిస్తాయి.* 

*ఆలోచన లేని ఆచరణ జీను లేని గుర్రంలాంటిది. ప్రణాళిక లేని కార్యం మొదలుపెట్టడమంటే లోతు తెలియని నీళ్లలో దూకడం లాంటిది.* 

*కొద్దిపాటి తొందరపాటే కొండంత సమస్యకు దారితీస్తుంది. మనిషి వినడంలో తొందరపడవచ్చు. అవగాహన చేసుకోవడంలో తొందరపడకూడదు. తొందరపాటు శత్రువుకంటే ప్రమాదకరం!*

No comments:

Post a Comment