Wednesday, May 22, 2024

*****ఆణిముత్యాలు - 04 - మనస్సు భగవాన్ రమణ మహర్షి

 NAGASAILAKSHMI GIDUGU:
Sreenivasa Murthy Chittamuri:
ఆణిముత్యాలు - 04 - మనస్సు
భగవాన్ రమణ మహర్షి
బాహ్య విషయాలు మరియు దృశ్యాలను చూడటం వలన మనస్సు వికలమవుతుంది . అటువంటి మనస్సును బహిర్ముఖ మనస్సు అంటారు . కాని అదే మనస్సు హృదయములోనికి పోయి విశ్రాంతి చెందినచో దాన్నే నిశ్చల మనస్సు అంటారు . ఆధ్యాత్మిక జీవితం సాగించాలంటే మనస్సును అదుపులో పెట్టుకోవాలి . అనగా బాహ్య విషయాలపై వ్యామోహం మాని అంతర్ముఖం చేసినచో శాంతి లభిస్తుంది . దీనిని మనో రూప జీవితాన్ని ఆత్మరూప జీవితాలుగా మరల్చటం అని చెప్పవచ్చు . కాబట్టి విషయాసక్తిని కోరక ఎల్లప్పుడు అంతర్ముఖంలో మనస్సును నిశ్చలము చేయాలి . విషయాసక్తి వలననేp నిశ్చలంగా ఉన్న మనస్సు ప్రక్కకు మరలి పరిగెత్తుటకు ప్రయత్నిస్తుంది . అది దేనివలననగా ఏదో ఒక విషయం వలనగాని లేదా ఆకర్షింపబడే వస్తువు వలనగాని మరే ఇతర కారణములయినను మనసు ఆకర్షింపబడి ప్రక్కకు మరలి సాధకుని లక్ష్యాన్ని చెడగొడుతుంది . కావున *మనస్సుకు విషయాలంటే బొమ్మలు వంటివి . ఆ విషయాలతో ఆడుతూ లక్ష్యాన్ని చెడగొట్టుకుంటుంది . అంతరాత్మలో నిలకడగానున్న మనసు చపలత్వం చెంది ఆ మనసు బహుముఖముగా చలిస్తుంది . కావున భగవాన్ చెప్పినదేమనగా * మనస్సును నిశ్చలముగా ఉంచుకోమన్నారు . ఆ మనస్సును ఆత్మ రూప జీవితానికి మళ్ళించమన్నారు . మనస్సును నియమంలో పెట్టుకోమన్నారు . భగవాన్ ఈ విషయములో ఒక ముఖ్య విషయాన్ని సాధకులకు చెప్పారు . *ఏదైనా ఆలోచన కలిగిన వెంటనే ఆ ఆలోచన ఎవరికి కలిగింది అని ప్రశ్నించుకోమన్నారు *. దానివలన ఆ ఆలోచన సన్నగిల్లి తుదకు మాయమై మనస్సుకు చాంచల్యగుణం నశించిపోతుంది . అప్పుడు మనోబలం కలుగుతుంది . భగవాన్ మూలానికి వెళ్ళమని సూచించేవారు . ఏదైనా ఆలోచన కలిగిన వెంటనే దానిని అరికట్టమన్నారు . వెంటనే మనస్సు ఊరుకోక మరొక ఆలోచనను లేవదీస్తుంది . మళ్ళీ ఆ ఆలోచనను నరకమని అలా ప్రతిసారి ప్రతిక్షణం సహజముగా ఎన్నో ఆలోచనలు మనస్సులో లేచిన కొద్దీ అన్నింటినీ ఆ విధముగనే నరికివేయుచురాగా చివరికి ఆ మనస్సు దృఢపడి ఎటుపక్కకు మరలక అది లోపలే ఉండి మూలంవైపుకు ప్రయాణం చేస్తుంది . ఆత్మయందు శ్రద్ధ కలిగి ఆత్మలోనే లయమవుతుంది .

భగవాన్ మరియొక రహస్యాన్ని కూడా సాధకులకు చెప్పారు . మనస్సు బలహీనముగా ఉన్నవారికి అంటే బాహ్యవిషయాలపై మక్కువ కలిగి మనసు చలించే వారికి *శ్వాసపై శ్రద్ధను నిలపమన్నారు*. దృష్టిని శ్వాసమీద ఉంచినపుడు మనసు తన ఇష్టం వచ్చినట్లు బాహ్య విషయాలపై మరలదు . ఈ విధంగా చేయుట వలన బాహ్య మనస్సును లోనికి ఒక విధముగా వ్రాయటం జరిగినట్లే . భగవాన్ చెప్పినదేమనగా , దృష్టిని అంతర్ముఖం చేసిన మనస్సు ఎక్కడినుంచి లేస్తున్నదో గమనిస్తే అది వెంటనే నశిస్తుందని సూచించారు .* మనస్సుని చంపుకోవాలని అనుకునే బదులు దాని మూలాన్ని అన్వేషిస్తే అప్పుడది లేదని తెల్సుకోగల్గుతావని భగవాన్ సూచించారు*. బహిర్ముఖమై చలామణి అవుతున్న మనస్సు ఎన్నో విషయాలుగా మారుతుంది . కాని అదే మనస్సును అంతర్ముఖం చేసికొనినచో అది ఆత్మగా మారుతుందని భగవాన్ హెచ్చరించారు *. ' నేను ' భావం లేచిన తరువాతే ఎన్నెన్నో ఆలోచనలు మనసు చలిస్తుంది . ఆ సమయమున ' నేనెవరు ' ? అను విచారణ ద్వారా మనస్సు అణుగుతుంది . మనస్సు ఎన్నో రకాలుగా లేచినపుడు వాటిని అదుపులో పెట్టాలన్న దాన్ని ఆత్మలో నిల్పటం తప్ప మరో మార్గము లేదు అన్నారు . భగవాన్ . ఇతర ఆలోచనలు ఎన్ని వచ్చినను వాటికి అవకాశమివ్వక ' నేను ' తలంపు యొక్క మూలాన్ని అన్వేషించుటకై మన దృష్టిని నిల్పినచో మరే ఇతర ఆలోచనలు వచ్చినను అది ఎవరికి కలుగుతున్నదని ప్రశ్నించుకోగా సహజముగా నాకు అని జవాబు వస్తుంది . అప్పుడు ఈ నేను ఏమిటి ? దాని మూలమేమిటి ? అని విచారణ చేయాలి . మనస్సనేది తలంపులే అని భగవాన్ చెప్పారు . మనస్సు రూపాన్ని ఆగకుండ అన్వేషిస్తు ఉంటే చివరికి మనస్సనేదే లేకుండా పోతుంది . నేను అనే తలంపే మూలం . కావున మనస్సనబడేది నేను అనే తలంపే . ఈ నేను ఎక్కడి నుండి తలెత్తినది ? దాని కోసమని లోపలే వెతకమన్నారు భగవాన్ . అప్పుడది అదృశ్యమైపోతుంది . ఇదే జ్ఞానాన్వేషణ అని కూడా చెప్పారు . మనస్సంటూ ఏమీ లేదని తెలుసుకోవటమే ముఖ్యం . జీవి తన దేహముతోగాని లేదా తన మనస్సులో రేగిన ఆలోచన వలన మనసుతోగాని ఒక కార్యమును చేసేటప్పుడు ' నేను ' అన్నదేదో చేయిస్తుందని భావిస్తాము . నేను పనిచేస్తున్నాను , నేను ఆలోచిస్తున్నాను అని పలికినప్పుడల్లా నేను అనే పదానికి అహం వృత్తి అని అర్ధం వస్తుంది . కాని నిజమైన నేను అంటే లోనున్న ఆత్మతాను పని చేస్తున్నట్లు ఆలోచిస్తున్నట్లు53 అనుకోదని భగవాన్ చెప్పారు . ఆత్మ సాక్షాత్కారం కావాలంటే ఆ మనస్సు అహం వృత్తి మాయమవ్వాలి . ఒక విషయముతో లేదా వస్తువుతో తాదాత్మ్యం చెందినపుడు ఆ నేను ఉదయించి నేను చేస్తున్నాను , నేను ఆలోచిస్తున్నాను అని మొదలై ఆ నేను వాటిని సొంతం చేసుకుంటుంది . ఈ నేను అన్నది నేను ఈ దేహాన్ని అన్నభావం కలిగిస్తుంది . అట్టి నేనును వేరు చేయాలంటే మనస్సును అంతర్లీనం చేసి లోనున్న అసలైన నేనుపై దృష్టిని నిలపాలి . అప్పుడు నేను ఇది నేను అది నేను అను భావాలు ఉదయించవు .

కావున భగవాన్ చెప్పినదేమనగా నేను అనే భావం ఎక్కడినుండి వస్తున్నదో పట్టుకుని ఆ నేను అనే భావం తన మూలంలో కరిగిపోయే వరకు దానిపై ధ్యాస నిలిపి ఉండమన్నారు . నేను అనే చింతన చేయగా చేయగా అది మనల్ని సరియైన దారిలో పెడుతుంది . ఒక వ్యక్తి తానే కర్త అని ఏదైనా ఒక కార్యము చేసిన దానికి కర్తను నేను అనే భావముతో ఉండి విషయాలపై దృష్టిని మరల్చుతూ ఉంటాడు . దీనిని ' అహంవృత్తి ' అని దీని వలన ద్వైభావముండును . ఈ ద్వైభావన వలననే ఆ అహంవృత్తి నేననే భావము వీడదు . అన్ని విషయాలపై ఎరుక పోయినపుడే ఆ అహంవృత్తి పోవును . అంటే దృష్టి బాహ్య వస్తువులపై ఆకర్షింపకుండా విషయాలను తీసుకోకుండా దృష్టిని అంతర్ముఖం చేయవలెనని భావన . శరీర నేను గురించి ఎరుక కలిగి ఉండటంకాక నేను ( ఆత్మ ) ఐపోవాలి . *భగవాన్ ధ్యానాలు మరియు యోగము వాటికి ఒక కర్త ఉండి ఒక విషయము గురించి ధ్యానించమని నిర్దేశిస్తాయి అని మరియు దానివల్ల నేను అనే భావం గట్టిపడుతుంది . దాని వలన మనస్సు నిశ్చలమై ఆనందాన్ని కల్గిస్తాయి కాని ఆత్మ సాక్షాత్కారానికి దారి తీయవని చెప్పారు . కారణం అహంవృత్తిని వేరు చేయకపోవటమే *. మనస్సంటే ఆలోచనల యొక్క సమూహము . ఈ సమూహమైన ఆలోచనలకు మూలం నేను . *మనస్సంటేనే ఈ నేను అనే ఆలోచనే . నేను అనే ఆలోచన రావటంతోనే శరీరము తప్పుదారి పడుతుంది *. కాబట్టి భగవాన్ చెప్పినది ఈ నేను అనే భావాన్ని వదిలించుకోమన్నారు . అహంవృత్తి యొక్క మూలాన్ని పట్టుకోవటం అంటే అహంకారము యొక్క రూపానికి ఆధారము పట్టుకోవటమే కాక ' నేనున్నాను ' అనేది ఎక్కడి నుండి వస్తుందో తెలుసుకోమన్నారు .
భగవాన్ . భగవాన్ చెప్పినది శుద్ధమైన నేను , ( ఆత్మకి ) నేను అనే భావానికి తేడా తెలుసుకోవాలని సూచించారు . ఈ నేను అనే భావం అది ఒక భావం మాత్రమే . అది కర్తని , కర్మని సూచిస్తుంది . ఆలోచిస్తుంది . నిద్ర , మెలకువ , జననం , మరణం ఇలాంటివి కలిగి ఉంటాయి ఆ నేను అనే భావానికి . కాని శుద్ధమైన నేను ( ఆత్మ ) కు అజ్ఞానముగాని భావముగాని ఉండవు . మనస్సు ఈ విధముగా అంతర్ముఖమై తన మూలాన్ని తెలుసుకుంటే ఆత్మ అయిపోతుంది .

భగవాన్ ఇలా మనస్సును గురించి ఆణిముత్యములైనటువంటి బోధలను ఎన్నో చేశారు . భగవాన్ బోధనలు సముద్రము వంటి లోతైన కొలువలేని వైశాల్యము కల్గినటువంటి మాటలు బోధలు ఎన్నెన్నో కలవు . అన్నీ చెప్పటము అసాధ్యము . భగవాన్ కృపతో కొన్ని ఆణిముత్యములను మాత్రమే తీసుకొని చెప్పబడినవి . కావున సాధకులు మనస్సును అదుపులో ఉంచుకొనవలెను . మనస్సంటేనే ఆలోచనల సమూహము . ఆ ఆలోచనలు రావటానికి గల కారణము బాహ్యదృష్టి ఐహిక సుఖాలకై వస్తువులపై దృష్టి ఆకర్షించినపుడు మనస్సు విచ్చలవిడిగా చెలరేగి అదుపు తప్పి ఆకాశాన్నే అందుకోవలనే తాపత్రయము పడుతుంది . అటువంటి మనస్సును బాహ్యము నుండి లోపలికి తోయాలి . అంటే ఆలోచనలను అరికట్టాలి . ఆలోచన లేకుంటే దృష్టి బాహ్యవిషయములపై పోదు , అంతర్ముఖం అవుతుంది . ఆ అంతర్ముఖమైన మనస్సు మళ్ళీ బైటకు రానీయకుండా క్రొత్త ఆలోచనలేమి వచ్చినా ఆ క్షణమే అణగ తొక్కుట అభ్యసించిన ఆ అభ్యాసము చేయగా చేయగా మనస్సు నిశ్చల స్థితి పొంది ఒక్క ఆత్మయే మిగిలి ఆత్మ సాక్షాత్కారము కలుగుతుంది . అహంవృత్తి అయిన నేనును మరచిలోనున్న నేనును ఆత్మను తెలుసుకోవాలి . దానికి భగవాన్ కృప ఎంతో అవసరం . వారి బోధలు నడి సముద్రములో సంసారమనే సాగరములో కొట్టుకొనుచున్న జీవులందరికి దీపపు స్తంబములై వెలుగుచూపి ఆత్మ సాక్షాత్కారానికి దారి తీస్తుంది . అటువంటి వెలుగు మన జీవితాలపై కూడా ప్రసరింపచేయమని భగవాన్ని అనన్య శరణాగతితో వేడుకుందాం .

భగవాన్ రమణా నీవే మాకు శరణాగతి .

No comments:

Post a Comment