అన్నం పరబ్రహ్మ స్వరూపమని ఎందుకంటారు?
మనిషి మాటలు నేర్చి, వివేకం తెలిసి, వికసించి విజ్ఝానవంతుడైన తర్వాత ఆహారానికి ఉన్న విలువను గుర్తించాడు, మానవుని ప్రాథమిక అవసరాలన్నింటిలోకి ఆహారమే ముఖ్యమైనది అని తెలిసిన తర్వాత సహజంగానే భక్తిభావం పెరిగింది ‘ఆహార ఉపాహారాల ఇష్టత లేనివానికి సుఖాపేక్ష ఉండదు. సుఖాపేక్ష లేనివానికి సంతుష్టత ఉండదు. ఆహారాన్ని సక్రమంగా తీసుకోనని వానికి ఏ కోరికలు ఉండవు' అని చెబుతుంది భగవద్గీత.
ఆలికి అన్నం పెట్టడం ఊరికి ఉపకారం చెయ్యడం’ అన్నాడట వెనకటికెవడో. ఎంత విడ్డూరమైన సామెతో కదా! కానీ జాగ్రత్తగా పరిశీలిస్తే సతికి అన్నం పెట్టడమే కాదు తను తినటం కూడా ఊరికి ఉపకారమే. ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనం’ అన్నాడు మహాకవి కాళిదాసు. ధర్మసాధనకు అత్యవసరమైంది శరీరం. దేహమే కాదు ఈ సృష్టి అంతా ధర్మసాధన నిమిత్తమే. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయాలనే పంచకోశ సమన్వితమైన శరీరంలో అన్నమయకోశానికి మొదటి స్థానం ఇవ్వటం ఆహార ప్రాధాన్యతనే తెలియజేస్తుంది. అన్నపూర్ణ ఆత్మసఖుణ్ణి ఆదిభిక్షువుగాచేసి అన్నాన్ని అందించడం వెనుక ఆంతర్యమూ ఇదే. మనుగడకు మూలాధారమైన ఆహారాన్ని, ఆరోగ్యాన్ని విడదీసి చూడలేం.
‘అన్నాద్భవంతి భూతాని’ అంటుంది భగవద్గీత. సకల ప్రాణులకూ మూలాధారం అన్నం. అన్నమంటే ఆహారం. దాని నుంచే సకల ప్రాణులూ ఉద్భవించాయని కృష్ణపరమాత్ముడి సందేశం. ఇదే విషయాన్ని ‘ఆత్మనః ఆకాశః, ఆకాశాద్వాయుః, వాయోరగ్నిః, అగ్నేరాపః, అద్భ్యః పృథివీ, పృథివ్యా ఔషధయః, ఓషధీభ్యోన్నం, అన్నాత్ పురుషః’ అంటుంది తైత్తరీయోపనిషత్తు. అన్నిటికీ మూలమైన ఆత్మ, ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటినుంచి పృథివీ, నేల నుంచి ఔషధాలు, వాటినుంచి అన్నం, దాన్నుంచి ప్రాణులు- ఇదీ క్రమం. ఈ గొలుసును (శృంఖల) పట్టుకుని వెనక్కి వెళ్తే దానికి మూలమైన ఆత్మ, ఆత్మకు మూలమైన పరమాత్మ కనిపిస్తాయి. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం. శరీరంలోని ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన రూపాల్లో ఉండే పంచప్రాణాలకు పంచభూతాల్లోని శక్తిని అందించడానికి పరమాత్మ తత్వమైన ఆహారాన్ని తీసుకోవాలి.
ఆహారం ఎలా తినాలి?
పృథ్వి, జలం, అగ్ని, వాయువు- ఆకాశ తత్వాలు కలిగిన, బొటనవేలు చూపుడువేలు మధ్యవేలు ఉంగరంవేలు చిటికినవేళ్లతో కలిపి చేతితో ఆహారం తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే పంచభూతాలు ఉత్తేజితమౌతాయి. ఆ ఆహారాన్ని వైశ్వానరాగ్ని రూపంలో ఉండే పరమాత్మ పచనం చేసి ధర్మసాధనకు కావలసిన శక్తిని ప్రసాదిస్తాడు.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం
అంటూ ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తుంది భగవద్గీత. శక్తిని ప్రసాదించే ఈ ఆహారాన్ని భగవంతుడికి సమర్పిస్తూ, ప్రశాంత వాతావరణంలో, శుచిగా, మౌనంగా, ఆకులో లేదా బంగారు, వెండి లాంటి ఉత్తమ లోహ పాత్రల్లో తీసుకున్నప్పుడు అది ప్రసాదమౌతుంది. భోజనానికి ముందు శాస్త్రం తెలిసినవారు మంత్రయుక్తంగా ఆచమనం చేసి, ఆ పరిజ్ఞానం లేనివారు భగవంతుని స్మరిస్తూ కొన్ని నీళ్లు తాగి, అప్పుడు తినడం మానసిక ప్రశాంతతను, శారీరక ఆరోగ్యాన్ని కలిగిస్తుంది.
ఏం తినాలి?
పరమేష్ఠి దేవతలకు అమృతం, మనుషులకు అన్నం, పశువులకు ఆకులలములు, దైత్య రాక్షస పిశాచ జాతులకు మద్య మాంసాలు ఆహారంగా ఏర్పరచారు. ప్రకృతిసిద్ధమైన సహజ ఆహారం సాత్వికాహారం. రుచి కోసం వండి తినడం రాజసాహారం, మసాలాలు, మాంసాహారాలు తామసాహారం. మనం తినే ఆహారాన్ని బట్టే శారీరక, మానసికతత్వాలు ఆధారపడి ఉంటాయి. రాక్షసాదులు తామసిక ఆహారం తీసుకుంటారని కాకుండా, అలాంటివి తినేవారు ఆ ప్రవృత్తి కలిగుంటారని అర్థం చేసుకోవాలి.
ఎప్పుడు తినాలి?
‘న సంధ్యయోర్న మధ్యాహ్నే నార్థరాత్రే కదాచన’ అన్నారు. అంటే ప్రాతఃసంధ్య, సాయంసంధ్య, అర్ధరాత్రి సమయాల్లో భోజనం చెయ్యకూడదంటుంది శాస్త్రం. సాధు, సన్యాసులకు మధ్యాహ్న సమయాన్ని కూడా నిషేధించింది. సంధ్యాసమయాలు సత్ఫలితాన్నిచ్చే ఉపాసనా సమయాలు. అలానే అర్ధరాత్రి ప్రత్యక్ష నారాయణుడైన సూర్యభగవానుడి జాడ శరీరానికి అందని కారణంగా జీర్ణక్రియ మందగించి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. కనుక అది కూడా భోజనానికి నిషిద్ధసమయం.
అన్నం తినడానికి అర్హత ఏమిటంటే జిల్లెళ్లమూడి అమ్మ చెప్పినట్లు ‘ఆకలే అర్హత’. ఆయుర్వేదం ప్రకారం అన్నమంటే ఔషధమే. మనిషి రుతు చర్యను పాటించాలి. అంటే ఆయా రుతువుల్లో, ఆయా ప్రాంతాల్లో దొరికే ఆహారాన్ని, శరీరతత్వాల అనుకూలతను బట్టి తినాలి. ఆహార, జల, విహారాదుల్ని పాటించని ప్రాణిలో వాతపిత్తకఫాలనే త్రిదోషాలు విజృంభించి గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తుల్లాంటి అవయవాలు దెబ్బతిని ప్రాణం దేహాన్ని వదిలి వెళ్లిపోతుంది.
ఎక్కడ తినాలి?
ఆహారాన్ని పరబ్రహ్మ స్వరూపంగా, ప్రసాదంగా భావించి మౌనంగా స్వీకరించాలి. ఎక్కడబడితే అక్కడ తింటే అధ్వాన్నం అంటారు. అధ్వ అంటే దారి, అన్నం అంటే ఆహారం. రోడ్ల పక్కన శుచీ శుభ్రత లేకుండా దొరికే ఆహారమన్నమాట. అది అనారోగ్య హేతువు. దేహం దేవాలయం, అందులో ఉన్న జీవుడు దేవుడన్న భావన ఉన్నప్పుడు ఆహారవిషయంలో జాగ్రత్తపడతాం. అన్నం పరబ్రహ్మ స్వరూపమన్నది ఆధ్యాత్మికతకే కాదు, ఆరోగ్యానికీ సంబంధించింది.
ఎలాంటి ఆహారం తినాలి?
అసలే తినకపోవడం, అతిగా తినడం రెండూ ప్రమాదమే. సగం ఉడికిన, అతిగా వేగిన, ఎప్పుడో వండిన, విరుద్ధ పదార్థాలు, దుమ్మూధూళీ కలిసిన దోషపూరిత ఆహారం, చలికాలంలో చలువచేసేవి, వేసవిలో వేడిచేసేవి- లాంటివన్నీ అనారోగ్య హేతువులే. అలాంటివన్నీ పరిహరించి పరబ్రహ్మ స్వరూపమైన ఆహారాన్ని ఔషధంగా స్వీకరించి శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించాలి.
ఇంట్లోని పిల్లలు భోజనం సరిగా తినకుండా వెదజల్లితే పెద్దలు వారిని మందలిస్తారు. అంతే కాకుండా దాన్ని అలా పారవేయరాదని అన్నం పరబ్రహ్మస్వరూపం అని వారితో అంటారు. అసలు ఇలా ఎందుకు అంటారు అని పిల్లలు అడితే దీనికి నూటికి నూరు శాతం సరైన కారణం చెప్పరు, చెప్పలేరు కూడా.
ప్రతి జీవికి కావాల్సిన ఆహార పదార్థాలను పుట్టుకతోనే ఈ భూమి మీద భగవంతుడు కల్పిస్తాడు. కాబట్టే ఎవరైనా జన్మించిన తర్వాత నారు పోసిన వాడు నీరు పోయకపోడు అని భగవంతుని గురించి పెద్దలు చెబుతుంటారు. అంటే అమ్మ కడుపులో నుంచి బయటకు రాకముందే మనకు ఇంత ఆహారం అని, ఇన్ని నీళ్లని నిర్ణయిస్తాడు. గత జన్మలో చేసిన పాప పుణ్యాలను లెక్కించి వాటిని అనుగుణంగా మనకు సమకూర్చి ఎవరికి కడుపు పుట్టాలో కూడా నిర్ణయిస్తాడట. ఆయన సమకూర్చిన ఆన్న, పానీయాలు ఎప్పుడు నిండుకుంటాయో ఆ జీవికి ఈ భూమి మీద నూకలు చెల్లిపోయినట్లే. అందుకే మీరు తినగా ఉన్న ఆహారాన్ని, తాగే నీటిని వృథా చేయకుండా అవసరమైన వారికి దానంగా ఇవ్వడం వల్ల పుణ్యఫలం పెరుగుతుందట. అలాగే భవిష్యత్తులో మనకు నచ్చిన ఆహారం మరింత లభించి దీర్ఘాయుష్షు కలుగుతుందట. అలా కాకుండా సృష్టికర్త ఇచ్చిన ఆహారాన్ని వృథాచేస్తే నీ ఆయువు క్షీణించి పోతుందట.
ఏ తల్లి అయినా తన బిడ్డల ఆయు: క్షీణాన్ని తట్టుకోలేదు. అందుకే అన్నంపారబోయవద్దని ఒకటికి పదిసార్లు చెబుతుంది. అవసరమైతే దండిస్తుంది కూడా. ఇదంతా వివరంగా చెప్పలేక అన్నం పరబ్రహ్మస్వరూపం అని మాత్రమే చెబుతారు. అందుకే అన్ని దానాలో కన్నా అన్నదానం మిన్న. ఎవరికైనా కోట్లు ఇచ్చినా సంతృప్తి చెందరు కడుపు నిండా భోజనం పెడితే చాలు అంటారు.
మహాభారత యుద్ధంలో కర్ణుడు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ కర్ణునికి అన్ని సౌకర్యాలు లభించాయి. స్వాగత సత్కారాలు లభించాయి. ఏది కావాలంటే అది పొందే అవకాశం ఉంది. అన్నీ అందుబాట్లో ఉన్నాయి. ఏంలాభం...! కర్ణుడికి ఏదో అసంతృప్తి. ఏదో వెలితి. ఎంత తిన్నా కడుపు నిండినట్టుండడంలేదు. సంతృప్తినేది లేదు. ఎందుకు ఈ విధంగా ఉంటుందో అతనికర్థం కావడంలేదు. ఇదే మాట దేవేంద్రుడిని అడిగాడు కర్ణుడు. అప్పుడు దేవేంద్రుడు చిరునవ్వుతో, నీవు అనేక దానాలు చేసావని, అడిగినవాడికి లేదనకుండా ఇచ్చే దానకర్ణుడివని చెప్తారు. మరి.. ఎప్పుడైనా అన్నదానం చేసావా?'' అనడిగాడు. దానికి సమాధానంగా లేదు.. నేనెన్నో దానాలు చేసాను గాని అన్నదానం మాత్రం చేయలేదు అన్నాడు కర్ణుడు. ''పోనీ అన్నం పెట్టే ఇల్లయినా చూపించావా?'' అనడిగాడు దేవేంద్రుడు. కాస్త ఆలోచించిన కర్ణుడు చెప్పాడు- ''అవును. ఓ బీద బ్రాహ్మణుడు నా దగ్గరకు వచ్చి అన్నం పెట్టించమని అడిగాడు. అపుడు నేను ఏదో ధ్యాసలో ఉండి, నాకు అవకాశం లేదు గానీ... అక్కడ ఆ ఇంటికి వెళ్ళు అని ఒక ఇంటిని చూపించాను'' అని. నీవుఅన్నదానం చేసిన ఇంటిని చూపించిన వేలిను నోట్లో పెట్టుకో'' అన్నాడు ఇంద్రుడు. సరేనని ఆ వేలిని నోట్లో పెట్టుకున్నాడు కర్ణుడు. ఒక్క గుటక వేసాడు. ఆ క్షణంలోనే అతని కడుపు నిండిపోయింది. అంతవరకున్న అసంతృప్తి మటుమాయమైంది. ఎనలేని తృప్తి కలిగింది. ఈ కథనం ద్వారా అన్నదానం యొక్క మహత్మ్యం, దాని ప్రాశస్త్యం తెలుస్తోంది...
No comments:
Post a Comment