🌹ఆశీర్వచనములు- ఆచరణలు🌹
నిరంతర తపోధ్యానాలతో, అతిథి అభ్యాగతుల సేవలతో సంతృప్తికర మైన జీవితమును సాగిస్తున్న ఒక గృహస్థ భక్తుడు సాధు దర్శనానికి ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. అక్కడ దండకమండ లాదులను ధరించి ఆసీనులై యున్న సన్యాసిని దర్శించాడు. సాష్టాంగ దండప్రణామం చేశాడు.
సన్యాసి : నారాయణ .. నారాయణ నీకు శుభము కలుగు గాక!
గృహస్థుడు : నాకు అశుభ మెన్నడూ కలుగ లేదు స్వామీ!
సన్యాసి : నీ అదృష్టము వృద్ధిచెందు గాక!
గృహస్థుడు : నాకు దురదృష్ట మేమిటో తెలియదు స్వామీ!
సన్యాసి : నీవు సదా తృప్తితో జీవించెదవు గాక!
గృహస్థుడు : నా జీవితంలో అసంతృప్తి అనేది లేనే లేదు స్వామీ!
సన్యాసి : నీవు సుఖపడెదవు గాక!
గృహస్థుడు : నేను ఎప్పుడూ దుఃఖపడలేదు స్వామీ!
సన్యాసి : నీ అభీష్టము సిద్ధించు గాక!
గృహస్థుడు : నాకు అభీష్టములే లేవు స్వామీ!
సన్యాసి: విచిత్రమైన వాడివిలా ఉన్నావు. అయితే, ఇంతకీ నా దగ్గరికి ఎందుకు వచ్చినట్లు? ఇలా ప్రతి దానికి విడ్డూరపు సమాధానా లిస్తున్నావు?
గృహస్థుడు: క్షమించండి స్వామీ! విడ్డూరాలు, విచిత్రాలు తమ దయ వల్ల నాకు తెలియవు. నేను పలికిన వన్నీ వాస్తవాలే.
1. ఈ సృష్టికి సృష్టికర్త భిన్నంగా లేడు. అంతా ఈశ్వరమయమే. అంతా మంగళమే. ఇక అశుభ మనేది ప్రత్యేకంగా ఎక్కడుంది?
2. స్వామీ! అర్హత లేకపోయినా లభించేది అదృష్టము. ఇదే నిజమైతే కార్యకారణ సంబంధము అర్థం కాదు. అర్హత ఉండి పొందేటప్పుడు అదృష్టము అనే పదానికి అర్థమే లేదు. కనుక నాకు అర్హతలపై విశ్వాసమే గాని అదృష్టాలపై ఆశ లేదు.
3. స్వామీ! తృప్తి, అసంతృప్తి అనేవి సంబంధిత సత్యాలు. ఆశల మధ్య కొట్టుమిట్టాడే వారికి తృప్తిని అనుసరించే ఉంటుంది అసంతృప్తి, ప్రసాద మనస్తత్వముతో జీవించే వారికి సదా సంతృప్తియే. అసంతృప్తి సమీపించనే లేదు.
4. ప్రియమైన దాని యందే కదా స్వామి సుఖం లభించేది? అందరికీ సదా ప్రియమైనది ఆత్మయే కదా! ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. ఆత్మ స్వతః సిద్ధమే కదా స్వామి? కనుక సుఖము ఉన్నదే కదా! పొందే దేముంటుంది ప్రత్యేకంగా?
5. కోరికలు దుఃఖానికి కారణములని తమ లాంటి మహాత్ములే సెలవిచ్చి యున్నారు. పరమాత్మను దర్శిస్తూ జీవించే వారికి అసంతృప్తియే లేదు. అసంతృప్తి లేని వారికి అభీష్టాలు ఎలా ఉంటాయి?
సన్యాసి : అయితే నా వద్దకు ఎందుకు వచ్చినట్లు?
గృహస్థుడు : అద్దం వద్దకు ఎవరు వెళ్ళినా ముఖం చూసుకొనేందుకే. మహాత్మా! సాధువులను దర్శించుట స్వాత్మ ప్రకాశములో రమించుటకే కదా! స్వాత్మ దర్శనానికే కదా! చాలు. నాకు ఏమీ వద్దు. మీ జ్ఞాన వీక్షణాలు చాలు. ఆ ఆత్మ తేజములో రమించడానికే వచ్చాను. సెలవు.
(గృహస్థుడు నమస్కరించి బయట పడ్డాడు. సన్యాసి ఉన్నచోటే ఉన్నాడు).
సత్యావలోకనం : జ్ఞానము లేని సన్యాసి కన్నా జ్ఞానము గల గృహస్థే మేలు. ఆత్మజ్ఞానము లేని ఆశ్రమాలన్నీ శ్రమలే. పరమహంస పరివ్రాజకాచార్యులని చెప్పుకొంటూ ప్రజలను ప్రలోభాలకు గురిచేయ కూడదు. కూపస్థ మండూకాలు కైవల్య సాగరంలో ఓలలాడ లేవు.....
శ్రీ శ్రీ శ్రీ స్వామీ సుందర చైతన్యానంద
( గిరిధారి జనవరి 2024 నుండి)
No comments:
Post a Comment