కంచిపరమాచార్యవైభవం
ధర్మాచరణ – దేశభక్తి
అవతారపురుష లక్షణం శాస్త్రప్రకరంగా ఆ ప్రమాణంతో తీసుకుని వీరిని అవతారపురుషులు అని నిర్ణయించాలి. మహిమలు చూపించడం ఒక్కటే అవతార పురుషుని యొక్క లక్షణం కాదు. వారియొక్క అనంతమైన వ్యక్తిత్వంలో మహిమలు కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. కాని ధర్మప్రతిష్టాపన వారియొక్క ప్రధానమైన లక్ష్యం. ధర్మప్రతిష్టాపన దేశంలో చెయ్యడం ఒకటి. రెండవది వారి ఉనికిచే అనేకమందిని ధర్మం వైపు ప్రచోదనము, ప్రభోదము కలిగించి ఆచార రూపంలో ధర్మాన్ని ప్రతిష్టించడం ఒకటి. మూడవది వారు వారి ధర్మాన్ని నూటికి నూరుపాళ్ళు కాపాడుకోవడం ఒకటి.
ఇది ముఖ్యంగా అవతారపురుషుని యొక్క లక్షణం అని వాల్మీకి రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి గురించి వర్ణించిన విషయం. రామచంద్రమూర్తిని గురించి ఏ విధంగా అయితే ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని చెప్పారో అదేవిధంగా యతీశ్వరులైన జగద్గురువులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు కూడా అటువంటి ధర్మవిగ్రహులు అనేది అక్షరసత్యం. స్వామివారు మహిమలు కూడా ఏవిధంగా చూపిస్తున్నారు అంటే, అది దైవకృపగా ప్రతిష్టించడం జరుగుతున్నది.
తననాశ్రయించిన భక్తులని దైవభక్తులుగా మార్చినటువంటి అపారమైనటువంటి ఒక ఔచిత్యంతో కూడిన కృప వారిదగ్గరున్నది. అందుకే తనవద్దకు వచ్చిన ఒక పేదభక్తుణ్ణి కామాక్షి దేవి వద్దకు వెళ్ళి ప్రార్థన చేసిరా అని చెప్పడం. రామనామం వ్రాసినందుకు ఒక మూగ పిల్లవాడికి మాటలు వచ్చేటట్లు చేశారు.
స్వామివారి దేశభక్తి కూడా అనన్యసామాన్యం. మా పీఠం, మా జపం, మాదగ్గరకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలిస్తాం అనే ధోరణి కాదు వారిది. సమగ్రదేశంపై ఆయనకున్నటువంటి భక్తి. మనం పరిశీలిస్తే వ్యాసులు, శంకరాచార్యులు చాలా పెద్ద దేశభక్తులు. అద్వైత సిద్ధాంతాన్ని భోదిస్తూ కూర్చోకుండా మూత్తం భారతదేసహం ఆసేతుహిమాచలం నాలుగు సార్లు పాదచారియై పర్యటించి ఈదేశం యొక్క గొప్పతనాన్ని ప్రతిష్టించారు.
ఒకవైపు ధర్మబోధనతోను మరోవైపు వరి పాద స్పర్షతోను శక్తిమంతం చేశారు. విద్యారణ్యులు, సమర్థ రామదాసు మొదలైన వారు ఈ దేశ సమగ్రతకు పాటుపడ్డారు. ఒక యోధులు సైనిక వ్యవస్థ కంటే మహాత్ముల యొక్క తపస్సు ఈ దేశాన్ని కాపాడుతున్నది.
‘దైవభక్తే దేశభక్తి, దేశభక్తే దైవభక్తి’. స్వాతంత్ర్యానంతరం సనాతన ధర్మాన్ని కాపాడాలని అహర్నిశలు తపనపడిన వారు పరమాచార్య స్వామివారు ఒక్కరే. అన్ని పీఠములకు, అన్ని మతములకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగేలా పాటుపడినవారు మహాస్వామి వారు.
‘అన్ని మతాలు స్వాతంత్ర్యం పొంది ఉంటాయి’ అన్న క్లాజుని ‘అన్ని మతాలు, అన్ని శాఖలు స్వాతంత్ర్యం పొంది ఉంటాయి’ అని సవరణ చేయించారు. హిందూమతంలోని ఆన్ని శాఖలు బావుండాలి అని ఆకాంక్షించారు. ఎదో ఒక అద్వైతాన్నో, స్మార్తులనో మాత్రమే రక్షించకుండా, అన్ని శాఖలతో కూడిన సనాతన ధర్మాన్ని శంకరుల తరువాత అంతలా రక్షించినవారు మహాస్వామి వారు.
అన్ని శాఖలవారు, మతాలవారు మహాస్వామివారికి భక్తులే. కాని వారిని ఎప్పుడూ వారి స్వధర్మాన్ని వదలమని చెప్పలేదు. వదులుతాము అన్నవారిని అంగీకరించలేదు. అద్వైతం ఒక తత్వం. వారి వారి సంప్రదాయాలను అనుసరింపజేసి వారిలో అద్వైత భావనను ప్రతిష్టించారు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం
No comments:
Post a Comment