జ్ఞానగీత" (నిత్యజీవితంలో ఉపనిషత్తులు) - *కేనోపనిషత్తు* - 1వ భాగము.
"కేన" అనే పదంతో ప్రారంభమౌతుంది గనుక దీనిని "కేనోపనిషత్తు" అని పేరు పెట్టడం జరిగింది. ఇది సామవేదానికి చెందినది. ఇది శిష్యులు అడిగిన ప్రశ్నలకు గురువు చెప్పే సమాధాన రూపంగా సాగుతుంది. ఉమాదేవి కధ ఇందులో కానవస్తుంది. బ్రహ్మపదార్ధమును వర్ణించుట దుర్లభమని దానిని అనుభవంతోనే గ్రహించాలని ప్రభోదిస్తుంది ఈ ఉపనిషత్తు.
శాంతి మంత్రము :
నా అవయవములు శక్రివంతములు అగు గాక. నా వాక్కు, ప్రాణములు, కన్నులు, చెవి మొదలగు ఇంద్రియములన్నియు శక్తివంతములు అగు గాక. సర్వము బ్రహ్మమే. నేను ఎన్నడును బ్రహ్మమును నిరాకరింపకుండెదను గాక. బ్రహ్మము నన్ను నిరాకరింపకుండు గాక. ఉపనిషత్తులలో తెలుపబడిన ధర్మములు నాయందు స్థిరపడు గాక. ఓం శాంతిః శాంతిః శాంతిః.
ప్రధమఖండము - మంత్రముల వివరణ :
శిష్యుడు : ఎవరిచేత ప్రేరేపింపబడి మనస్సు వస్తుప్రపంచము వైపు ఆకర్షింపబడుతున్నది? ఎవరి ఆజ్ఞకు లోబడి ప్రాణము నిలుస్తున్నది? ఎవరి వలన వాక్కు ప్రకటితమౌతున్నది? ఏ జ్ఞానము కళ్ళను, చెవులను ప్రేరేపిస్తున్నది?
గురువు : చెవికి చెవిగా, మనస్సునకు మనస్సుగా, వాక్కనకు వాక్కుగా, ప్రాణమునకు ప్రాణముగా, నేత్రమునకు నేత్రముగా అయివున్న వస్తువు ఒకటుంది. దీనిని గ్రహించినవారు వస్తుప్రపంచము నుండి విముక్తినొంది అమృతతత్వమును పొందుతారు.
దానిని నేత్రములు చూడలేవు, వాక్కు వర్ణించలేదు. దానిని తెలుపుట కష్టము ఎందుకంటే అది తెలిసినదానికంటే, తెలియనిదానికంటే అతీతమైనది. మా పూర్వీకులనుండి మేము గ్రహించినది ఏమిటంటే, దేనిని వాక్కు వ్యక్తపరచలేదో, దేనివలన వాక్కు వ్యక్తమగునో అదే బ్రహ్మము. అంతేగాని ఇక్కడ జీవులు ఉపాసించునది మాత్రము కాదు.
దేనిని గూర్చి మనస్సు మననము చేయలేదో, దేనివలన మనస్సు సంచరించుచున్నదో అదే బ్రహ్మము. అంతేకాని ఇక్కడ జీవులు ఉపాసించునది కాదు. దేనిని నేత్రములు దర్శించలేవో, దేనివలన నేత్రములు చూడగలుగుచున్నవో అదే బ్రహ్మము. అంతేగాని ఇక్కడ జీవులు ఉపాసించునది కాదు.
దేనిని చెవులు ఆలకించలేవో, దేనివలన చెవులు ఆలకించగలుగుతున్నవో అదే బ్రహ్మము. అంతేగాని ఇక్కడ జీవులు ఉపాసించునది కాదు. దేనిని ముక్కు శ్వాసించలేదో, దేనివలన ముక్కు శ్వాసించుచున్నదో అదే బ్రహ్మము. అంతేగాని ఇక్కడ జీవులు ఉపాసించునది కాదు.
*తదుపరి భాగంలో మళ్ళీ కలుసుకుందాము.
No comments:
Post a Comment