🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*సూక్ష్మంలో మోక్షం*
➖➖➖✍️
*మనం సాధారణంగా మోక్షమంటే అదేదో చాలా పెద్దది, దానిని సాధించాలంటే మనం ఎంతో ఎదగాలి అనుకుంటాం.*
*కానీ ఈ సృష్టిలో చూస్తే పెద్ద పెద్ద ప్రాణులే త్వరగా బంధింపబడతాయి. ఒక పులినో, జింకనో బంధించినంత తేలికగా ఒక ఎలుకనో, చీమనో బంధించగలమా?*
*అలాగే పెద్ద చేపలు తేలికగా వలలో పడతాయి కానీ ఎంత చిన్న చేప అయితే వలలోనుండి అంత తేలికగా తప్పించుకోగలుగుతుంది.*
*అసలు "నేను చాలా పెద్దవాణ్ణి, లేదా గొప్పవాణ్ణి" అనుకోవడమే పెనుమాయ.*
*అంతకు మించిన బంధనం ఏముంటుంది? నేను చాలా చిన్నవాడిని, భగవద్భక్తుల దాసానుదాసుడిని అనుకోవడమే మోక్షానికి దగ్గరి దారి.*
*’సురస’ పెద్ద నోటిలో చిక్కినపుడుగానీ, లంకలో రాక్షసులు త్రాళ్ళతో తనను బంధించినపుడుగానీ హనుమంతుడు సూక్ష్మరూపాన్ని ధరించే కదా ఆ బంధనములనుండి విడివడగలిగింది?*
*"సర్వహీన స్వరూపోహం" అని పరమాత్మ తత్వాన్ని తేజోబిందూపనిషత్ నిర్వచిస్తోంది.*
*"అణోరణీయాం" అయినవాడే "మహతోమహీయాం" కాగలడు. అయితే మానవుడు ఈ సత్యాన్ని గుర్తించలేక లేనిపోని అహంకారాన్ని తెచ్చిపెట్టుకొని "నా అంతటివాడు లేడు" అని విర్రవీగి చివరికి ఆ మాయకు బద్ధుడై అనేక జన్మలను ఎత్తుతున్నాడు.*
*తన నిజస్థితియైన ఆత్మతత్వాన్ని గుర్తించిననాడు అదే ఆత్మతత్వం సర్వేసర్వత్రా వ్యాప్తమై ఉన్నదనే జ్ఞానం కూడా కలుగుతుంది.*
*అప్పుడింక ఒకరు గొప్ప ఇంకొకరు తక్కువ అనే భావనే కలుగదు.*
*ఈ చరాచర సృష్టి అంతా పంచభూతాలతోనే నిర్మించబడినప్పటికీ వివిధ నిష్పత్తులలో వాటి వాటి కలయికవల్ల మనకు స్థూలంలో ఇన్నిన్ని వస్తుభేదాలతో కనిపిస్తోంది. ఈ స్థూల దృష్టి ఉన్నంతకాలం ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అనే భేదభావన తొలగదు. అదే మనం సూక్ష్మదృష్టితో చూస్తే సృష్టిలోని ప్రతి వస్తువూ, ప్రాణీ అణువులతోనూ, పరమాణువులతోనూ నిర్మితమైనవే కదా. మరి ఈ పరమాణువులన్నీ ఒకే విధమైన ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లతో ఏర్పడినవే కదా! ఇలా సైన్సు ప్రకారం చూసుకున్నా సర్వసమానత్వం మనకు గోచరిస్తుంది.*
*ఇక భక్తుడవై చూస్తే ఈ సమస్త సృష్టి పరమాత్మనుంచే వచ్చింది కదా? మరి అలాంటప్పుడు ఇక హెచ్చుతగ్గులకు తావెక్కడ?*
*మరి జ్ఞాని దృష్టితో చూస్తే ఈ సర్వమూ తన(పరమాత్మ) స్వరూపమే. ఇలా ఏవిధంగా చూసినా సరైన పరిశీలన చేసినవాడికి హెచ్చుతగ్గులు లేవని అర్థమౌతుంది.*
*మానవుడు ఈ సూక్ష్మదృష్టిని అలవరచుకోలేక కేవలం స్థూల దృష్టితో మాత్రమే చూసి అహంకార మమకారాలకు లోనై బంధనాలను కొనితెచ్చుకుంటున్నాడు.*
*సూక్ష్మదృష్టి, లేదా సూక్ష్మ భావన అంటే దేనికి అంటకపోవటం. "యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే! సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే" అని భగవద్గీత చెబుతోంది.*
*ఆకాశం సర్వవ్యాపమై ఉన్నా దాని సూక్ష్మత్వం చేత దేనికీ అంటకుండా ఉంటోంది. నిజానికి ఆకాశంకన్నా పెద్దది విశాలమైనది ఈ సృష్టిలో ఏదీ లేదు కదా. అంత పెద్దదైనా దాని గుణం సూక్ష్మత్వం. అందుకే అది దేనిచేతా బంధింపబడదు. అలాగే దేహమంతా వ్యాపించియున్నా తన సూక్ష్మత్వం చేత ఆత్మ కూడా దేనికీ అంటదు, దేనిచేతా బంధింపబడదు.*
*ఇదే సూక్ష్మంలో మోక్షమంటే. బంధన లేకపోవడమే మోక్షం కదా! నిజానికి మన నిజస్థితి సదా మోక్షస్థితే. అయితే అట్టి సదాముక్తయైన ఆత్మను నేననే సూక్ష్మాన్ని గుర్తించలేక ఈ స్థూలదేహం నేననే భ్రమలోపడి మనం బంధితులం అయ్యామని తలపోస్తున్నాం, ముక్తిని కోరుకుంటున్నాం. శ్రీగురుదేవులు బోధించినట్లుగా "ముక్తి అనేది పొందేది కాదు. అది నీ స్వరూపమై/స్వభావమై ఉన్నది. నువ్వు చేయవలసిందల్లా దానిని గుర్తించడమే." దానికోసం మనం ఈ సూక్ష్మదృష్టిని అలవరచుకోవాలి. ఆథ్యాత్మికంగా ఎదగడం అంటే సమానత్వ దృష్టి సాధించడమే. సమదృష్టి కలవాడే పండితుడని, జ్ఞానియని భగవద్గీతలో అనేకమార్లు చెప్పబడింది.*
*నేలమీద ఉన్నవాడికి కొన్ని ఎత్తుగానూ, కొన్ని పల్లంగానూ కనిపిస్తాయి కానీ విమానంలో ఎంతో ఎత్తులో ఎగురుతున్నవాడికి ఈ భేదాలు తెలుస్తాయా? వాడికి క్రింద అంతా సమతలంగానే గోచరిస్తుంది. అలాగే ఆథ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవాడే ఇంకా "నేను గొప్ప, నువ్వు తక్కువ" అని మాట్లాడుతాడు కానీ ఉన్నతిని సాధించినవాడు ఎన్నడూ ఈ తరతమ భేదాలు చూడడు.*✍️
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment