*గోవిందుడు అందరివాడేలే....*
*దర్శన అష్టపది:*
*భగవంతుడిని ఒకో మనిషి ఒకో తీరున కొలుచుకుంటారు. కొందరు స్వామి నామాన్ని నిత్యం తల్చుకుంటూ కాలం గడిపితే, మరికొందరు తమ ఇష్ట దైవానికి నిత్య కైంకర్యం చేస్తూ తమ భక్తిని చాటుకుంటారు.*
*ఇంకొందరు స్వామిని ప్రియునిగానూ, తాము ప్రేయసిగానూ భావిస్తూ మధురభక్తిలో మునిగి తేలుతూ ఉంటారు.*
*చూసేందుకు ఇవి శృంగారంలా తోచినా... జీవాత్మ పరమాత్మల కలయికే వాటి వెనుక ఉండే ఆంతర్యం అంటారు.*
*అలాంటి మధుర భక్తి కి ఔన్నత్యాన్ని తీసుకు వచ్చినవాడు "జయదేవుడు."*
*జయదేవుడు చిన్నప్పటి నుంచే కృష్ణభక్తిలో ఓలలాడేవాడు.*
*ఆ భక్తితోనే కృష్ణుడు తప్ప అన్యమెరుగని ‘పద్మావతి’ అనే దేవదాసీని వివాహం చేసుకున్నాడు. ఆ దంపతులిరువురూ నిత్యం కృష్ణ నామ స్మరణలోనే మునిగితేలేవారు.*
**********
*మహా సంగీతవేత్త అయిన జయదేవుడు కృష్ణ భక్తుడు.*
*ఒడిశా రాష్ట్రంలోని ‘కెంధు బిల్వ’ అనే ప్రదేశంలో ‘భోజదేవుడు, రమాదేవి’ అనే దంపతుల కడుపున పుట్టాడు. కారణ జన్ముడు. భార్య పద్మావతీ దేవి.*
*8 అంగాలుగా ఉండేటట్టు రాయడంతో ఆయన కీర్తనలు జయదేవుడి అష్టపదులుగా ప్రసిద్ధి.*
*ఆయన పాట పాడుతుంటే ఆమె నృత్యం చేసేది. జయదేవుని కీర్తనకు నర్తన చేసేటప్పుడు ఆమె పాదం లయ తప్పకుండా ఉండేటట్లు కృష్ణ పరమాత్ముడు జాగ్రత్తపడేవాడట.*
*భక్తులందరూ భగవానుని పాదాలవంక చూస్తుంటే ఆయన మాత్రం ఆమె పాదాలు జయదేవుని కీర్తనలకు అనుగుణంగా పడేటట్లు శ్రద్ధ చూపడంతో ఆయనకు ‘పద్మావతీ చరణ చారణ చక్రవర్తి’ అని ప్రస్తుతించారు.*
*ఒకసారి జయదేవుడు అష్టపదుల రచన చేస్తున్నాడు...*
*ఒక సన్నివేశంలో–*
*“ప్రియే చారుశీలే! స్మరగరళ ఖండనం మమతిరతి మండనం దేహిపదపల్లవ ఉదారం...”అని రాశాడు.*
*అంటే ‘ఓ రాధా! నీ పైన ఉండే విశేషమైన అనురాగంతో మన్మథ బాణాలు నామీద పడి మదనతాపం అనే విషం నా తలకెక్కిపోతున్నది. వేడి తగ్గటం లేదు. ఒక్కసారి పల్లవమైన చల్లని నీ పాదాన్ని తీసి నా తలమీద పెట్టవూ...’ అని కృష్ణుడు అన్నట్లుగా రాసాడు.*
*రాసిన తరువాత ఆయనకు – ‘ఎంత రాధమీద ప్రేమ ఉంటే మాత్రం...రాధా! నీ మీద నాకున్న మోహం చేత మదనతాపం కలిగి వేడెక్కిన నా తల మీద నీ పాదం పెట్టు..’ అంటాడా భగవానుడు..?*
*అనడు!*
*అందువల్ల నేనిలా రాయకూడదు. మరోలా రాయాలి.. అని ఆ చరణాలు కొట్టేసి.. ఘంటం పక్కనపెట్టి–*
*“పద్మావతీ! నదికివెళ్ళి స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని వస్తా..”అని చెప్పి బయల్దేరాడు.*
*అభ్యంగనం...అంటే ఒంటినిండా నూనె రాసుకుని వెళ్ళి స్నానం చేయడం.*
*ఇలా గడప దాటాడో లేదో మళ్ళీ జయదేవుడు వెనక్కి వచ్చాడు... “అదేమిటి మళ్ళీ వచ్చారు?” అని పద్మావతీ దేవి అడిగితే..*
*"అష్టపది పూర్తిచేయడానికి మంచి ఆలోచన వచ్చింది.” అంటూ పూర్తి చేసి వెళ్లిపోయాడు.*
*కొంతసేపటి తరువాత నదీ స్నానం ముగించుకుని జయదేవుడొచ్చాడు.*
*తాను రాసిన పుస్తకం మీద నూనెబొట్లు పడి ఉన్నాయి. “పద్మావతీ, ఇదేమిటి.. నేను కొట్టి వేసిన చరణాలు మళ్ళీ రాసి ఉన్నాయి. ఎవరు రాసారు?” అని అడిగాడు.*
*దానికామె ‘మీరేగా.. మంచి ఆలోచన స్ఫురించిందని ఇది ఉంటేనే బాగుంటుందని అంటూ అప్పుడే వెనక్కి వచ్చి రాసి వెళ్ళారుగా..”అంది.*
*”పద్మావతీ! నువ్వు నిజంగా అదృష్ట వంతురాలివి. వచ్చింది నేను కాదు… ఆ పరమాత్మ.”*
*స్వయంగా ఒంటికి నూనె పూసుకుని నా రూపంలో వచ్చి నేను కొట్టేసిన చరణాలు మళ్ళీ రాసిపోయారు. ఆయన దర్శన భాగ్యం నాకు కలగలేదు. నీవు పొందావు!” అన్నాడు.*
*అందుకే వీటిని ‘దర్శన అష్టపది’ అంటారు. ఇప్పటికీ భక్తులు ఈ అష్టపదులను ఇంట్లో వింటూ ఉంటారు.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
No comments:
Post a Comment