Wednesday, May 22, 2024

 సజ్జన సాంగత్యం


జన సమూహంలో సత్ప్రవర్తన కలిగినవారిని సజ్జనులని, దుర్మార్గంగా ప్రవర్తించేవారిని దుర్జనులని పిలవడం సాధారణం. సజ్జన సాంగత్యంలో చేరాలి, దుర్జన సహవాసం విడవాలి అనేది మహాభారతంలోని విదురనీతి. మంచి, చెడు- మనిషికి రెండు రెక్కలు. వాటితో సమాజపు వీధుల్లో విహరిస్తాడు. కొందరితో మంచిగా, మరి కొందరితో చెడుగా ప్రవర్తిస్తాడు. తిరస్కారం, పురస్కారం రెండూ మనం చేసే పనుల వల్ల కలుగుతాయి. చుట్టూ చేరినవారు మంచి సలహాలతో ప్రభావితం చేస్తే వ్యక్తిగతంగా, సామూహికంగా ప్రయోజనం కలుగుతుంది. వ్యతిరేకంగా పెడదారి పట్టిస్తే అందరికీ దుర్గతి తప్పదు.

సుయోధనుడు అని పేరుగాంచిన యువరాజు అపకీర్తి పొందడానికి కారకులు శకుని, కర్ణుడు. శకుని దుష్ట మంత్రాంగం, కర్ణుడికి తనపై తనకు మితిమీరిన నమ్మకం- దుర్యోధనుడి పతనానికి దారితీశాయి. మరోవైపు ధర్మమార్గంలో శాంతం, సహనం చూపించిన పాండవులకు శ్రీకృష్ణుడి సాంగత్యం లభించి విజయాన్ని ప్రసాదించింది. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే విజయం సాధ్యం.

 మనిషిలో ఉండే నాలుగు అంతఃకరణాలు మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం అని పెద్దలు చెబుతారు. మనసులో పరిపరి విధాల ఆలోచనలు వస్తాయి. మనం చూసే చూపు, వినే మాటలు, తినే ఆహారం- మనసులో ఆలోచనలకు మూలాలు. వివేకం, విచక్షణతో మంచి చెడులను విశ్లేషించేది చిత్తం. ఇటువంటి విశ్లేషణా వడపోతను సాంగత్యం తప్పనిసరిగా ప్రభావితం చేస్తుంది. మంధర పదేపదే చెప్పిన చెడు మాటలు కైక చిత్తాన్ని మార్చాయి. బుద్ధి మంచి నిర్ణయం చేసినా మనిషిలోని అహంకారం దాన్ని తొక్కిపట్టి తప్పుడు దారికి మళ్ళిస్తుంది. సరైన నిర్ణయం వెనక మంచి స్నేహితుల ప్రోత్సాహం ఉంటే అది సజ్జన సాంగత్యంగా మారి వ్యక్తిగతంగా, సామూహికంగా మేలు చేస్తుంది. అధికారం, ఐశ్వర్యం, కీర్తిప్రతిష్ఠలు మన చుట్టూ సమూహాన్ని ఏర్పరుస్తాయి. దాన్ని ఛేదించి ఎవరూ లోపలికి వెళ్ళలేరు. అది కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహం వంటిది.


ఒంటరిగా కన్నా పదిమందితో కలిసి చేసే సామూహిక కార్యక్రమాలు జనంలో స్ఫూర్తి నింపుతాయి. త్యాగరాజ ఆరాధనోత్సవాలు, అన్నమయ్య ఆరాధనోత్సవాల్లో వేలాది గొంతులు బృందగానాన్ని ఆలపిస్తాయి. సంగీత కళాకారుల సామూహిక సాంగత్యంతో రాగాలు భగవంతుడి వైభవాన్ని చాటుతాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన మోహన్దాస్ కరంచంద్ గాంధీ కొల్లాయి కట్టి లక్షలాది భారతీయులతో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఒకరితో ఒకరి సాంగత్యం బలమైన శక్తిగా మారి పరాయి పాలన నుంచి దేశాన్ని విముక్తం గావించింది. బలమైన సజ్జనుల సమూహం ఏదైనా సాధించగలదు. బలవంతమైన సర్పం కూడా చలిచీమల చేత చిక్కితే మరణం తప్పదు అన్నాడు సుమతీ శతకకర్త.

అడవిలో సమూహంగా మేతమేసే పశువులను పులి ఏమీ చేయలేదు. సంఘటితంగా ఎదిరిస్తే తోక ముడిచి పారిపోక తప్పదు. పదకొండు అక్షౌహిణుల సైన్యాన్ని సమీకరించి అహంకరించిన కౌరవులు, ఏడు అక్షౌహిణుల పాండవ సైన్యం ముందు ఓడిపోయారు. రాశి కన్న వాసి ముఖ్యం అని పెద్దలు చెబుతారు. సజ్జన సమూహంతో ఏర్పడే సాంగత్యం ఎప్పటికైనా విజయాన్ని ప్రసాదిస్తుంది. పశు గుణాలు తొలగితే మనిషి పశుపతి కాగలడు. సద్గుణాలు, సత్ప్రవర్తన, మానవత్వం- ఇవే సజ్జనుల లక్షణాలు.

 *ఓం నమో నారాయణాయ*

No comments:

Post a Comment