Saturday, May 25, 2024

దుర్గయ్య స్వభావం

 దుర్గయ్య స్వభావం ---- నారంశెట్టి ఉమామహేశ్వరరావు
             
సుశర్మ అనే పండితుడు ఊరూరు  తిరుగుతూ  ప్రవచనాలు చెప్పేవాడు. మంచి, మానవత్వాలను తెలుపుతూ,  చక్కని నీతి, జీవన రీతి కలగలిపిన మాటలతో   ప్రజలను ఆకర్షించేవాడు. 

ఒకసారి విశాలపురంలో మూడునెలలకు పైగా ఉన్నాడు ఆయన. గ్రామస్తులే ఆయనకి   ఆతిథ్యం  కల్పించారు.  ఆయన బోధనలు విన్న వారిలో  ఆతిథ్యానికి ఆహ్వానించని వ్యక్తి దుర్గయ్య ఒక్కడే. అతడిని చూడగానే పిసినారేమో అనుకున్నాడు సుశర్మ. పిసినారి కాకపోతే బోధనలు  అర్ధం కాలేదేమో అనుకున్నాడు. 

తరువాత రోజు ప్రవచనాలు  ప్రారంభిస్తూ “కొన్నాళ్లుగా అబద్ధం ఆడకూడదని, పరులకు సహాయపడమని చెప్పుకున్నాము. వాటిని పాటించిన వారిని చూడాలని ఉంది. ఎవరెవరు ఏయే మంచి పనులు చేసారో  చెబితే సంతోషిస్తాను” అనడిగాడు  సుశర్మ.

  ఒక్కొక్కరు తాము చేసిన మంచి పనులను చెప్పడం ప్రారంభించారు.  ‘ పేద పిల్లలకు దుస్తులు పెట్టానని’  మునయ్య చెబితే, ‘మా ప్రాంతంలో త్రాగు నీటికి  కష్టాలు పడుతున్న ప్రజలకు  నూతిని తవ్వించానని’ వెంకయ్య చెప్పాడు. ‘ ముసలి దంపతులకు వైద్య సహాయం అందించానని’ కాశయ్య చెబితే, ‘గుడిసెల్లోని పిల్లలకు దీపపు బుడ్డీలు అందించానని’ భూషయ్య చెప్పాడు.  

మిగతావారు కూడా వాళ్ళు చేసిన మంచి పనులను  చెప్పారు. వారిని  అభినందించాడు సుశర్మ. 

దుర్గయ్యను కూడా  చెప్పమని అడిగితే ఏవీ లేవన్నాడతడు . 

“నా పని చేసుకుంటూ,  కుటుంబాన్ని పోషించడానికే సరిపోతోంది. ఇంకా సమయముంటే   మీవంటి మహనీయుల మాటలు వింటాను” అన్నాడు దుర్గయ్య. 
ఆ మాటలకు అక్కడివారు ఫక్కున నవ్వారు. సుశర్మ  కల్పించుకుని  “నువ్వు చెప్పిన అంశాలన్నీ నీ  బాధ్యత.  ఇతరులకు సహాయ పడినట్టయితే   చెప్పు” అనడిగాడు. 

“నాకున్న కొద్దిపాటి ఆదాయంతో పెద్ద కుటుంబాన్ని పోషించడమే కష్టంగా ఉంది” అన్నాడు దుర్గయ్య బాధగా. 

“అంత పెద్ద కుటుంబమా” అని వ్యంగ్యంగా అడిగాడు సుశర్మ.

“అవును. నలుగురు పిల్లలు, పన్నెండు మంది పెద్దలు” అన్నాడు  దుర్గయ్య.

  సుశర్మ ఆశ్చర్యపోయాడు.  

అక్కడకు ఒక బాలుడు వచ్చి “ తాతయ్య కళ్ళు తిరిగి పడిపోయాడు” అని   చెప్పాడు.  బాలుడి వెనుకే  వెళ్ళిపోయాడు దుర్గయ్య. 

“ఇప్పుడు దుర్గయ్య చెప్పింది నిజమేనా?” అని గ్రామస్తులను అడిగాడు సుశర్మ.

 “దుర్గయ్యది పొరుగూరు అనీ, అతడొక అనాథ అనీ, అతడికి పెళ్లి కాలేదని విన్నాను” అని జనంలో ఉన్న రైతు సత్యం చెప్పాడు. అది వినగానే దుర్గయ్య మీద కోపం వచ్చింది సుశర్మకి. పెద్ద కుటుంబం ఉన్నట్టు అబద్ధం చెప్పినందుకు బాధపడ్డాడు. 

సుశర్మకి వైద్యంలోనూ అనుభవం ఉన్నందున  దుర్గయ్య ఇంటికి వెళ్లి  అస్వస్థత పొందిన వ్యక్తికి సహాయపడాలని, దుర్గయ్య కుటుంబం గురించి తెల్సుకోవాలనే  ఆలోచన కలిగింది. వెంటనే గ్రామస్తుల సాయంతో  పొరుగూరు వెళ్ళాడు. 

సుశర్మ వెళ్లేసరికి అనారోగ్యంతో బాధ పడుతున్న   వృద్ధుడుకి సేవ చేస్తున్నాడు దుర్గయ్య. దుర్గయ్యని ప్రక్కకు తప్పుకోమని చెప్పి వృద్ధుడికి తగిన వైద్యం చేసాడు సుశర్మ.  అదంతా  మరికొందరు  వృద్ధులు, పిల్లలు  చూస్తున్నారు. వృద్ధుడు కాసేపటికి తేరుకున్నాడు. 

తరువాత సుశర్మ “సహాయం చెయ్యకపోతే లేదు కానీ కుటుంబం ఉందని అబద్ధం చెప్పడం తప్పు కదా. కొంపదీసి ఆ వృద్ధుడుని తండ్రి అంటావేమో?”  అనడిగాడు దుర్గయ్యని. అవునన్నాడు దుర్గయ్య. కాదన్నాడు వైద్యం పొందిన వృద్ధుడు. 

 “మళ్ళీ అబద్ధం చెబుతున్నావా?” అని కోపంగా అడిగాడు సుశర్మ.

“ఇక్కడున్న వారితో దుర్గయ్యకి ఏ బంధుత్వం లేదు. మా బంధువులు బయటకు గెంటేస్తే ఈ దుర్గయ్య మాకు ఆశ్రయం కల్పించాడు. ఇదొక  ఆశ్రమం” అన్నాడు ఆ వృద్ధుడు.

సుశర్మ ఆశ్చర్యపోయి “ఇతరులకు  సహాయం చెయ్యలేని స్థితిలో ఉన్నట్టు చెప్పావెందుకు?” అని అడిగాడు దుర్గయ్యని. 

“వాళ్ళంతా నా కుటుంబమని అనుకున్నప్పుడు సహాయమెలా అవుతుంది? అలాగే చేసిన మేలుని  ప్రచారం చెయ్యొద్దని మీ మాటల్లో విన్నాను. అదే  పాటించాను” అన్నాడు దుర్గయ్య వినయంగా .  
తన ప్రవచనాలను మిగతా వారంతా కేవలం వింటున్నారని, దుర్గయ్య మాత్రమే ఆచరిస్తున్నాడని సుశర్మకు అర్ధమైంది. గోరంత సాయాన్ని కొండంతగా ప్రచారం చేసుకుంటున్న ఈ రోజుల్లో మంచి పని  చేస్తూ కూడా గోప్యంగా ఉంచాడు  దుర్గయ్య. అతడిని మనస్పూర్తిగా దీవించాడు సుశర్మ.
-----***-----

No comments:

Post a Comment