🙄
ఈ మధ్య రిక్లైనర్‌లో కాళ్లు చాపుకుని సినిమా చూస్తుంటే గతమంతా గుర్తుకొచ్చింది. అప్పట్లో టికెట్లు ధర నేల పావలా (25 పైసలు)
బెంచి అర్ధరూపాయి (50 పైసలు) కుర్చీ ముప్పావలా (75 పైసలు) బాల్కానీ ఒక్క రూపాయి (100 పైసలు). థియేటర్ల ప్రత్యేకత ఏమంటే టికెట్లు ఇస్తూనే వుంటారు. సినిమా మొదలు పెట్టి ఎంతసేపు అయ్యింది అని మనం అడిగితే (మొదలుపెట్టి అరగంట అయినా కూడా) ఎప్పుడూ ఒకటే జవాబు... *ఇప్పుడే టైటిల్స్ అయ్యాయి*
అలగే మనకు కావాలంటే ఇంటర్వెల్ to ఇంటర్వెల్ టికెట్టులు కూడా ఇచ్చేవారు
నేల ఫుల్‌గా నిండి ఒకరి భుజాల మీద ఇంకొకరు కూచున్నా బుకింగ్ ఆగదు. లోపల భీకర యుద్ధాలు జరుగుతున్నా గేట్ కీపర్ చలించడు. బెంచ్ క్లాస్‌లో అయితే ఎగస్ట్రా బెంచీలు, బాల్కనీలో ఇనుప కుర్చీలు వేస్తారు. నేలకి ఆ సౌకర్యం లేదు. ఒకరి మీద ఇంకొకరు, ఎవరి మీద ఎవరు కూచున్నారో వాళ్లకు కూడా తెలియదు. కొందరైతే స్క్రీన్ ముందరున్న అరుగు మీద కూచుని కొండల్లా కనిపించే హీరో ముఖాన్ని చూసి జడుసుకునే వాళ్లు. ఆడవాళ్ల నేలక్లాస్‌లైతే కుళాయి నీళ్లలా ధారాపాతంగా తిట్లూ, బూతులు, కొందరైతే జుత్తు పట్టుకుని ఉండల్లా దొర్లేవాళ్లు. ఫస్ట్ షోకి వచ్చిన ఆడవాళ్లు షో పూర్తి ఐయ్యే వరకూ తిట్టుకునే వాళ్లు.
ఈ ఉత్పాతంలో సినిమా స్టార్ట్ అయ్యేది. ఊపిరాడని ఈ స్థితిలో కూడా బీడీలు, సిగరెట్లు ముట్టించి "బుస్"మని పొగ వదిలేవాళ్లు. తాగిన వాళ్లకి, తాగని వాళ్లకి సమానంగా దగ్గొచ్చేది. సినిమా మాంచి రసపట్టులో అంటే (ఎన్టీవోడు) ఎన్టీఆర్ లేదా కత్తి యుద్ధ కాంతారావు ... కత్తిని ముద్దు పెట్టుకుని ఒంటిచేత్తో తిప్పుతున్నప్పుడు రెండు ఈలలు, ఆయన డూప్ రెండు చేతులతో తిప్పుతున్నప్పుడు, స్పీడుగా గుర్రపుస్వారి చేస్తున్నప్పుడు పది ఈలలు వినిపిస్తూ వుండగా అందరినీ తొక్కుతూ కొందరు హాల్లోకి ప్రవేశించేవాళ్లు.
" గోళీ సోడా నిమ్మసోడా" అని ఒకడు, "వేయించిన శనక్కాయలూ" అని ఇంకొకడు, "చేకోడి జంతికీ'' ''టీ'' ఇలా రాగయుక్తంగా పాడుతూ, అడిగిన వాళ్లకి కుయ్యిమని సౌండ్‌తో సోడా, తుప్పు పట్టిన పావుతో శనక్కాయలు కొలిచి ఇచ్చేవారు. ఇంత ఇరుకులో కూడా రేలంగి, పద్మనాభం, రాజబాబు వస్తే జనం పకపక నవ్వేవాళ్లు. అంజలిదేవిని చూసి ఏడ్చేవాళ్లు. రెండవ ఆటకు వచ్చి జనం తక్కువగా ఉంటే కొందరు ఆ నెలమీదే నిద్రపోయేవారు.
ఇక బెంచిల్లోకి వెళ్దాం. థియేటర్ పుట్టినపుడు కొన్ని వేల నల్లులు బెంచిల్లోకి వలస వచ్చాయి. ప్రేక్షకుల రాక కోసం ఎదురు చూస్తూ, వచ్చిన వెంటనే కుటుంబ సమేతంగా దాడి చేస్తాయి. మొదటిసారి పిర్రకు కుట్టినపుడు ఉలిక్కిపడతాం. రెండోసారి పడతాం. తర్వాత అలవాటు పడతాం. ఆ దురదకు తట్టుకోలేక కొందరు లేచి నిలబడి గీరుకుంటారు. వెనుక ఉన్న వాళ్లు కూచోమని అరుస్తూ వుంటారు.
కొందరు సీనియర్ ప్రేక్షకులు ఉంటారు. వాళ్లకి నల్లులతో అనుభవంతో పాటు శాశ్వత శత్రుత్వం వుంటుంది. అందుకని అగ్గిపుల్ల గీచి బెంచి సందుల్లో తిప్పుతారు. దీంతో ప్రయోజనం ఏమంటే కొన్ని నల్లులు వీరమరణం పొందుతాయి. అయితే కసి, పగ, ప్రతీకారంతో మిగిలినవన్నీ కుట్టడం ప్రారంభిస్తాయి. ఈ కుట్లకి ప్రేక్షకులు బెంచీల మీద ఎగిరెగిరి పడుతూ వుంటారు. ఈ క్లాస్‌లో కూడా పొగ ఉచితం. బీడీల కంపు తక్కువ, సిగరెట్ల కంపు ఎక్కువ.
బాల్కనీలో కుర్చీలు ఉంటాయి. వాటి చర్మం చిరిగిపోయి లోపలున్న కొబ్బరి పీచు, దూది పొట్టపేగుల్లా కనిపిస్తూ వుంటాయి. కుర్చీల్లో పెద్దగా నల్లులుండవు. కానీ మేకులుంటాయి. అవి మన బట్టల మీద ఇష్టం పెంచుకుంటూ అజాగ్రత్తగా లేస్తే పర్‌మని సౌండ్. బాల్కనీలో ప్రొజక్టర్ రూమ్ కూడా వుంటుంది. సోడాలు, శనక్కాయల ట్రాఫిక్ పెరిగినప్పుడు వాళ్ల తలకాయలు స్క్రీన్ మీద కనిపిస్తూ వుంటాయి.
అన్ని క్లాస్‌ల్లోనూ ఫ్యాన్లు వుంటాయి. అయితే ఫ్యాన్ కింద సీటు సంపాయించడం చాలా కష్టం. సంపాయించినా అది సవ్యంగా తిరిగే ఫ్యాన్ అయి వుండడం మరీ కష్టం. ఎందుకంటే చాలా ఫ్యాన్లు పూనకం వచ్చినట్టు గీక్ గీక్ అని అరుస్తూ వుంటాయి. అవి ఊడి మీద పడకపోవడం మన అదృష్టం.
ఇక్కడితో మన కష్టాలు ఆగవు. కరెంట్ వాళ్ల దయ ఉండాలి. ఎన్టీఆర్ బుల్లీ అని హీరోయిన్‌తో శృంగారం చేస్తున్నప్పుడు వాళ్లకి నచ్చదు. పవర్‌కట్. జనమంతా పిచ్చెక్కినట్టు ఈలలేస్తారు. జనరేటర్లు లేని కాలం కాబట్టి కరెంట్ కోసం ఎదురు చూడాల్సిందే. రాకపోతే పాస్‌లు ఇచ్చి పంపుతారు. మరుసటి రోజు వచ్చి చూడాలి.
రిలీజైన ఆరు నెలలకో ఏడాదికో ఆంధ్ర దేశమంతా ఆడిన తర్వాత మాకు వచ్చేది. పాత ప్రింట్లు కావడంతో సినిమా అంతా గీతలు గీతలు వచ్చి కట్ అయ్యేది. ఇన్ని విపత్కర పరిస్థితుల మధ్య కూడా సినిమాని ఎంజాయ్ చేసేవాళ్లం.
ఇపుడు ఇన్ని సౌకర్యాల మధ్య సినిమా చూస్తున్నా ఆ ఉత్సాహం, ఆనందం రావడం లేదు. అమాయకత్వంలోని రహస్యం అదేనేమో!
*తెలివి మీరడానికి మించిన శిక్ష ఇంకొకటి లేదు*.
గోల్డెన్ ఎరా'గా
చెప్పుకోదగ్గ
చిన్ననాటి
సినిమాహాళ్ల కబుర్లు
మరి కొన్ని ఉన్నవి.
ఇంకొక్క ముఖ్యమైన
విషయం
అదేమంటే,
చిన్న సైజు టౌన్లలోని
సినిమా హాళ్లని
'సింగిల్ ప్రొజెక్టర్'తోనే
నడిపేవారు.
మామూలుగా అయితే
'విశ్రాంతి' అనబడే interval / ఇంటర్వల్
(ఇంటర్ బెల్ అనేవాళ్ళం లెండి!) కి
ఒక్కసారి మాత్రమే కథాగమనానికి 'బ్రేక్'పడాలి. కాని,
'సింగిల్ ప్రొజెక్టర్' పుణ్యమా అని మరో రెండు, మూడు సార్లు బ్రేక్ ఇవ్వడం జరిగేది!
మహాశివరాత్రికి వైకుంఠ ఏకాదశికి భక్తి సినిమాలు అర్ధరాత్రి ఆటలు కూడా వేసేవారు.
మరో సంగతండోయ్;
సినిమా కొత్తదీ మరియు 'ఎన్టీ ఓడి' *అగ్గిపిడుగు* లాంటి ఏ జానపదమో అయితే గనక.....
ఒకే సినిమాకు చెందిన
'రీళ్ల బాక్సు'ను
ఊర్లోని రెండు హాళ్లు 'షేర్' చేసుకోవడం కూడా జరిగేది!
అలాంటప్పుడు
రెండు హాళ్ల సినిమా ప్రారంభ వేళల్లో గంటో/గంటన్నరో తేడా పెట్టి..
అలా, ఒకే సినిమాను రెండు హాళ్లలో ప్రదర్శించడం జరిగేది!
ఈ క్రమంలో,
ఏదో కారణం వల్ల (మొదటి సినిమాహాలు ఉన్న వీధిలో కరెంటు పోయి సినిమాను నడపడం..
గంటో, ఇంకా ఎక్కువసేపో ఆగిపోయినపుడు;
రెండో హాల్లో నిరాఘాటంగా కరెంటు ఫ్లో ఉండిఉన్న సందర్భంలో..
మొదటి హాలు నుంచి రెండో హాలుకు 'రీలు' రిక్షా ద్వారా (అప్పుడు ఆటోలు లేవు) చేరడానికి చాలా ఆలస్యం అయిపోయి, ప్రేక్షకులు ఈలలు వేసి వేసి, తెగ హైరానా పడిపోయిన సందర్భాలు-
కోకొల్లలు.
ఏదేమైనా,
ఈ వ్యాసం మాత్రం -
మనల్ని చిన్నప్పటి
మన ఊరిలోని సినిమా హాళ్లతో మనకున్న సంబంధ బాంధవ్యాలనూ మరియు మనకు అప్పటి
అపూర్వమైన, అరుదైన
అనుభవాలనూ గుర్తుచేసి
ఆనందిపoజేసేలా చేసింది కదూ !😂😃😃
చుట్టలు కాల్చేవాళ్ళు నేలలో, మాంచి రసపట్టులో గేట్లు తీసేవాళ్ళు. ఆ వెలుతురు కి తెర క్లియర్ గా కనపడదు. ఇక కేకలు. గోల. నిరోధ్ బూరలు ఊది గాల్లోకి కొట్టేవాళ్ళు. బ్లాక్ లో టికెట్లు అమ్మేవారు. ముందొచ్చేవారు టవల్ వేసి కుర్చీ లు రిజర్వ్ చేసేవాళ్ళు. ఎడ్ల బళ్ళలోనూ, పొలాలకి అడ్డ దారుల్లో వచ్చేవారు. వాల్ పోస్టర్ లు మెయిన్ రోడ్ల గోడలపై అతికించేవారు. పేడ కొట్టేవారు. గూడు రిక్షా మైకుల్లో నేడే చూడమని ప్రచారం. మహాశివరాత్రి నాడు ఒక టికెట్ పై రెండు సినిమాలు వేస్తారు. జడలు, జడ కుప్పెలు కత్తి రించుకునే దొంగలుండేవారు. వీరాచారి తెనాలి స్లైడ్లు వేసి దొంగ లున్నారని, ముందు సీట్ల పై కాళ్ళు పెట్టరాదు అని వేసేవారు. బీహార్ లో వరదలు అని ఓ నిమిషం పాటు ప్రభుత్వ డాక్యుమెంట్ వేసాకే సినిమా వేయాలి. ఈలలు, గోల కామన్. చాంతాడంత క్యూలు, జేబు దొంగ లు, చొక్కా లు చినగటం మామూలే. 😃 వంద రోజుల సినిమా అనేవారు
No comments:
Post a Comment