Friday, May 31, 2024

 అంతర్ముఖ ప్రయాణం అంటే ఏమిటి? తత్త్వమసి మహావాక్యంతో చివరిదాకా అణువునుంచి మహత్తుదాకా తెలియబడినదంతా అంతర్ముఖ ప్రయాణం 
ఫేజ్ - 1
       అసలైన అంతర్ముఖ ప్రయాణం ఏమిటి? మార్జాల కిశోర న్యాయంగా జరగవలసినదేదైతే ఉందో, ఈ 'న ఇతి' అనే ప్రయాణం.
          4 మహా వాక్యాల తరువాత అవాంతర వాక్యంగా నీవు చేయవలసిన ప్రయాణం ఏదైతే ఉందో అది 'నేతి నేతి' మహావాక్యంతో చేయవలసిన ప్రయాణం ఫేజ్ - 2
            అందుకని అవతార్‌ మెహెర్‌బాబా నాలుగు దివ్యయానములుగా విభజించారు. నీవు మానవుడివి అవటంతో దివ్యయానం నెం.1 పూర్తయింది. మానవ ఉపాధిని ధరించటం ద్వారా ఈ సృష్టిలో అణువు నుండి మానవోపాధికి వచ్చేప్పటికి దివ్యయానం ప్రథమభాగం పూర్తయింది. 
ఇక ఇక్కడ నుండి క్షరము, అక్షరము పురుషోత్తముడు మూడు స్థితులని మూడు దివ్య యానములుగా విభజించారు.
 
ఈ శరీరం నేను కాదు. జీవుడు, చైతన్యము, జ్ఞాత అని ఎరగడం ఏదైతే ఉందో అది దివ్యయానం రెండవ భాగం. 

అక్కడినుండి నేను బ్రహ్మ స్వరూపుడను, నేను అక్షరుడను అని తెలుసుకునే స్థానం వరకు, జీవన్ముక్తావస్థ అనుభవం వరకు ఉన్నది దివ్యయానం మూడు. 

అక్కడినుండి చివరి పాదమైనటువంటి చైతన్య రహిత పద్దతి, చైతన్యం తన మూలాన్ని తాను గుర్తెరిగి తానే లేకుండా పోయేటటువంటి చిట్టచివరి ప్రయాణం దివ్యయానం నాలుగు.

        ఇది జన్మరాహిత్య పద్ధతి. ఈ దివ్య యానముల చార్టు చూస్తే 4వ దివ్యయానము తరువాత ఒక చుక్క ఉంటుంది. 
దాని తరువాత ఏమీ ఉండదు. వేదాంత తత్త్వ విజ్ఞానం కూడ ఆ బిందువునుంచే ఆరంభమైందని అంతా చెబుతారు. 
మరల ఆ బిందువు ఎప్పుడైతే లేకుండా పోయిందో, బిందు మధ్యమందు శూన్యమున్నది. ఇది శాక్తేయ విధానంలో కూడ బోధించబడుతుంది.
          కాబట్టి ఎవరు ఏ విధంగా చెప్పినప్పటికి ఉన్న సత్యమంతా ఇదే. తత్త్వమసి మహావాక్య ప్రధానంగా నీవు బ్రహ్మ నిష్ఠుడవై సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుజ్యములనే చతుర్విధ ముక్తులను కరతలామలకంగా బ్రహ్మనిష్ఠ ద్వారా అనుభూతి చెందినవాడవై, తిరిగి మరల అణువు వరకు వచ్చి 'న ఇతి న ఇతి' అంటూ కైవల్యాన్ని పొందాలి. కేవల పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలి.

దక్షిణామూర్తి స్తోత్రం - 10

విద్యాసాగర్ స్వామి 🙏🏻

No comments:

Post a Comment