Thursday, May 23, 2024

పదకవితా పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి జయంతి శుభాకాంక్షలు

 *పదకవితా పితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్ళపాక  అన్నమాచార్యుల వారి జయంతి శుభాకాంక్షలు* 🙏🏻


     తాళ్ళపాక అన్నమాచార్యుల చరిత్రకి చాలా నమ్మకమైన ఆధారం ఒకటి ఉంది. అది ఆయన మనుమడు తాళ్ళపాక చిన్న తిరువెంగళనాథుడు (చిన్నన్నగా ప్రసిధ్ధుడు) రచించిన ద్విపద కావ్యం 'శ్రీ అన్నమాచార్య చరిత్రము'. తాతగారికి సమకాలీకుడూ, ఆయనగురించి అన్ని సంగతులూ తెలిసినవాడు ఆయన. అదే మనకి ప్రమాణం.
చిన్నన్నగారి రచన ప్రకారం అన్నమయ్య గారు  వైశాఖమాసంలో విశాఖా నక్షత్రం ఉన్న రోజున జన్మించారు. 95 సంవత్సరాలు జీవించి 14.02.1503 (ఫాల్గుణ బ. ద్వాదశి నాడు) పరంధామాన్ని చేరుకున్నారు. 78 ఏండ్లే జీవించారు అని మరొక వాదం కూడా ఉంది. వారిది ప్రస్తుతం కడప జిల్లా రాజంపేట మండలంలో ఉన్న తాళ్ళపాక అనే చిన్న గ్రామం. 
తండ్రిగారు గొప్ప పండితులు (తాళ్ళపాక నారాయణ సూరి గారు ఆయన పేరు, తల్లి లక్కమ్మ గారు. లక్కమ్మ అంటే లక్ష్మీదేవి పేరే. లక్ష్మీనారాయణుల పుత్రుడే ఆయన లౌకికంగానూ , పారలౌకికంగానూ  కూడా) కావడం చేత బాల్యంలోనే సకల శాస్త్రాలూ, వేదవేదాంగాలూ, వాటితోపాటు సంగీతం లోనూ ప్రజ్ఞ సంపాదించారు. ఐతే చిన్నప్పటినించీ గాలిపాటలు పాడుకుంటూ తిరుగుతూ ఉండడం చేత ఆయనకి కుదురుగా ఉండడం నేర్పాలని ఆయనకి వరసకో, నిజంగానో ఐన అన్నా వదినలు పొలానికెళ్లి గడ్డి కోసుకురమ్మని పంపారు. ఎనిమిదేళ్ల వయసు ఆయనకి అప్పుడు. గడ్డికోస్తూ కొడవలితో వేలు తెగ్గోసుకున్నాడు. బొట బొటా కారుతున్న రక్తాన్ని చూసి ఒక్కసారి వికలుడై వైరాగ్యంలోకి వెళ్ళిపోయాడు. "వీళ్ళు నాకు ఎలాంటి అన్నలు, వదినలు, బంధువులు? అసలు బంధువు శ్రీవేంకటేశ్వరుడే" అనుకొనేటంత వైరాగ్య-భక్తి భావం కలిగింది. ఇంతలో ఆ పక్కనించి ఒక భక్త బృందం భజన చేసుకుంటూ తిరుపతి వెడుతోంది. చేతిలోని కొడవలిని  పారేసి వారితో కలిసి ఎనిమిదేండ్ల అన్నమయ్యగారు తిరుమల చేరి, అక్కడ స్వామి దర్శనాన్ని చేసుకొని, భగవంతుడి ప్రేరణ వలన ఘనవిష్ణువు అనే వైష్ణవాచార్యుల అండని పొంది, శంఖ చక్ర ముద్రాధారణ చేసి వైష్ణవుడైనాడు. వారు అసలు నందవరీక శాఖకి (నియోగులలోనే ఒక చిన్న శాఖాంతరం) చెందిన బ్రాహ్మణులు.
అలా అక్కడ ఎనిమిది సంవత్సరాలు ఉన్న తరువాత (ఆయనకి పదహారో యేట)  తల్లిదండ్రులు ఆయన ఆచూకీ కనుక్కొని తిరుమల వచ్చి తమతో తీసుకెళ్లారు. అప్పుడే తిరుమలేశుడు ప్రత్యక్షమై వెళ్ళడానికి అనుమతించి, రోజుకి ఒక్క సంకీర్తనైనా చెబుతూ తనని కీర్తించమని ఆనతిచ్చాడు.  ఇంటికి తిరిగివెళ్ళినా కూడా తన పాటలు, తన భక్తి ఇదే ఆయన లోకం. అసలే నీలమేఘశ్యాముడు ఆయన. దానికితోడు ఇల్లూవాకిలీ ఎరగకుండా పాడుకుంటూ తిరగడం! కుమారుడికి పెళ్లి చెయ్యడం ఆలస్యం చేస్తే కుదరదని నారాయణ సూరి గారు అక్కలమ్మ, తిరుమలమ్మ అనే ఇద్దరు కన్యలనిచ్చి పెళ్లి చేశారు.  ఆ తరువాత సంసారంలో పడినా, నియమం ప్రకారం సంకీర్తనా యజ్ఞాన్ని జీవితాంతం నిర్వహించారు అన్నమాచార్యులవారు. అలా 32వేల సంకీర్తనలు చెప్పారట స్వామి పైన! అన్నింటిలోనూ చివరికి శ్రీ వెంకటేశ్వర ముద్ర తప్పదు. ఎన్ని ఊళ్లు తిరిగి ఎందరు దేవుళ్ళని స్తుతించినా, అన్నిటిలోనూ వేంకటేశ్వరుడికి  పెట్టిన ముడి తప్పదు. పండితులకీ, పామరులకీ కూడా రంజకంగా ఉండే సంకీర్తనలు అవి. అహోబిలం వెళ్ళి అక్కడ ఆదివన్ శఠగోప యతీంద్రుల శుశ్రూష చేసి సకల వైష్ణవధర్మాలనూ నేర్చుకున్నారు అన్నమాచార్యులు.
అన్నమయ్య  భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆయనకి ప్రత్యక్షమై మాట్లాడేవాడిని కూడా ప్రతీతి! ఆయనతోపాటు మూడు తరాలకి ప్రత్యక్ష దర్శన భాగ్యాన్ని,ఏడు తరాలు సాయుజ్యాన్నీ, తరువాతి అన్ని తరాలకి శాశ్వత సేవా భాగ్యాన్ని స్వామి అనుగ్రహించారు. 
ఆయన భార్యల్లో తిరుమలమ్మ (తిమ్మక్క) కూడా కవయిత్రే! సుభద్రా కళ్యాణం అనే చిన్న ద్విపద కావ్యాన్ని రాసి, తొలి తెలుగు కవయిత్రిగా భావించబడుతోంది. అన్నమయ్య కుమారుల్లో పెద్దతిరుమలాచార్యులు ప్రసిధ్ధుడు.  అయన కూడా తండ్రికి తగిన పుత్రుడై అనేక రచనలూ, సంకీర్తనలూ వెలయించాడు.  మనుమడు చిన్నతిరువెంగళనాథుడు కూడా వీరి కోవలో వాడే. అన్నమయ్య గారి మరొక పుత్రుడు నరసింగన్న (సంకుసాల నృసింహ కవి గా భావించ బడుతున్నాడు, కవికర్ణ రసాయనం రాసినవాడు) కూడా మంచి కవి. ఇలా తాళ్ళపాక వారివంశం మంచి సాహిత్య సేవ చేసింది. 
అన్నమయ్య జీవితములో జరిగిన అనేక  రసవత్తరమైన సంగతులు చిన్నన్నగారు రాసిన కావ్యంలో ఉన్నాయి. మొదటిసారి తిరుమల కొండ ఎక్కేటప్పుడు అలసిపోయి పడిపోయినప్పుడు అలమేలుమంగమ్మ ప్రత్యక్షమై అలసట తీర్చి, చెప్పులతో కొండ ఎక్కరాదని చెప్పడం, అక్కడ అన్నమయ్య ఆశువుగా శతకాన్ని చెప్పడం, తిరుమల కొండ మీద స్వామి దర్శనం చేసుకోవడం, ఇంటికి తిరిగివెళ్ళడం, కొంతకాలం తరువాత సాళువ నరసింహుడు (రాజు, తనకి బాల్యంలో సహాధ్యాయి) ఆదరించడం, ఆయన కొలువులో ఈయన శృంగార సంకీర్తన చెప్పడము, ఆతరువాత రాజాగ్రహానికి గురై చెరసాలలో పడడము, తన భక్తి గరిమచేత స్వామిని ప్రసన్నుడిని చేసుకొని సంకెళ్లు తప్పించుకోవడము, నిరంతర సంకీర్తనా యజ్ఞము, పరమపదించడము .. అన్నీ బాగా  వర్ణించాడు చిన్నన్న. ఈ చరిత్రే మనకి ప్రమాణం.
అన్నమయ్య మీద వచ్చిన సినిమా ఆయనకి చాలా ద్రోహం చేసింది. ఆయనకి చెందని అనేక విషయాలు ఆయనకి అంటగట్టారు. ఎనిమిదేండ్ల వయసులో కొండమీదికి పోయాడు కానీ నలభై ఏళ్ళ నాగార్జునలా కాదు. మరదళ్ళతో గంతులు, వెకిలి వేషాలూ... పాపం శమించు గాక! కొండమీద ఫైట్లు చెయ్యడాలూ, మరదళ్ళకి గొడుగు  పట్టడాలూ పాపం ఆరువందల యేండ్ల  క్రితం ఉన్న ఆ బ్రాహ్మడికి తెలియవు. గొడుగు కథ రామానుజుల కాలం లో ఉన్న ధనుర్దాసు అనే మల్లయోధుడిది.   ఇంక చెరలో ఉన్నప్పుడు ఆయన పాడినది "ఆకటివేళల అలపైన వేళలను" అనే కీర్తన.  చివరలో గుడిలో దేవుళ్ళ చేత పాటలు పాడించడం వంటివన్నీ ఆ దర్శకుడి   వెర్రికి  పరాకాష్టలే!  అందుకే ఆ సినిమా చూసి అన్నమయ్యమీద ఒక అంచనాకి రాకూడదు!
తాళ్ళపాక చిన్న తిరువెంగళ నాథుడు రాసిన అన్నమాచార్య చరిత్రం ద్విపద కావ్యం టీటీడీ వారు ప్రచురించారు, దొరుకుతుంది. చాలా సరళసుందరమైన భాష, అందరికీ అర్థం అవుతుంది.    
     అన్నమాచార్యుల కుమారుడు, మనుమడు ఆయన రాసిన సంకీర్తనలని రాగిరేకులమీద చెక్కించి, తిరుమల ఆలయములో రామానుజుల సన్నిధికి పక్కాగా ఒక చిన్న మందిరం కట్టి అందులో నిక్షిప్త  పరచారు. దాన్ని "తాళ్ళపాక వారి అర" అనీ, 'సంకీర్తనా భాండారం' అనీ అంటారు. దాని తలుపులకిరువైపులా ఇద్దరి విగ్రహాలుంటాయి. వాటిలో ఎడమవైపునున్నది అన్నమయ్యగారు (కాస్త వయసుమళ్ళిన వారిలా కనిపిస్తారు); కుడివైపునున్నది పెద్దతిరుమలయ్య గారు. అయినప్పటికీ మనకి ఇప్పుడు దాదాపు సగమే దొరుకుతున్నాయి.

-  శ్రీ వంకాయల శివరామకృష్ణ గారు

No comments:

Post a Comment