🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*కర్మ ఫలం!*
➖➖➖✍️
*దేవుడు శరీరధారి కాడనే’ వేద విద్వాంసులు అంటారు. వేదం ఈశ్వరీయం. అది మానవకృతం కాదు. దేవుడు కర్మలు చేయడు, జీవుడు చేస్తాడు. కర్మలు చేసేవారికి ‘శరీరధారణ’ తప్పదు.*
*కర్మల ఫలాలను అనుభవించడానికి జన్మలెత్తాలి, శరీరధారులం కావాలి. శరీరం వల్ల కలిగే లాభం ఏమిటంటే దానితో కర్మలు చేయవచ్చు. వాటి ఫలాలను అనుభవించవచ్చు. దేవునికి కర్మలు చేయవలసిన పని లేదు. అనుభవించవలసిన పని అంతకన్నా లేదు.*
*కర్మ చేసేవాడిని ‘కర్త’ అంటారు. కర్మఫలాన్ని అనుభవించేవాడిని ‘భోక్త’ అంటారు. కర్తృత్వం ఎవరిదో భోక్తృత్వం కూడా వారిదే.*
*దేవునిలో ‘కర్తృత్వ భోక్తృత్వాలు’ లేవు.*
*వేద విహిత కర్మలనే చేయాలని ఈశ్వరాజ్ఞ. వేద విరుద్ధ కర్మలను చేస్తే దుఃఖం తప్పదు. జీవునికి కర్మ ఫలాలిచ్చేవాడు దేవుడే. అందుకే దేవుడవసరం. కర్మఫలాలను అనుభవించడానికి మొదట జీవునికి శరీరం కావాలి. తర్వాత అన్నం, ఆ పిమ్మట అనువైన ప్రపంచమూ కావాలి. ఇదే, దేవుడు చేసే పని.*
*దేవుడు సృష్టి రచన చేయకపోతే మనం శరీరధారులం కానే కాం. కర్మలు చేయనే చేయం. సుఖదుఃఖాలను అనుభవించే అవకాశం ఉండనే ఉండదు. పాపపుణ్యాల ప్రశ్నే ఉద్భవించదు. కనుక, జీవుని స్వభావం దేవుని కంటే విలక్షణమైంది.*
*‘కోరిక, ప్రయత్నం, ద్వేషం, సుఖం, దుఃఖం, జ్ఞానం’- ఈ ఆరు గుణాలు జీవుణ్ని ఆశ్రయించి ఉంటాయి.*
*అందుకే, అతడు మాటిమాటికీ శరీరధారి అవుతాడు. ఒక వస్తువు కావాలని కోరడం, లభించకపోతే ద్వేషభావం కలగడం, వస్తు సంపాదనకు ప్రయత్నించడం, సాధించిన దానితో సుఖపడటం లేదా దుఃఖించడం, సామాన్య జ్ఞానాన్ని కలిగి ఉండటం.. వంటివన్నీ జీవుని విషయంలోనే చూస్తాం.*
*దేవుడు, జీవుడు, ప్రకృతి- ఉనికిగల పదార్థాలు. వీటికి ఎన్నడూ నాశం లేదు. దేవుడు ‘సృష్టి, స్థితి, లయ’ లకు కర్త. ప్రపంచానికి స్వామి. దేవుడు ప్రపంచాన్ని మించి ఉన్నాడు. జీవుడు ప్రపంచంలో భాగస్వామి మాత్రమే. దేవుడు సర్వవ్యాపకుడు, సార్వదేశికుడు. జీవుడు ఏకదేశి. దేవుడొక్కడే, జీవులనేకం. దేవునిలోనే ఈ విశ్వమంతా ఉంది. అంతటా వ్యాపించి ఉన్న దేవునికి అవయవాలను ఎక్కడినుంచి తెచ్చిపెట్టగలం? కనుక, దేవునికి శరీరం అక్కర్లేదు.*
*‘సపర్యగాత్ శుక్రమకాయ మవ్రణ మస్నావిరం...’ అన్నది ‘ఈశావాస్యోపనిషత్తు’. దీని ప్రకారం దేవునికి జీవుని వలె మూడురకాల శరీరాలు లేవు. ‘కారణ శరీరం’, ‘సూక్ష్మ శరీరం’, ‘స్థూల శరీరం’- ఇవేవీ లేనివాడే దేవుడు.*
*కారణజన్ముడు జీవుడేగాని దేవుడు కాడు. జన్మ ఎత్తడానికి దేవునికి ఏ కారణమూ లేదు. జీవునికి మాత్రమే జన్మ ఎత్తే అధికారం ఉంది.*
*దేవుడు ఎప్పటికప్పుడు జీవుల చేష్టల (కర్మలు)ను గమనిస్తుంటాడు. వాటికి అనుగుణమైన విధంగా ఫలాలిస్తుంటాడు. అందుకుగాను అతడు జీవుల అంతరంగాల్లోను అంతర్యామియై ఉంటాడు.* *పరమాణువు కంటే సూక్ష్మమైనవాడు. ప్రపంచ పదార్థాలన్నింటా ‘అదృశ్యరూపం’ (అవ్యక్తంగా)లో ఉంటాడు. ‘ఓంకార వాచ్యుడై’ కొలువున్నాడు. *
*దేవునిలో ‘అసంఖ్యాక ప్రాణుల శిరస్సులు, నేత్రాలు, పాదాలు ఉన్నట్లు’ తెలుస్తున్నది. కానీ, అతనికి శరీరం ఉన్నట్లు లేదు. భూ మండలాన్ని అన్ని వైపుల నుంచి స్పృశిస్తూ, సమస్త జగత్తును మించి ఉన్నాడని తెలుస్తున్నది. అంతటా ఉన్నవాడే మనలోనూ ఉన్నాడు. దేహం లేనివాడే దేహంలో ఉంటాడు.*
*మనం శరీరధారులం కనుక, మన హృదయ కమలాల్లో అంతరాత్మ రూపంలో ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి ఉపాసించి, తరిద్దాం.*✍️
🙏 *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment