Tuesday, October 1, 2024

 *దేవుడిచ్చిన ఇల్లు*
                  


దేహం ఒక దేవాలయమని, అందులో ఉండే జీవుడే దేవుడనీ మహర్షుల వాక్కు. 

భగవంతుడు ప్రసాదించిన ప్రాణధారణ పంజరం వంటి దేహాన్ని రక్షించుకోవడం మనిషికి అత్యావశ్యకం. 

ప్రాణం అనే చిలుక, దేహం అనే పంజరంలో సురక్షితంగా ఉంటుంది. 

ప్రాణాలు నిలుపుకోవడం కోసమే కాక, మనిషి తాను జీవించినంతకాలం చేయవలసిన విధ్యుక్త ధర్మాలను చక్కగా నెరవేర్చడం కోసం దేహాన్ని రక్షించుకోవాలి. 

బ్రహ్మసృష్టిలో మానవ శరీర నిర్మాణం ఎన్నో అద్భుతాలకు నెలవు. త్యాగాలకు కొలువు. పరోపకారాలకు సాధనం. పుణ్యాలకు మూలధనం. 

శరీరం లేకుంటే, ప్రాణం కూడా ఉండదు. 

ప్రాణులకు దేవుడిచ్చిన ఇల్లు దేహం.

మనిషి తన దేహానికి హాని కలగని రీతిలో ధర్మకార్యాలను నిర్వర్తించాలి. 

శరీరానికి హాని కలిగితే మంచిపనులన్నీ ఆగిపోతాయి. కనుక ఎన్ని ప్రయత్నాలు చేసి అయినా శరీరాన్ని రక్షించుకోవాలని పెద్దల మాట. 

కాళిదాస మహాకవి కుమారసంభవ కావ్యంలో ఇదే విషయాన్ని చెప్పాడు. 

పార్వతీదేవి హిమాలయ పర్వతంపై పరమేశ్వరుడి కోసం తపస్సు ప్రారంభించింది. ఉపవాసాలతో, కఠోర దీక్షలతో తపస్సు చేస్తూ తన శరీరాన్ని కష్టపెట్టింది. ఆ కారణంతో ఆమె చిక్కి శల్యమైంది. 

ఆ స్థితిలో ఆమెను పరీక్షించడానికి శివుడు కపట బ్రహ్మచారి రూపంలో వచ్చాడు. 

ఆమె దీన స్థితిని చూసి చలించిపోయాడు. ‘ఓ పార్వతీ! మనిషికి దేహమే కదా ప్రధానం? శరీరాన్ని బాధపెడుతూ ఇంత ఘోరంగా తపస్సు చేయడం నీకు తగినదేనా? శరీరమే కదా ధర్మసాధనం? అలాంటి సాధనాన్ని నాశనం చేస్తే నీవు కోరింది లభించదు కదా?’ అని ప్రబోధించాడు. 

శివుడి మాటల్లో ధర్మసాధన కోసం దేహాన్ని రక్షించుకోవలసిన కర్తవ్యం స్పష్టంగా తెలుస్తోంది.

దేహాన్ని ఆరోగ్యవంతంగా ఉంచుకోవడం కోసం శాస్త్రాలు ఎన్నో ఉపాయాలను, మార్గాలను ఉపదేశించాయి. 

తగిన వ్యాయామం, యోగసాధన, ప్రాణాయామం, యుక్తాహార సేవనం, యుక్త కర్మాచరణం, యుక్తనిద్ర, యుక్తజాగృతి... ఇలా ఎన్నెన్నో మానవ శరీర రక్షణకు ప్రాచీనులు ఉపదేశించిన పద్ధతులు ఉన్నాయి. 

కానీ మనిషి తన అధీనంలోనే ఉండే ఈ ఉపాయాలను పట్టించుకోవడం లేదు. నాగరికత పేరుతో విషపూరితమైన ఆహారాలను, పానీయాలను సేవిస్తున్నాడు. అపరిశుభ్రమైన పదార్థాలను భుజిస్తున్నాడు. కాలాతీత నిద్రలతో, మేల్కొల్పులతో శరీరాన్ని తానే రోగాలవైపు నెట్టివేస్తున్నాడు. 

ఆయా కాలాల్లో ఏది సరైన ఆహారమో, దాన్ని సేవించకుండా, విరుద్ధకాలాల్లో విరుద్ధ పదార్థాలను తింటూ, అనారోగ్యాల పాలవుతున్నాడు. 

మనిషికి అపారంగా ధన సంపాదన ఉండవచ్చు. ఐశ్వర్యాలు మూలుగుతూ ఉండవచ్చు. వాటితో పాటు ఆరోగ్యం, మనశ్శాంతి ఉండాలి. అప్పుడే మనిషి సంపూర్ణ భాగ్యవంతుడవుతాడు.

పాడుపనులు చేస్తూ, పైకి అందంగా ఉన్నంత మాత్రాన మనిషి ఆరోగ్యవంతుడు కాలేడు. 

చెడుపనులు చేసే సమయంలో మనసు మనిషిని హెచ్చరిస్తుంది. అది సరైనది కాదని సూచిస్తుంది. మనిషి ఆ మాటను ఆచరణలో పెట్టాలి. 

యుక్తాయుక్త విచక్షణతో పనులు చేయాలి. ఏ పని చేస్తే ఇతరులకు కష్టం, నష్టం కలుగుతుందో, అలాంటి పనులను చేయకూడదు. పెద్దలు ఏ పనిచేసినా త్రికరణశుద్ధిగా చేయాలన్నారు. 

త్రికరణాల్లో ‘కాయం’(శరీరం) కూడా ఒకటి. కనుక శరీరంతో ధర్మబద్ధంగా జీవించాలే గాని, శరీరాన్ని పాపకృత్యాలకు నిలయం చేయరాదు. 

అప్పుడే మనిషి ఏ మలినాలూ అంటకుండా, నిర్మలంగా ఉంటాడు.        

No comments:

Post a Comment