"ఆత్రేయగీత"
నాల్గవ భాగం
“సూక్ష్మజ్ఞానము” - 11వ భాగము
- శ్రీ శాస్త్రి ఆత్రేయ..
అభ్యాసంతో కూడిన ఆచరణ లేకపోతే పరమాత్మను తెలుసుకోవడం అసాధ్యం. అన్నింటా పరమాత్మను చూడాలన్నా సూక్తి, అంత సులభమైన ప్రక్రియకాదు. దీనికి ఎంతో జ్ఞానం అవసరం. లోకంలో నిత్యం జరిగే సంఘటనలు, మన దృష్టిని పరమాత్మనుండీ దూరం చేస్తాయన్నది ఒక లీల/పరీక్ష.
ప్రస్తుత మానవుల ఆలోచనంత “నేను - నువ్వు” “నాకేంటి - నీకేంటి" అనే
ధోరణిలో నడుస్తున్నది కానీ “మనం” అన్న నిస్వార్థ ఆలోచన పూర్తిగా కనుమరుగైపోయింది.
సమస్యంతా ఇక్కడే వుంది. దీనికి ఒక్కటే పరిష్కారం!! అది “ఆత్మ” గురించి అధ్యయనం చేయడమే, దీనినే “ఆధ్యాత్మికం” అంటాము. అంటే “నన్ను - నేను” తెలుసుకోవడం అన్నమాట.
అంటే “నేనుని”, “మనంగా” మార్చే దివ్యమైన ప్రక్రియ. ఏ మతమైనా, ఏ అభిమతమైనా “సత్యం - జ్ఞానం అనంతమైనదే పరమాత్మ” అన్న పునాది మీదే ఆధారపడి వున్నదన్నది జగమెరిగిన నిజం. మహా గురువులంతా దీన్నే ప్రభోదించేరు.
ఆచరించడమే కష్టం. ఆ సవాలుకు ఎదురీదడానికి ఒక సద్గురుని మార్గదర్శకత్వం అవసరం ఎంతో వుంది. ఆ గురు సాక్షాత్కారాన్ని పొందేందుకు సాధకుడు నిత్యం తపనపడుతూ తన సాధనను కొనసాగిస్తూ వుండాలి.
ఈ ప్రపంచమంతా మూడు గుణవికారాలతో నిండి వుంటుంది. అవి సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ త్రిగుణముల మాయచే ఆవరింపబడిన జీవుడు, ఈ గుణములకు అతీతుడైన పరమాత్మ స్వరూపమును గ్రహించలేకున్నాడు.
వీటి ప్రభావముచేత జీవుడు, అశాశ్వతమైన తన శరీరమునే తానుగా భావించి, క్షణికమైన దృశ్యవస్తువుల వెంట పరిగెట్టి, వాటిని పరమప్రీతితో అనుభవిస్తున్నాడు. వున్న పరమాత్మను లేదని వాదించి, లేని జగత్తును వున్నదిగా భావిస్తూ కాలప్రవాహములో కొట్టుకొని పోతూ జనన
మరణములను పొందుతున్నాడు.
అనేక జన్మల సాధనాఫలితంగా, ఎదో ఒక జన్మలో జ్ఞానము ఉదయిస్తుంది. అప్పుడు జీవుడు ఈ జగత్తంతయూ బ్రహ్మమే ( సర్వం ఖల్విదం బ్రహ్మ), జీవుడు కూడా బ్రహ్మమే(జీవో బ్రహ్మేవ నాపరః) అనే పరమసత్యాన్ని గ్రహిస్తాడు. అదే జీవుని ఆఖరి జన్మ అవుతుంది.
ఆత్మకు జననమరణములు వుండవు. అలాగే భూత, భవిష్యత్, వర్తమానాలు వుండవు. అది శాశ్వతము, సనాతనము. అది అంతటా వ్యాపించియున్నది. అన్ని జీవులయందు వున్నది. ఆత్మను ఆయుధములు ఏమీ చేయజాలవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆరబెట్టలేదు. అనగా ప్రపంచాన్ని శాసించే పంచభూతములు ఆత్మను ఏమి చేయలేవు. దానిని తెలుసుకోవడమే అసలైన సాధన. దానిగురించే యోగుల తపన.
No comments:
Post a Comment