☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
22. సింధుం మాతృతమామ్
నదులు అమ్మ కన్నా ఎక్కువైనవి (ఋగ్వేదం)
వైదికసంస్కృతిలో నదులను ఆరాధించడం ఒక సంప్రదాయం. జడ - భౌతికవాదం ప్రబలిన నేటికాలంలో ఈ ఆరాధన వెనుకనున్న సూక్ష్మం అర్థం కావడం కష్టం. కన్నతల్లి వాత్సల్యంలోని విలువనే గ్రహించలేని కృతఘ్నత ప్రబలుతున్నప్పుడు
ప్రకృతిలోని 'అమ్మతనం' అర్థమవుతుందా!
జలం మనకు ప్రాణాధారం. ఈ జలాలలోనున్న దైవశక్తిని దర్శించారు మహర్షులు.'ప్రకృతి అంతా చైతన్యమయం. ప్రాణవంతం' అనేది వేదదర్శనం. పంచభూతాలూ (మాతృతమములైన నదులలోని ఆ దివ్యత్వాన్ని దర్శించిన గొప్ప సంస్కృతిలో పుట్టిన మనం ఇప్పటికైనా ఆ భావన కలిగించుకుంటే మన మానసిక స్పందనలన్నీ అమృతవర్షిణీ రాగాలవుతాయి. ప్రకృతి జనని పరవశించి పచ్చదనం పండించుకుంటుంది.)పరమేశ్వరస్వరూపాలు. వాటిపట్ల మనం ప్రసరింపజేసే భావపరంపరకి అవి
స్పందిస్తాయి. అనుగ్రహిస్తాయి, ఆగ్రహిస్తాయి. వీటికి పౌరాణిక దృష్టాంతాలే కాక, స్వానుభవ తార్కాణాలూ చాలా ఉన్నాయి.
సీతమ్మ శ్రీరామునితో వనవాసానికి వెళ్ళేటప్పుడు సరయూ, గంగ, గోదావరి వంటి నదులకు నమస్కరించి, ముత్తైదువలకువలె అర్చనలు చేసింది. నదీమాతృకలు పరదేవతాస్వరూపాలు అనేది ఆర్షభావన. ఈ దేశపు ఆత్మభావన.
శ్రీరాముడు సముద్రానికి సేతువు నిర్మించేటప్పుడు దర్భశయనదీక్షతో సముద్రాన్ని ప్రార్థించడం అందరికీ తెలిసినదే. సేతుబంధన దక్షత ఉన్న నలుడు తన సేవలోనే ఉన్నా, ప్రకృతి అనుకూలించకపోతే ఏదీ సాధ్యం కాదు.
నదులనీ, వనాలనీ ఆరాధించడం అనాగరికం కాదు. అది నాగరికతను మించి ఎదిగిన గొప్ప సంస్కారం.
మండుటెండలో నీటిచుక్క లేనప్పుడు ఎంత విలవిల్లాడతాం!అమ్మకడుపులో ప్రాణం పోసుకున్న జీవుని ఉపాధికి చివరి వరకు ప్రాణాధారం జలమే. అంతేకాదు ప్రాణం విడిచి పెట్టాక కూడా జలం తర్పణాదుల ద్వారా జీవుని ఊర్థ్వగమనానికి, ఉత్తమగతులకు హేతువౌతుంది!
అందుకే భగీరథచక్రవర్తి గంగను తీసుకువచ్చి, ఆ జలాలతో తన పితరులకు సద్గతులు కలిగించాలని తపస్సు చేశాడు. హిరణ్యతేజుడు, పురూరవుడు వంటి మహారాజులు సైతం తపస్సుల ద్వారా నదీమాతృకల్ని ప్రసన్నం చేసుకున్నారు.
‘అపోవా ఇదగ్ం సర్వం' అని జలశక్తిని గుర్తించింది వేదసంస్కృతి.
జలాలను సంరక్షించుకోవడం, నిర్మాణం, విలువ, వ్యవసాయం వంటి
జలవిజ్ఞానరహస్యాలెన్నో వైదికగ్రంథాలలో కానవస్తున్నాయి.
నదులను ఆధారం చేసుకొని గొప్ప గొప్ప నాగరికతలను ఆవిష్కరించుకున్నాం.ఎన్నో ఉత్సవాలు, పుష్కరాది వైభవాలు, దేవాలయాలు నదుల తీరాలలో
ఆవిష్కరించుకున్నాం. నదుల తీరాలలో ఆ అమ్మల్ని పలకరిస్తూ కొలుచుకుంటున్నాం.
ఆయా పుణ్యకాల పర్వాలలో విభిన్న ప్రాంతాల వాళ్ళు అంతా కలసి ఎంత సమైక్య సాంస్కృతిక సౌజన్య సంగీతాన్ని ఆవిష్కరిస్తున్నారో మనకు తెలుసు. ఒకొక్క నదీ జలకణం - మన భౌతిక దేహాలనే కాక ఆత్మల్ని కూడ కడుగుతున్న అనుభూతితో అద్వితీయ ఔన్నత్యాన్ని సాధించుకుంటున్నాం.
ఒకొక్క నదీహృదయాన్ని పలకరిస్తే, అందులోని ఎన్నో పురాణగాథలు మన హృదయాల్ని స్పృశిస్తాయి.
గంగమ్మ, గోదారమ్మ, కృష్ణమ్మ అని నదుల్ని అమ్మలుగా పూజిస్తాం మనం. వాటి చలువ వల్ల అన్నం తింటున్నాం. దాహార్తిని పోగొట్టుకుంటున్నాం. కృతజ్ఞత అనేది మానవీయ దృష్టి. ఆ మానవతకు సార్థక్యం కల్పించిన సంస్కృతిలో పుట్టిన మనమే
- ఎన్ని పుణ్యనదుల్ని కలుషితం చేస్తున్నాం! ఎన్నింటినో నామరూపాల్లేకుండా చేశాం!
ఏ మాత్రం జాగ్రత్త లేకుండా, నిర్లజ్జగా నదీమతల్లుల్ని కాలుష్యమయం చేస్తూ, విర్రవీగుతూ, వాటి ఫలితాలు అనుభవిస్తున్నాం. చేతులు కాల్చుకొని ఆకులు పట్టుకోవాలనుకుంటున్నాం. మళ్ళీ పూడికలు తీయడాలు, ఇంటికో గుంట తవ్వుకోడాలు చేసుకుంటున్నాం.
నదీమతల్లులు మనకు తల్లులు - అనే దృష్టి వదులుకొని, ఆ అమ్మను రక్షించుకొనే ప్రయత్నాలు మానేసిన వాటి ఫలితాలివి.
ఋగ్వేదంలో - ఒక యజ్ఞం పూర్తి చేసుకువచ్చిన విశ్వామిత్రుడు అతని పడవ వెళ్ళలేనంత తీవ్రంగా ఉన్న శతద్రూ (సట్లెజ్), వ్యాస (విపాశా) నదుల్ని ప్రార్థించి, వాటి అనుగ్రహంతో వెళ్ళిన గాథ ఉంది. శైశవ కృష్ణుని తీసుకువస్తున్న వాసుదేవునకు
యమున తనంత తాను దారినివ్వడం మనకు తెలిసినదే.
మాతృతమములైన నదులలోని ఆ దివ్యత్వాన్ని దర్శించిన గొప్ప సంస్కృతిలో పుట్టిన మనం ఇప్పటికైనా ఆ భావన కలిగించుకుంటే - మన మానసిక స్పందనలన్నీ అమృతవర్షిణీ రాగాలవుతాయి. ప్రకృతి జనని పరవశించి పచ్చదనం పండించుకుంటుంది.
No comments:
Post a Comment