238 వ భాగం
🕉️ అష్టావక్ర గీత 🕉️అధ్యాయము 18
శ్లోకం 26
అతద్వాదీప కురుతే న భవేదపి బాలిశః|
జీవన్ముక్త సుఖీ శ్రీమాన్ సంసరన్నపి శోభతే||
జీవన్ముక్తుడు చేసే పనులకు అతడే కారణాన్ని చూపించలేడు. కారణము లేకుండా కర్మల నాచరించే అతనిని ఉన్మాది లేక బుద్ధిహీనుడు అని కూడా అనలేము. అతడు ఈ ప్రపంచంలో నివసిస్తున్న అంతరంగంలో నిత్య ఆనందపూర్ణుడే పవిత్ర జీవితం గడుపుతూ ఉంటాడు.
తెలివి కలవారు ప్రణాళికాబద్ధంగా కర్మల ఆచరిస్తూ తాము ఆశించిన ఫలితాన్ని పొందాలి అనుకుంటారు. తమ లక్ష్యాలను విధానాలను స్పష్టంగా తెలుసుకొని పని చేస్తూ ఉంటారు. తెలివి తక్కువ వానిని ప్రశ్నిస్తే అతని లక్ష్యం గురించి గానీ విధానము గురించి గానీ ఏ కారణం వల్ల ఆ పనిని చేస్తున్నాడు ఏది చెప్పలేడు .ఏది అతనికి స్పష్టంగా తెలియదు .తాను చేస్తున్న పని ఎందుకు ఏ ఉద్దేశంతో చేస్తున్నాడో స్పష్టంగా తెలియని వానిని "అతద్వాది" అంటారు.
జీవన్ముక్తుడు ప్రారబ్దానుగుణంగా కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. స్వార్ధం అతనిలో లేకపోవడంతో సాధారణంగా అతని కర్మలు లోకోపకారంగా పరిణమిస్తాయి. అతడు చేసే కర్మలకు కారణాన్ని అడిగితే అతడు కూడా తెలివితక్కువవాని వలెనే ఏ సమాధానము స్పష్టంగా ఇవ్వలేడు. అయితే ఇక్కడ తెలివి తక్కువ దీనికి కారణం కాదు .తన ఉపాధి ద్వారా జరగబడే పనులను తాను సాక్షిగా చూస్తూ ఉండటంతో, తాదాత్మ్యం చెందే అహంకారము లేకపోవటంతో ఆ కర్మలకు అతడు ఏ కారణాన్ని చెప్పలేక మందహాసముతో మౌనం వహిస్తాడు .ఆ కర్మలలో అతడు దైవ లీలలను ఆనందంతో చేస్తూ ఉంటాడు.
తెలివి తక్కువ వాని మనో బుద్ధుల తెలివిహినత వల్ల సరిగ్గా జవాబు చెప్పలేదు. జ్ఞాని తన మనోబుద్ధులను అధిగమించిన స్థితిలో ఉండటం వలన తన పనులకు సరైన కారణాలను చెప్పలేడు .అదే ఇద్దరికీ గల తేడా.
బాధలతో భయాలతో ఆందోళనలతో నిండిన ఈ ప్రపంచంలో మన వలనే
నివసిస్తున్న జ్ఞాని సదా ఆనందంగా అద్వైయమయిన ఆత్మలో నిష్ట కలిగి శాంత స్వరూపడై విరాజిల్లుతూ ఉంటాడు.🙏🙏🙏
No comments:
Post a Comment