Sunday, January 11, 2026

 ఏటికి ఎదురీది!

✍️మిహిర

వలస వచ్చిన పేద రైతులు 
కొండ కోనల మధ్య నిర్మించుకున్న చిన్న పల్లె అది.

ఆ పల్లెకు 
ఓ పరదేశి వచ్చాడు. 
పేరు ద్యూషెన్.

బడి పెట్టి 
చిన్నపిల్లలకు చదువు చెబుతానని 
తనను తాను పల్లెవాసులకు పరిచయం చేసుకున్నాడు.

అసలు బడి ఎందుకో ....
చెప్పమన్నారా ఊరివాళ్లు.

ఆ ప్రశ్న విని 
యువకుడి ఉత్సాహం సగం చచ్చిపోయింది.

తాము భూమి మీద కష్టం చేసి బతుకుతున్నామనీ
తమ పిల్లలూ కూడా అలాగే బతుకుతారనీ ...
వెదవ చదువులు వాళ్లకక్కర్లేదనీ తేల్చేశారు. 

అది ప్రభుత్వ ఉత్తర్వు అని 
జేబులోనుంచి ఆదేశాలు తీసి చూపించేసరికి 
నీ తిప్పలు నువ్వు పడమని వదిలేశారు.

దిబ్బమీద ....
పాడుపడిన గుర్రపుశాలని 
తానే మరమ్మతు చేసుకుని బడి పెట్టాడు ద్యూషెన్.

నిజానికి ...
అతడు గొప్ప విద్యావంతుడేమీ కాదు
కానీ ...చదువు విలువ తెలిసినవాడు.

ఊరంతా తిరిగి 
పిల్లల్ని బడికి తెచ్చుకోవడం,
వాళ్లతో అక్షరాలు దిద్దించడంతో అతడి పని అయిపోలేదు.

ఆ మంచు కొండల్లో చలిని తట్టుకోవాలంటే 
గదిలో నిత్యం కుంపటి రగులుతూ ఉండాలి.
అందుకు ఎండుపుల్లలు ఏరి తెచ్చుకోవాలి.

పూట పూటకీ 
పిల్లలందరినీ ఎత్తుకుని ఏరు దాటించాలి. 

అతడి కష్టాలన్నీ చూసి 
'ఈ బడి పెట్టుకుని కుర్రనాగమ్మలతో కష్టపడుతూ నువ్విలా దరిద్రపు బతుకు అనుభవిస్తున్నావే.
ఎవరిని ఉద్దరించడానికి? గొర్రెలకాపరిగా కుదురు కుంటే కడుపులో చల్ల కదలకుండా బతుకు వెళ్లిపోతుందే..' అనేవారు ఊరివాళ్లు. అన్నింటికీ అతడి నవ్వే సమాధానం. 

ఆ బడిపంతులు దగ్గర చేరిన శిష్యులకు నాయిక పద్నాలు గేళ్ల అల్లినాయ్.
తల్లిదండ్రుల్లేని ఆ బాలికను పిన్ని రాచిరం పాన పెడుతుంటుంది.

బడిలో మాస్టారు చెప్పే విషయాలను కళ్లింతలు చేసుకుని వింటుంది అల్లినాయ్, 
తళతళ మెరిసే ఆ పిల్ల కళ్లలో మాస్టారికి గొప్ప భవిష్యత్తు కనిపిస్తూ ఉంటుంది.
ఇంతలో ఆమెకు పెళ్లి తలపెడుతుంది పినతల్లి.

మాస్టారి మీద దాడిచేసి 
బడిలో ఉన్న పిల్లను బలవంతాన లాక్కెళ్లిపోతారు.
ఓ గొర్రెలకాపరి రెండో భార్యగా బందీ అవుతుంది అల్లినాయ్. 

సైన్యాధికారుల సాయంతో 
ప్రాణాలకు తెగించి ఆ అమ్మాయిని విడిపించి రైలెక్కించి పట్నం పంపించేస్తాడు ద్యూషెన్.

కష్టపడి చదివి. 
తత్వశాస్త్రంలో ప్రొఫెసర్ అయిన అల్తినాయ్ దేశదేశాల్లో పర్యటిస్తుంది. 
యోగ్యుడైన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది.

సొంతూళ్లో కొత్త పాఠశాల నిర్మించిన సందర్భంగా ఆమెను ఆహ్వానించి సన్మానిస్తారు ఊరివాళ్లు, 

అక్కడ వయసు మళ్లిన ద్యూషెన్ పోస్ట్మ్యన్గా ఉన్నాడని తెలిసి ఉద్వేగానికి లోనైన అల్లినాయ్ కలవకుండానే వెళ్లిపోతుంది.

అందరూ మర్చిపోయిన తమ గురుశిష్యుల కథని ఆ ఊరికే చెందిన వ్యక్తికి ఉత్తరంగా రాస్తుంది. 

కొత్త పాఠశాలలో గౌరవం దక్కాల్సింది తనకు కాదనీ ఆ హక్కు తమ తొలి ఉపాధ్యాయుడైన ద్యూషెననీ చెబుతుంది.

ఒక మాస్టారి అంకిత భావం,నిబద్ధత,సాహసం,పిల్లల పట్ల ప్రేమను ప్రతిఫ లిస్తూ వరుస సంఘటనలతో హృద్యంగా సాగే వంద పేజీల ఈ చిన్న నవల 

చదువుతుంటే పలుచోట్ల గుండెపట్టేస్తుంది.

'ద్యూషెన్' పేరుతో కిర్గిజ్ రచయిత చింగిజ్ ఐత్మాతోవ్ రాసిన ఈ నవల తెలుగులో 'తొలి ఉపాధ్యాయుడు'గా వచ్చింది. 

'జమీల్యా', 'తల్లి భూదేవి' లాగే ఐత్మాతోవ్ రచనల్లో బహుళ ఆదరణ పొంది దాదాపుగా ప్రపంచ భాషలన్నింటిలోకి అనువాదమైన పుస్తకం- 
ద్యూషెన్.

అన్ని సమాజాల్లోనూ తొలితరం ఉపాధ్యాయులు ఎదుర్కొన్న అను భవాలను ప్రతిబింబించడమే అందుకు కారణం.

@ఈనాడు దినపత్రిక నుండి సేకరణ

No comments:

Post a Comment