*మనిషి పశుత్వం నుండీ పశుపతి స్థాయికి ఎదగాలి.*
శివపాదపద్మ లగ్నమైన భక్త హృదయం, శివవశమౌతుందని, పరమ యోగత్వం లభిస్తుందని, చివరగా కైవల్యం పొందుతుందని శంకరుల ప్రమాణం.
కొందరు లౌకికమైన, భౌతికమైన కోర్కెలను సాధించుకోవాలని, గ్రహాలను శాంతింపజేసి, దేవతారాధన చేసి, లాభం పొందుతారు. సంసారికి యిది తప్పనిసరి.
కానీ మానవజన్మకు లక్ష్యం, గమ్యం అయిన బ్రహ్మపదాన్ని పొందాలంటే శివుణ్ణి ఆశ్రయించటమే శ్రేయం. ఆ శ్రమలో, ఆ తీవ్రసాధనలో శివుణ్ణి ప్రార్ధించటంలో భక్తుడు వేడుకగా వేడుకోవాలి.
"ఆది కిరాతుడా! శంకరా! ఎందుకయ్యా అరణ్యంలో అమాయకంగా, స్వేచ్ఛగా తిరుగాడే మృగాలను వేటాడుతావు? నాయందే అరిషడ్వర్గాలనే మృగాలు యథేచ్ఛగా సంచరిస్తున్నాయి. నీ బాణాన్ని నావైపు సంధించి వాటిని సంహరించవచ్చు కదా!” అంటారు ఆచార్య స్వామివారు.
“పాములు నీ ఆభరణాలు. విషం నీ కంఠగతం. తోలు కట్టు బట్ట. ముసలి ఎద్దు నీ వాహనం. నీ దగ్గరేముందని, నిన్నడగను? కానీ, నీ దివ్యపాదములందు నిలవగల అచంచల భక్తిని నీవు అనుగ్రహింపగలవు. దానినివ్వు చాలు” అంటున్నారు భగవత్పాదులు.
“మేరు పర్వతము, కుబేరుడు, కల్పవృక్షము, చింతామణి, కామధేనువు నీ అధీనం. నీవివ్వలేనివంటూ వున్నవా” అని కీర్తిస్తూనే, అటువంటి నీకు మేమేమివ్వగలం” అంటారు శంకరులు.
“ఒక్క సూర్యుడు క్రమం తప్పకుండా సమస్త లోకాన్ని ఆవరించిన చీకటిని పోద్రోలి, మాకు దర్శనం యిస్తూనే వున్నాడు. కోటి సూర్యుల వెలుగుకు మూలమైన నీవు నాకెందుకు కనబడవని” చమత్కరిస్తారు భక్తిభావంతో! శివుడంటే వేదమే.
సకల భువన క్షేమంకరుడు. సర్వవ్యాపి, సర్వవేది, రసాలయుడు, పశుపతి, నిత్యుడు అంటూ శివ గుణగణాలను అగణితంగా వర్ణిస్తారు, సానందంతో ఒక్కొక్క గుణ వర్ణనా, శివతత్త్వ విచారణకు దారితీస్తుంది.
శివుణ్ణి సగుణంగా, స్వరూపంగా, నిర్గుణంగా భావించగలగాలి, అదీ శంకర హృదయంతో. త్రిశూలం జడం, చంద్రుడు మచ్చగలవాడు, మృగంలో పశుత్వం, పాముల నడకలు వంకర టింకరలు... యిన్ని దోషాలున్న వాటిని ఆదరించి, ధరించి, తరింపజేయటం శివుడికే సాధ్యమని, వాటన్నిటితో నన్నూ అనుగ్రహించమంటున్నారు భగవత్పాదులు.
మానవుడు స్వభావరీత్యా కఠినాత్ముడు! జన్మపరంపరను అధిగమించలేడు. పశు ప్రవృత్తిని అంత సులభంగా వీడలేడు. జీవితం అనుకూలించనపుడే దైవాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేస్తాడు.
గండం నుండి బయటపడగానే, మళ్లీ తన ప్రవృత్తిలో ప్రవేశిస్తాడు. భయాన్ని భక్తి ద్వారా దూరం చేసుకోవాలని అలమటిస్తాడు. భక్తి అంటే సమర్పణ, శరణాగతి, వినయం - భక్తి అంటే అభేద, అచల, అద్వైత స్థితి. దైవాన్ని సగుణంగానూ, నిర్గుణంగానూ ఉపాసించాలి. నమ్మాలి.
ప్రపంచ శాసనకర్తను గుర్తించాలి. భక్తిద్వారా జ్ఞానానుభవాన్ని పొందాలి. మూర్తి ఏదైనా స్ఫూర్తిని పొందాలి.
No comments:
Post a Comment