సీతాకోకచిలుకగా మారాల్సిందే!
అరిషడ్వర్గాలతో హాయిగా స్నేహం చేస్తూ ఆనందంగా ఉంటున్నాం అనుకునేవారికి ఆధ్యాత్మికత అవసరం లేదు. కామజ్వర పీడితుడై ఉన్నవాడు రామ నామం గురించి ఆలోచించి స్మరిస్తాడా? లేదు. కీచకుణ్ని ఆదర్శంగా పెట్టుకుని బతికే వాడికి ఆధ్యాత్మికతతో సంబంధం ఉండదు. అలాంటి వాళ్లు కలలో కూడా ఆధ్యాత్మికత గురించి ఆలోచించరు.
శత్రువును నిత్యం కోపం రూపంలో తనలోనే పెట్టుకుని తిరిగే వ్యక్తికి ప్రేమ, భక్తి గురించి చెప్పే అవసరం లేదు. చెప్పినా వినడు. ఆధ్యాత్మికత అతడికి అందని ద్రాక్ష. భృగు, దుర్వాసుడు, విశ్వామిత్రుడు కోపానికి ఎలా బలైపోయారో అందరికీ తెలుసు. కోపం ఉంటే ప్రేమ ఉండదు. ప్రేమ లేకపోతే యోగం లేదు. ఆధ్యాత్మికత ఉన్న వ్యక్తికే యోగం అబ్బుతుంది. పిల్లికి బిచ్చం పెట్టని వ్యక్తి దైవజ్ఞానానికి అర్హుడు కాడు. తనకున్న దాంట్లో కొంత ఇతరులతో పంచుకోలేని వాడికి ఆధ్యాత్మికత అంటే అర్ధమవు తుందా? కాదు. లోభికి బ్రహ్మజ్ఞానం గురించి బోధించగలమా? అది ఉచితంగా వచ్చే వస్తువు అనుకునే వాళ్లకు ఆధ్యాత్మికత ఆకాశంలో ఉంటుంది. పంచభూతాల మీద ఆధారపడి బతికే మానవ శరీరం ఎప్పుడైనా పడిపోవచ్చు. ఇలాంటి దేహాన్ని చూసి మురిసిపోయే మనిషికీ ఆధ్యాత్మికత అంటే ఎన్నటికీ తెలియదు. దుర్యోధ నుడు మదోన్మత్తుడై వ్యవహరించి చివరికి కాలగర్భంలో కలిసిపోయాడు. రంగుల ప్రపంచం వెంటపడతారు మనుషులు. చివరి కాలంలో కూడా మోహాన్ని వదిలిపెట్టరు. ప్రపంచ వ్యామోహం వాళ్లని పట్టి పీడిస్తుంది. ఈ జగత్తు శాశ్వతం అనుకుంటారు. మోహపూరితులై శాశ్వత సత్యాన్ని విస్మరిస్తారు. వారి నోట హరి నామస్మరణ కన్నా స్వీయ నామస్మరణే ఎక్కువగా వినపడుతుంది. ఇక, మత్సరం ఉన్న వాడు కూడా ఆత్మజ్ఞానానికి అనర్హుడు. అసూయ లేని అర్జునుడికే శ్రీకృష్ణుడు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు. అసూయ అజ్ఞానానికి పరాకాష్ఠ. ఆధ్యాత్మికత లోతులు తెలుసుకున్నవాడు అందరిని తనలాగే చూస్తాడు. ప్రేమపూర్వ కంగా ఉంటాడు. ఆధ్యాత్మికత అక్కరలేదనుకునేవాళ్లు, దానితో మమేకం అవ్వరు. నదిలో ఉండి నీటి గురించి తెలియదంటారు. చలి కాచుకుంటూ మంట గురించి తెలియదం టారు. బతికే ఉంటారు కానీ తమ ఉనికిని తామే సంశయిస్తుంటారు. ఆధ్యాత్మికత బతకడానికి అవసరం లేదు. కానీ బతుకంటే ఏమిటో తెలియడానికి కావాలి.
సృష్టిలో ఎన్నో జీవరాశులున్నాయి. వాటికి మనుగడకు కావాల్సిన తెలివితేటలు మాత్రమే వాటికి ఉంటాయి. ఆధ్యాత్మికతకూ వాటికీ ప్రత్యక్ష సంబంధం లేకపోయినా పరోక్షంగా ఉంటుందని యోగులు జ్ఞానులు రుజువు చేశారు. ప్రాణికి ఈ ప్రపంచానికిగల సంబంధమేంటో సరిగ్గా తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనమే ఆధ్యాత్మికత. నిజానికి అది అందరికీ అవసరమైనది. ఎవరైనా దానికి దూరంగా ఉంటున్నా కానీ ఎప్పటికైనా గొంగళిపురుగు సీతాకోకచిలుకగా మారాల్సిందే. మనిషి తనలోని దివ్యత్వాన్ని గుర్తించాల్సిందే.
ఆనందసాయి స్వామి
No comments:
Post a Comment