Sunday, April 26, 2026

🌹 అందరికి ఆదివారం శుభోదయతో* ********************************* *(రాఘవ మాస్టారు వ్యాసం*) *🇳🇪*ఓ తత్వ వివేచన నాసదీయ సూక్తం🙏*

 🌹 అందరికి ఆదివారం శుభోదయతో*
*********************************
         *(రాఘవ మాస్టారు వ్యాసం*)

*🇳🇪*ఓ తత్వ వివేచన నాసదీయ సూక్తం🙏*
***************************************

*🌈  మానవజాతి యొక్క ప్రాచీనమైన ,మొదటి జ్ఞాన ,విజ్ఞాన,ప్రజ్ఞాన వాంగ్మయమే, వేదము .సుమారుగా 6000 క్రితమే మునిమతం (హిందూ సనాతన ధర్మం) లోని ఋషులు విశ్వాన్ని గురించి, సృష్టి గురించి ,ఆత్మ పరమాత్మల గురించి, దివ్యదృష్టితో ఆలోచించి, శోధించి, సాధించి తెలుసుకొని చెప్పబడినవి ,వినబడినవి ,ఆపై వ్రాయబడినవి మన వేదాలు అని చెప్పవచ్చు. ఇవి మన మునుల మనోనేత్ర దర్శనముతో, పొందిన దివ్యానుభూతుల సమాహారాలు. ఇవి మానవ జాతి మనుగడకు మార్గదర్శకాలు .*ఇవి ఆచరణీయ మనోవికాస విజ్ఞాన సోపానాలు.*

వేదము "విధ్"( తెలుసుకోవడం) అనే ధాతువు నుండి వెలువడినదే "వేదం" అనే మాట. దీనికి అర్థము (తెల్లము)తెలియజేసేది అని భావం.ఇది మానవుల చేత రచించబడలేదని విశ్వాసము. వీటిని దేవుడు నుండి విని గానం చేశారని అందుకే వీటిని శ్రుతులు (వినబడినవి) అని కూడా అంటారు.

అయితే కొందరు ఇవి మునులే తెలుసుకొని, ఒకరి నుండి ఒకరికి ,గురువుల నుండి శిష్యులకు పరంపరగా ,శతాబ్దాలుగా కంఠస్థం చేయిస్తూ, నేటి తరానికి అందించారని అంటారు.
      ఈనాడు ఆధునిక యంత్రాల సహాయంతో ,విజ్ఞాన శాస్త్రాల సహకారంతో, కనుగొన్న అనేక పరిశోధన ఫలితాలను, ఆనాడే దివ్య తపస్సు శక్తితో ,ఆ మహా ఋషులు తెలుసుకొని ,వేదాలలో  పొందుపరిచారని ఉవాచ.
      ఆయుర్వేదం ,ధనుర్వేదం ,గాంధర్వ వేదం, అర్థశాస్త్రం ,గణిత, ఖగోళ, నక్షత్ర, వ్యవసాయ, రసాయన, వృక్ష ,కిరణ ,లోహ ,యంత్ర ,తంత్ర ,మంత్ర ,పశు ,వాస్తు, కామ శాస్త్రాల వంటి అనేక విజ్ఞాన శాస్త్ర విషయాలను వేదాలలో పొందుపరిచారు.
   నేడు మనము ఆధునికమని కనుగొన్న అనేక విషయాలను ,విశేషాలు అనేకం మన వేద ఇతిహాస పురాణ కావ్యాలలో ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదని ఎక్కువ మంది అభిప్రాయం. 
      నాస్తికులు ,చార్వాకులు, హేతువాదులు, భౌతిక వాదులు ఎవరైనా"*ఇది నా జాతి నా మాతృభూమి నా జాతి వేద వాంగ్మయం* అని ఒక్కసారైనా సగర్వంగా చెప్పుకొని మన వేద ఋషులు దర్శించిన సత్య శకలాలను, వేద నిత్య సకలాలను విని, విస్మయం చెందని, అచ్చెరువు పొందని భారతీయులు ఉంటారా అని భావిద్దాం.
       కాబట్టి అనేక ఊహకందని శాస్త్రీయ విషయాలను ,ఆనాడే వెల్లడించిన ,మన రుషుల నుండి విన్న *నాసదీయ సూక్తం* గురించి వివరంగా తెలుసుకుందామా.
      వేదాలు మొదటలో మూడుగా ఉండేవి తరువాత నాలుగుగా విభజించారు
1. *ఋగ్వేదం (చ0దోబద్ధ మంత్రాలు)*
2. *యజుర్వేదం !గద్యంగా ఉండే సూక్తాలు)*
3. *సామవేదం (గానానికి అనుకూలంగా ఉండే మంత్రాలు)*
4. *అధర్వణ వేదం (యజ్ఞయాగాదులకు చెందిన మంత్రాలు)*

     వేదాలలో మొదటిది ఋగ్వేదం ఇది వేద వాంగ్మయానికి తలమానికం. "ఋక్"
 అనగా దేవతలను పొగడుతూ చెప్పే మంత్రం. ఋగ్వేదంలో ఆనాటి ఆర్యులు అనేకమంది దేవతలను స్తుతిస్తూ సాగిన మంత్రాలు ఎన్నో ఉన్నాయి ,

*వాటిలో విశిష్టమైన ఒక గొప్ప సూక్తం, పదవ మండలంలోని 129వ సూక్తం ,అదే సృష్టి సూక్తం లేదా నాసదీయ సూక్తం అంటారు .దీనిలో 7 మంత్రాలు ఉన్నాయి.*

    *ఈ సూక్తం"నసదా సీత్ (అప్పుడు ఉండటం అక్కడ లేదు) అని మొదలవుతుంది* .*అందుకే దీనిని
*నాసదీయ సూక్తం అన్నారు* ఇది ప్రపంచ చరిత్రలోనే ఒక విశిష్టమైన ఆలోచన* ఈనాటికీ అచ్ఛరువు పొందేటంత  గొప్ప తత్వ వివేచన. అంత గంభీరమైన, అర్వచనీయమైన మనోభావన, ఆనాటి మన మునులు ఆ ఆశ్రమ వాటికలలో సూర్యునికి నమస్కరిస్తూ ,విశ్వ రహస్య ద్వారాలు తెరవడానికి తెర మరుగున దాగిన సత్యాలను కనుగొనడానికి ఎంత తహతహలాడినారో అని అనిపిస్తుంది.

యజ్ఞయాగాదులు ,పశుబలులు ,సోమపానాలు, దేవతా స్తుతులు జరుగుతున్న కాలంలోనే ,ఇంత విచిత్రమైన ఊహ ఆ మునులకు ఎలా స్పురించిందోనని ప్రపంచ మేధావుల నందర్నీ ఆశ్చర్య పరచిన ప్రశ్న ( అడక) .అవి ఇవే ప్రశ్నలు ఒకసారి పరిశీలించండి.
 
   *1.  *నాసదాసీన్నో సదాసీత్త దానీం*
      *నాసీద్ర జోనో వ్యోమాప రోయత్*
     *కిమావరీవః కుహకస్య శర్మ న్నంభః*
     *కీమాసీద్గ హనంగభీరం*
          దీని తెల్లము(అర్థము):
        *అప్పుడు సృష్టికి పూర్వం సత్తు ( ఉండడం) లేదు. అసత్తు (ఉండకపోవడం) లేదు. భూమి లేదు. సంమున్నత ఆకాశము లేదు. మూత వంటిది ఒకటి ఉన్నదే? అదేమిటి .అది ఎక్కడ ఉన్నది ?దానికి ఏది ఆశ్రయం ఇచ్చింది ?సుఖదుఃఖాల అనుభవం ఎవరికి .అక్కడ గంభీరమైన అగాధమైన కొలవలేని ఈ జలరాశి (వెల్లువ )అప్పుడు ఉన్నదా!?

 *2 వమంత్రం*
(సంస్కృత మంత్రము వ్రాయకుండా నేరుగా  దాని అర్థము).
   *అప్పుడు చావు (మృత్యువు) లేదు అమృత తత్వం 
(మిత్తిడి )లేదు. రాత్రి లేదు .పగలు లేదు. అద్వితీయమైన *అది* తన స్వశక్తి చేత ,తన స్వభానుసారం గాలి లేకుండా శ్వాసిస్తుంది. *అది* తప్ప మరేది అప్పుడు అక్కడ లేదు.

*3 వ మంత్రం*
*అప్పుడు మొదటగా చీకటి చేత ఆవరించబడిన చీకటి మాత్రమే ఉన్నది. ఈ సమస్తం అంతరాయం లేని నిరంతర ద్రవం ( సలిలం) ఉన్నది .చివరికి వేడిమి శక్తి చేత ఏమీలేని( చుట్టూరా) దాని నుండి అది జన్మించింది.

*4 వ మంత్రం*
*అన్నింటికంటే ఆదిలో సృష్టించాలని కోరిక ఉన్నది. అదే మనసులో భావి సృష్టికి ప్రధమ బీజం అయినది. మునులు వారి హృదయాలను శోధించి, జ్ఞానం చేత సత్తు( ఉన్నది) కు అసత్తుకు గల అవినాభావ సంబంధాన్ని తెలుసుకోగలిగారు.

*5 వ మంత్రం*
*సూర్యుడు ఉదయించగానే ,అంతట తక్షణం కాంతి ప్రసరించినట్లు, క్షణంలో వాటి వెలుగు మధ్యంతరాళంలో వ్యాపించింది. దానికి కింద ఏది ఉన్నది ?పైన ఏది ఉన్నది? అది సృష్టికి జీజమైనది. సృష్టికి కారణమైన శక్తి అయిoది .దిగువ బలీయమైనది. ఎగువ ఉత్తేజితమైనది.

*6 వ మంత్రం*
*సృష్టి రహస్యం స్పష్టంగా ఎవరు తెలుసుకోగలరు !ఎవరు వివరించి చెప్పగలరు? ఇది అంతా ఎక్కడి నుంచి వచ్చింది ?ఎలా జన్మించింది ?ఈ జగత్ పుట్టుక తర్వాతనే కదా  దేవతలందరూ కూడా పుట్టినది. అందుచేత వారికి కూడా విశ్వ సృష్టి ప్రక్రియ తెలియదు .మరి ఇదంతా ఎలా ఏర్పడిందో ఎవరికి తెలుస్తుంది.

*7 వ మంత్రం*
*ఈ జగత్తు ఎలా ఉద్భవించిందో తెలుసుకో గలవారు ఎవరూ లేరు .అతడు ఈ విశ్వాన్ని సృష్టించాడో లేదో ఎవరికి తెలియదు. పరమాకాశానికి ఆధ్యుడైన పరమాత్మకు మాత్రమే బహుశా ఈ సృష్టి ప్రారంభ రహస్యం తెలిసి ఉంటుంది .బహుశా అతనికి కూడా తెలియదేమో!?

  
      *ఈ నాసదీయ సూక్తాన్ని "బిగ్ బ్యాంగ్ "సిద్ధాంతంతో పోల్చి చూడండి .కొన్ని అంశాలలో ఎంత పోలిక కనిపిస్తుందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. విశ్వాన్ని నడిపించే మూల సూత్రం ఏది? విశ్వం దేనితో ఏర్పడింది .మొదట్లో సృష్టికి ముందు నీరు ఉందని ఎలా ఊహించారు. ఐన్ స్టీ న్ సిద్ధాంతం, బ్లాక్ హోల్స్ ఉనికి ,స్టీఫెన్ హాకింగ్ రేడియోధార్మికత వివరణ అన్నింటిని పై ఏడు ప్రశ్నలు సృజించాయి*
 .
   నిజానికి జీవం ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుట్టిందో ఎవరికీ తెలియదు.? ఒకరకంగా పరిశీలిస్తే సృష్టికి ముందు ఉండే "ఏమీ కానిస్థితికి ",సృష్టికి చివర ఉండే "ఏమీ లేని స్థితికి "చాలా పోలికలు ఉన్నాయి .ఈ విషయాలను భారతీయ తాత్విక చింతనలోని భావాలతో పోలిస్తే సారూప్యత  చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
   *అందుకే జర్మనీ శాస్త్రవేత్త నోబుల్ బహుమతి గ్రహీత "హైజన్బర్గ్ "ఏమన్నాడో చూడండి*
"*భారతీయ తత్వ శాస్త్రానికి, క్వాంటం సిద్ధాంతానికి చాలా పోలికలు ఉన్నాయి.*
* *నా శాస్త్ర పరిశోధనలను భారతీయ తత్వ శాస్త్రం ఎంతో ప్రభావితం చేసింది*
  ఇలాగే అనేకమంది విదేశీ శాస్త్రవేత్తలు, రాజకీయవేత్తలు మన హిందూ ధర్మాన్ని గురించి, వేదాల గురించి చాలా గొప్పగా చెప్పినట్లు మనకు ఆధారాలు ఉన్నాయి.

 *కాబట్టి మన వేద ఋషులు సత్ ,అసత్ లేని పరిస్థితిని, స్థల, కాల రాహిత్యాన్ని, జీరో స్పేస్ ,జీరో టైం,l ఎలా ఊహించారో .....నిజంగా వారి మేధస్సుకు ,దివ్య దృష్టికి ,జ్ఞాన నేత్రాలకి వేలవేల దండాలు. మెచ్చుకోళ్ళు.*

   *సర్వేజనా సుఖినోభవంతు*
    ఓం శాంతి శాంతి శాంతి శాంతిః

*రాఘవ మాస్టారు కేదారి*
డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ 
జాతీయ తెలుగు పరిరక్షణ సమితి 
సినీ నిర్మాత ,రచయిత

No comments:

Post a Comment