Thursday, January 27, 2022

ఏది నేస్తం....!?

ఏది నేస్తం....!?
------------------------
ఆ రోజుల్లో...........
పచ్చిక బయలే బ్రతుకు గుండా,
వెచ్చని మమతే మనసు నిండా!
అవకాశాలు లేని అవసరాలుండేవి,
అవసరాలు తీర్చే ఆత్మీయతలుండేవి,
మనుషులు మాత్రమే తిరిగే వీధులుండేవి,
నడకే అలవాటుగా దారులుండేవి,
కన్నుల్లో కన్నీరున్నా
ఓదార్చే చేతులుండేవి,
అన్యాయం ప్రశ్నించే గొంతులుండేవి,
ఆదర్శం పంచుకునే టీ హోటల్లుండేవి,
మనసును మనసిచ్చి పంచుకునే ప్రేమలుండేవి,
మాలిన్యం అంటని మమతలుండేవి,
ఏడిస్తే భుజం తడిచేది,
నవ్వేస్తే ముఖం వెలిగేది,
చేతులు పైన వేసుకొని కబుర్లాడే
ఆప్యాయపు స్నేహాలుండేవి,
నడిచి మెట్లెక్కే భవంతులుండేవి,
అలసితే సేద తీర్చే పార్కులుండేవి,
కోప్పడే తండ్రులూ,
కొంగుతో కన్నీళ్లు తుడిచే తల్లులూ ఉండేవారు,
తాతలు ముసలాళ్లయినా
వారి మాటే నెగ్గేది,
బామ్మలు కొంగు కప్పుకున్నా
వారి కథలకే చెవి ఒగ్గేది,
దూరాలు దారుల్లోనే తప్ప
మది నిండా మమతలుండేవి,
కబురు పంపాలంటే
కార్డో, దూర తంత్రో తోడయ్యేది,
పెళ్లంటే పందిళ్ళూ, సందళ్ళూ
ఊరంతా సంబరాలు పరవళ్లు తొక్కేవి,
బాల్యం బంతులాటలాడేది,
యవ్వనం కళ్ళల్లో కలలు దాచేది,
వయసుడిగాక కుటుంబమంతా
ఊత కర్రయ్యేది,
ఏమయింది ఆ కాలం నేస్తం?
జర్రున కాళ్ళ క్రిందుగా జారిపోయింది,
కళ్ళల్లో దుమ్ము కొట్టి
మనసు చంపివేసింది,
సహజత్వం పూల సజ్జలో ఇరుక్కుంది,
సహనం చెడి వేగం పరిగెత్తింది,
నిలిచేందుకు వ్యవధి లేదు,
బ్రతుకంతా ఒకే చేదు,
మాట లేని పాటయ్యింది,
దాటలేని బాటయ్యింది!!
---- దండమూడి శ్రీచరణ్

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

No comments:

Post a Comment