విభూతి - అహంకారం
పరమాచార్య స్వామి వారు మహారాష్ట్రలోని సతారాలో మకాం చేస్తున్నారు. చాలామంది భక్తులు వారి దర్శనార్థమై వేచియున్నారు. మహాస్వామి వారి భక్తులలో వీణావాదన విద్వాంసుడొకడు ఉన్నారు. మహాస్వామి వారి సతారా ఆగమనం గురించి విని అతను కూడా వారిని దర్శించుకోవడానికి వచ్చాడు. మహాస్వామి వారిముందు తన వీణా ప్రావీణ్యాన్ని ప్రదర్శించాలని అతని కోరిక.
కొద్దిసేపటి తరువాత ఎలాగో మహాస్వామి వారిని దర్శించుకున్నాడు. దర్శనానంతరం తన వీణ పైన ఒక కృతిని వినిపిస్తానని మహాస్వామి వారిని వేడుకున్నాడు. స్వామి వారి అనుమతితో వాయించడం మొదలుపెట్టాడు. పరమాచార్య స్వామి వారు సకల కళల్లోను సర్వ శాస్త్రాల్లోను నిష్ణాతులన్నది జగమెరిగిన సత్యం. ఆ విద్వాంసుని వీణావాదనం చాలా అద్భుతంగా ఉంది అక్కడున్నవారందరికి బాగా నచ్చింది.
కొద్దిసేపు అక్కడ అంతా నిశ్శబ్ధంగా ఉంది. తరువాత మహాస్వామి వారు ఆ వీణను తీసుకుని ఒక కృతిని వాయించారు. ఆ విధ్వాంసునికంటే మహాస్వామి వారిది పరమాద్భుతంగా ఉంది. మహాస్వామి వారు ముగించిన వెంటనే ఆ విధ్వాంసుడి కళ్ళు అపరాధ భావనతో వర్షించాయి. వెంటనే స్వామి వారి పాదములపై పడి సాష్టాంగం చేసాడు. పదే పదే అలా చేస్తూనే ఉన్నాడు. పరమాచాస్వామి అతనివైపు చూసారు కాని ఏమి మాట్లాడలేదు. కొద్దిసేపటి తరువాత స్వామి వారు లోపలికి వెళ్ళారు.
జరుగుతున్న విషయం అందరూ చూస్తున్నారు కాని ఎవ్వరికి ఏమి అర్థం కావటం లేదు. ఆ విద్వాంసుడు బయటకు వెళ్ళిపోయిన తరువాత కొంతమంది స్వామి వారి భక్తులు ఏమి జరిగిందని అడిగారు. ఆ విధ్వాంసుడు వారితో, ”నేను అహంకారంతో పెద్ద పొరపాటు చేసాను. మహాస్వామి వారు నా అహంకారాన్ని తుడిచేసారు” అని అన్నాడు. కాని వారికేం అర్థం అసలు ఏమి జరిగిందో చెప్పమన్నారు.
“నా పాండితీ ప్రకర్ష చూపించుకోవాలని చాలా క్లిష్టమైన కృతిని ఒకదాన్ని వీణ పైన పాడాను. మధ్యలో కొన్ని స్వరాలు మరచిపోయాను. చుట్టూ చూస్తే ఇక్కడ వీణ ఎవరికి రాదు తెలిసి కొన్ని తప్పు స్వరాలి కలిపి పూర్తిచేసాను. సంగీతంలో స్వరదోషం చాలా పెద్ద తప్పు. నేణు ముగించిన తరువాత పరమాచార్య స్వామి వారు ఆ వీణనందుకొని నేను తప్పుగా నుడివిన స్వరాలని సరిగ్గా వాయించి చూపించారు” అని అన్నాడు.
ఇంకా అతను ఇలా చెప్పాడు, “పరమాచార్య స్వామి వారు చాలా చాలా క్లిష్టమైన కృతిని ఒకదానిని వాయించారు. ఆ కైలాసనాథుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి రావణుడు స్తుతించిన కృతి అది. రావణ గర్వాన్ని శివుడు భంగపరచినట్టు నా అహంకారాన్ని మహాస్వామి వారు తొలగించారు”.
మన పూర్వ జన్మ పుణ్యఫలంగా ఈశ్వరుడు మనకు వివిధ విభూతులను ఇస్తాడు. వాటిని ఆ భగవంతుడు ఇచ్చిన ప్రసాదంగా భావించాలి కాని, అవి ఉన్నందువల్ల నాఅంతవాణ్ణి అని అహంకరించకూడదు. అది మనిషి వినాశన హేతువు.
No comments:
Post a Comment