🌴🌷ప్రయత్నం-ఫలితం 🌷🌸
🌴🌷అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో అతి కష్టంమీద పడవ నడుపుతున్నాడు నావికుడు. ఒడ్డుకు దగ్గర పడుతున్నాడు. అప్పటివరకు ఎంతో జాగ్రత్తగా, నేర్పుగా నావ నడిపిన ఆ వ్యక్తి ఒక్క క్షణం ఏమరుపాటుగా ఉన్నాడు. అంతే! ఆ నావ తలకిందులైంది. అతడు సముద్రంలో కొట్టుకుపోయాడు. మానవ జీవనయాత్ర కూడా సముద్ర ప్రయాణం వంటిదే. ప్రతి అడుగులోనూ జాగ్రత్త వహించాలి. జీవితమంతా నియమ నిష్ఠలతో గడిపి, ఎప్పుడో ఒకసారి ఏమాత్రం అలసత్వం వహించినా, క్షణకాలం మాయకు లోనైనా... వ్యక్తి అంతవరకు పడిన శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది.
🌻గొడ్డలి భుజాన పెట్టుకొని ఒక వ్యక్తి చెట్లు కొట్టడానికి వస్తున్నాడు. ఒక చెట్టు అతణ్ని చూసి గజగజ వణికిపోయింది. పక్కన ఉన్న చెట్టుతో ‘మిత్రమా, చూశావా వాణ్ని... గొడ్డలితో మనల్ని నరికి చంపడానికి యముడిలా ఎలా వస్తున్నాడో!’ అన్నది భయంతో. అప్పుడు రెండో చెట్టు ‘ఆ పదునైన ఇనుప గొడ్డలికి ఆధారం ఒక కొయ్యముక్క. దాన్ని గొడ్డలికి తగిలించి, వాడు మనల్ని చంపుతున్నాడు. ఆ కొయ్య ముక్క మనలో పుట్టిందే. అంటే, బయటి శత్రువు కంటే అంతర్గత శత్రువు అతి ప్రమాదకరం... అదే ఈ యముడికి పట్టుగొమ్మ’ అంది.
🌻బయట పొంచి ఉన్న శత్రువులకు మనవాళ్ళే దారి చూపడం చరిత్రలో కొత్త విషయమేమీ కాదు. దీన్ని గ్రహించి, అంతర్గత శత్రువుల విషయంలో జాగరూకత వహించక తప్పదు. ఏదైనా సాధించాలంటే ప్రయత్నం అవసరం. అప్రయత్నంగా సిద్ధించేదాన్ని అదృష్టమంటాం. ఇది అందరికీ అన్ని వేళలా రాదు. ముఖ్యంగా మనం ఆదర్శంగా భావించేవారందరూ బృహత్ ప్రయత్నాలతోనే అనుకున్నవి సాధించారు. ప్రలోభాలకు లోనుకాకుండా, ఆటంకాలకు జడవకుండా, భారతీయ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటి వచ్చిన స్వామి వివేకానంద మనందరికీ సదా స్మరణీయుడు.
🌻ఎన్నిసార్లు ఎన్ని విఘ్నాలు ఎదురైనా, ధీరులు తాము తలపెట్టిన పనిని వదిలిపెట్టరు. భగీరథుడు తన పూర్వులకు ఉత్తమ గతులు కలిగించాలనుకున్నాడు. గంగ స్పర్శ వారి అస్థికలకు తగిలితేనే అది సాధ్యపడుతుంది. అందుకే అతడు గంగను ప్రార్థించాడు. ఆమె ప్రత్యక్షమయ్యాక, తన వెంట భూమిపైకి రమ్మని ప్రార్థించాడు. తాను ఆకాశం నుంచి సరాసరి కిందకు పడితే భూమి భరించలేదు కాబట్టి, శివుణ్ని ప్రార్థించమని చెప్పింది గంగ. శివుడి గురించి భగీరథుడు తపస్సు చేశాడు. ఆ ప్రార్థన ఆలకించి వచ్చిన ఆయన, గంగను తన శిరస్సుపై మోయడానికి అంగీకరించాడు. ఆమె అక్కడి నుంచి భూమిమీదకు ప్రవహించింది.
🌻గంగను భగీరథుడు తన పూర్వులు భస్మమై పడి ఉన్న చోటుకు వెంటబెట్టుకొని పయనమయ్యాడు. ప్రవాహవేగం వల్ల, దారిలో ఉన్న జహ్నుముని యాగస్థలం కొట్టుకుపోయింది. అతడు కోపించి, గంగను పుక్కిట పట్టాడు. మునిని ప్రార్థించిన భగీరథుడు, చివరికి గంగను విడిపించాడు. పట్టు వదలకుండా గంగను వెంటపెట్టుకుని వెళ్ళి తన పూర్వులకు సద్గతులు కలిగించాడు. సత్ప్రయత్నాలు చేసేవారికి ఆయన ఒక గొప్ప ఆదర్శం.
🌻కన్యాకుమారిలో నేడు వివేకానంద శిలా స్మారక మందిరం అందరికీ నేత్రానందం కలిగిస్తోంది. దీని నిర్మాణానికి ఏకనాథ్‌జీ చేసిన కృషి భగీరథ ప్రయత్నమే! ప్రతి వ్యక్తీ ఒక దైవరూపమే అనే విశ్వాసం ఆయనకు అతీత మానవ బలాన్ని కలిగించింది. నాటి ప్రధాని నెహ్రూ కన్యాకుమారి శిలపై వివేకానందుడి విగ్రహ స్థాపనకు అంగీకారం ప్రకటించారు.
🌻ఒకప్పుడు ఆ శిలపై కూర్చొనే స్వామి వివేకానంద- భారతదేశం గురించి ధ్యానం చేసేవారు. 1970లో అక్కడే ఆయన శిలాస్మారకం ఆవిష్కృతమైంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మూడు స్ఫూర్తిదాయక ప్రదర్శనలు నిత్యమూ వేలాది వీక్షకులకు కనువిందు చేస్తున్నాయి. ఏ పలుకుబడీ పదవీ లేని ఒక సామాన్య వ్యక్తి సత్ ప్రయత్నం ఫలితంగా వెలసిన కన్యాకుమారిలోని వివేకానంద శిలాస్మారక నిర్మాణం- అఖిల మానవాళికీ ఒక దివ్య సందేశం!
-
No comments:
Post a Comment