శీర్షిక:" పిపిలిక స్ఫూర్తి"
(ఇది నా స్వీయ రచన,. ఇది ఏ ఇతర రచనకు అనువాదం కానీ, అనుసరణ కానీ కాదు)
విష్ణు హాస్పిటల్ కి వెళ్ళటానికి తయారవుతున్నాడు.. స్నానం చేసి, షార్ట్ వేసుకుని, బ్రేక్ఫాస్ట్ చేసాక,రెడీ అయి వెళ్ళిపోతాడు. రేఖ అతన్నే చూస్తున్నది.
" ఏవన్నా చెప్పాలా నాతో" సౌమ్యంగా అడిగాడు.
"మీరు మీ మదర్ కి పదివేలు పంపారా ఈ నెల?" ఆ ప్రశ్న నిలదీస్తున్నట్టుగా వుంది.
" ఏం, పంపకూడదా" చిరాగ్గా అడిగాడు.
"ఆవిడకు మీ నాన్న పెన్షన్ వస్తుంది, సొంత ఇల్లు వుంది, పదివేలు దేనికి ఒక్క మనిషికి?
"ఇవ్వాళ్ళ కొత్తగా పంపిందేమీ లేదు, ప్రతి నెలా అలాగే పంపుతున్నాను' నిర్లక్షం గా జవాబిచ్చాడు.
"నా కివ్వాళ్ళే తెలిసింది"
నా ఫోన్ చెక్ చేసావా?
" అవును, తప్పా"
"తప్పుడు పనులు నేనెప్పుడూ చేయను,అడిగితే నేనే చెప్పేవాడిని, మరో విషయం, ఇంకెప్పుడూ నన్ను నా వాళ్లకు ఎంత పంపుతున్నావని కానీ, ఎంత ఖర్చు పెడుతున్నావని కానీ అడగవద్దు "కఠినంగా అన్నాడు.
"అవును, మీ అక్క, చెల్లెళ్ళ పెళ్లి ఖర్చు అంతా మా డాడీ భరించాడు, ,అదన్నా గుర్తుందా? ఇప్పుడు మీరు సక్సెస్ ఫుల్ డాక్టర్ గా పేరు వచ్చిందంటే, సెంటర్ లో మా నాన్న బిల్డింగ్ ఇవ్వటం వల్లే కదా, పోనీ ఆ సంగతైనా గుర్తుందా " విసురుగా అన్నది.
నిరసనగా నవ్వాడు విష్ణు, " నువ్వు అనుక్షణం గుర్తు చేస్తూనే వున్నావు కదా, ఎలా మర్చిపోతాను? కానీ నువ్వు ఒక్కటి తెలుసుకో, నువ్వు జస్ట్ పోస్టుగ్రాడ్యుయేట్ వి, అయినా ఇష్టపడి చేసుకున్నాను. జనం నా MD డిగ్రీ చూసి, డాక్టర్ గా నా ప్రతిభ చూసి వస్తున్నారు, మీ బిల్డింగ్ చూసి కాదు, నాలుగేళ్ల నా ఆదాయం, మీరే తీసుకుంటున్నారు కదా, వస్తా" అంటూ ఆమెకు మరోమాటకు తావివ్వకుండా రెడీ అయి, బయటకు వెళ్ళిపోయాడు.
అతను టిఫిన్ తినకుండా వెళ్లిపోయాడని కంట నీరు తిరిగింది రేఖకు.
.
వెంటనే తల్లికి ఫోన్ చేసింది,తల్లి వసుంధర , " నువ్వేమీ భాధ పడకు, లంచ్ కి వస్తాడులే, ఎన్ని రోజులు అలుగుతాడో చూద్దాము. ఇంకొక విషయం, ఈ మధ్య పేషేంట్స్ ని మన మెడికల్ షాప్ లో మందులు తీసుకోమని చెప్పటం లేదట " అన్నది కోపంగా.
రేఖ మాట్లాడలేదు, ఆలోచిస్తున్నది.
***
ఇంటినుండి బయల్దేరిన విష్ణు నెమ్మదిగా కారు పొనిస్తున్నాడు.. చాలా తొందరగా బయలుదేరాడు ఇవ్వాళ, అందుకని.
దారిలో అతనికొక దృశ్యం కనబడింది.ఇద్దరు మనుషులు,ఒక స్త్రీ, ఒక పురుషుడు, గుమ్మటాలలా వున్నారు. అది తొక్కే రిక్షా కాదు, బండిలా లాక్కుని పోయేది. చిన్న, చిన్న గున్న ఏనుగుల్లా వున్న ఆ ఇద్దరినీ ఒక అమ్మాయి పళ్ళబిగువున లాక్కుపోతోంది. అటువంటి రిక్షాలు ఇప్పుడు చాలా అవుట్ డేటెడ్., అక్కడక్కడా మాత్రమే వూళ్ళో దర్శనమిస్తున్నాయి. ఆ అమ్మాయికి 14 ఏళ్ళ లోపే ఉంటుంది వయసు, చెమటతో మలినమైన బట్టలు,శరీరం. వాళ్ళని దాటిపోతూ అనుకున్నాడు, ఒక ఆడపిల్ల ఎంత కష్టానికి ఓర్చుకుని అంత శ్రమ పడుతుంది అంటే, ఆమె కుటుంబ పరిస్థితులు ఎటువంటివో! అనుకుంటూ ముందుకెళ్లాడు.
అతను తన హాస్పిటల్ కి వెళ్లేసరికి, ఇంకా డస్టింగ్ పూర్తి కాలేదు, బయట వున్నఅరుగు మీద నుంచున్నాడు విష్ణు..
విచిత్రంగా ఆ అమ్మాయి ఆ రిక్షాని లాక్కుంటూ అతని హాస్పిటల్ ముందు ఆపింది. ఆ జంట ప్రయాసపడుతూ రిక్షా దిగారు, అతను ఆ అమ్మాయి చేతిలో యాభై నోటు పెట్టాడు.
" చిల్లర లేదు సర్, రెండు రూపాయలు తక్కువున్నాయి." అన్నదామ్మాయి.
"అబ్బా, చిల్లర లేదు అంటే కుదరదమ్మాయి, వేషాలొద్దు, పాతికకి మాట్లాడాము, తిరిగి పాతిక ఎక్కడైనా మార్చి, ఇవ్వు"అన్నాడతను.
"నా దగ్గిర చిల్లర లేదు సర్, పోనీ మీ దగ్గిర ఇరవై ఉన్నదేమో చూడండి, అదే ఇవ్వండి" అన్నది.
ఇరవై ఇచ్చి ,అయిదు రూపాయలు మిగుల్చుకున్నానన్న వెర్రి ఆనందం అతని మోహంలో కనబడింది విష్ణుకి.
దుర్బల దేహంతో వున్న ఆ అమ్మాయి ఆ డబ్బు తీసుకుని వెళ్ళిపోయింది.
***
ఆజంట లోపలికి వచ్చారు, ఇద్దరికీ, బీపీ, షుగర్ వున్నాయి, ఆ బీదపిల్ల దగ్గిర అయిదు రూపాయలు మిగుల్చుకోగలిగారు కానీ, చాలా రకాల టెస్టులు చేయించుకోవాల్సి వచ్చింది. వందల్లో ఖర్చు, లోలోపల నవ్వు కున్నాడు విష్ణు.
వారం రోజుల తర్వాత ఆ అమ్మాయిని మళ్ళీ చూసాడు విష్ణు. ఈసారి ఆమె తల్లిని తీసుకుని హాస్పిటల్ కి వచ్చింది. ఆమె తల్లికి కాలు పై భాగం నుండి నరాలు లాగేస్తున్నాయని, నిలబడలేక పోతున్నానని, కాళ్ళు తిమ్మిర్లు పట్టి, నిలుచున్నప్పుడు ఒక ప్రక్కకు లాగేస్తున్నదనీ ఏ పనీ చేయలేక పోతున్నానని చెప్పింది.పరీక్ష చేసే టేబుల్ కూడా ఎక్కలేక పోయింది. ఇద్దరు మేల్ నర్సులు వచ్చి సాయం పట్టి ఎక్కించారు.
ఆమెపేరు రామలక్ష్మి. కూతురి పేరు సీత. తండ్రి సిమెంట్ షాప్ లో బస్తాలు మోసి, సప్లై చేసే వుద్యోగం, ఆరునెలల క్రితం ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోయాడు. తల్లి కి నరాల నొప్పి, పిల్ల పై కుటుంబ భారం పడింది,ఒక తమ్ముడున్నాడు, ప్రభుత్వ స్కూల్ లో 5వ క్లాస్ చదువుతున్నాడు, సీత ఎనిమిది వరకే చదివింది.ఆ తర్వాత స్కూల్ కి వెళ్లే యోగం లేదు.
విష్ణు కి హృదయం ద్రవించింది, మందులు రాసి, నర్స్ ని పిలిచి మెడికల్ షాప్ నుండి తెప్పించి, తన దగ్గిరవున్న శాంపిల్ మందులు బలానికి టానిక్ ఇచ్చి, ఫీజు వాపస్ చేసాడు. మళ్ళీ పది రోజులకు రమ్మని చెప్పాడు.
సీతకు దుఃఖం ఆగలేదు, వంగి అతని పాదాలు పట్టుకుంది, విష్ణు ఆమెని వారిస్తూ," వెళ్ళండి, మందులు జాగ్రత్తగా వాడండి, మీ అమ్మకు తగ్గిపోతుంది, భయపడకు" అని సీతకు చెప్పి పంపించేశాడు.
***
సీతని చూసినప్పటినుండి విష్ణు మనసులో లో వ్యధా భరిత తరంగాలు ఉవ్వెత్తున ఎగిసి, అతని హృదయాన్ని వేదనాభరితం చేస్తున్నాయి. తల్లి శ్రీలక్ష్మి గుర్తుకు వస్తోంది. అమ్మ తన ఇంటికి ఎప్పుడో కానీ రాదు. వచ్చినా ఫ్రీగా ఉండలేక వెళ్ళిపోతుంది.
సీత 14 ఏళ్ళు కూడా లేని బాలిక, తండ్రి లేడు, తల్లి పనికి వెళ్ళలేదు, తమ్ముడిని చదివించాలి , ఇప్పుడున్న సామాజిక పరిస్థులలో ఆ పిల్లకు ఎటువంటి భద్రత లేదు, శరీరం లో శక్తీ లేదు, డబ్బు లేదు, అయినా కష్టాలకు భయపడకుండా ఎదురీదుతోంది. ఎక్కడో చదివాడు, చీమలు తమ శక్తికి 50 రెట్ల ఎక్కువ బరువు మోస్తాయట. సీత అటువంటిదే, దుర్బలమైన ఆ శరీరం లో చాలినంత శక్తీ లేకపోయినా ఒక "పిపిలికం" లా కుటుంబ బరువు మోస్తున్నది.
తాను దేనికి భయపడుతున్నాడు? రోజుకి వేలు సంపాదిస్తున్నాడు, అమ్మకు డబ్బు పంపితే సరిపోతుందని తాను అనుకోలేదు, కానీ మనసులో ఏదో ఇరుకు. అక్కనీ చెల్లినీపండక్కి పిలిచినా వాళ్ళు స్వేచ్ఛగా రాలేక పోతున్నారు, వచ్చినా తన ఇంట్లో ఇమడలేక పోతున్నారు. రేఖ మనసు మంచిదే, తొందరపడి మాట్లాడుతుంది కానీ, తాను సీరియస్ అయితే తగ్గిపోతుంది. ఆమెపై తల్లి మాటల ప్రభావమెక్కువ. .అన్ని విషయాలు తల్లితో చెబుతుంది, ఆమె చెప్పినట్టు చేయబోతుంది. తాను ప్రేమగా దగ్గరికి తీసి, అనునయిస్తే కరిగిపోయి, అన్నీ మర్చిపోతుంది.
రేఖ పేరెంట్స్ దగ్గిరలోనే వుంటారు. పెద్ద కాంపౌండ్ లో అంతకు ముందు కట్టిన రెండు బెడ్ రూమ్ ఇల్లు ఒకటి, దాని ప్రక్కనే మూడు గదుల పోర్షన్ ఒకటి వున్నది. రేఖని సంప్రదించకుండానే, ఆ ఇంట్లో రెంట్ కి ఉన్నవాళ్ళని ఒక నెలలో ఖాళీ చేయమని చెప్పాడు.
రేఖ కి విషయం తెలిసి, అతనిని నిలదీసింది.
విష్ణు "అవును, చెప్పాను, ఖాళీ అవగానే రిపేర్లు చేయించి, అమ్మని తీసుకొస్తాను. ప్రక్క చిన్న పోర్షన్ లో ఒక ఫామిలీ ని అమ్మకు తోడుగావుంచుతున్నాను." అన్నాడు కూల్ గా .
రేఖ కోపం తో బుసలు కొట్టింది, " ఈ ఆస్తి మా డాడీ నాకిచ్చింది. ఆ రెండు ఇళ్ల మీద నాకు పదిహేను వేలు రెంట్ వస్తుంది, మీ ఇష్టమేనా అంతా" అన్నది.
"ఇప్పటికే లేట్ చేసాను రేఖా, నేను ఉండి కూడా అమ్మని దూరంగా, ఒంటరిగా వుంచుతున్నాను. ఇంత పేరున్న డాక్టర్ని అయి ఉండికూడా, అమ్మకు సంతోషించే అవకాశం లేకుండా చేసాను. " ఆ రెంట్ నీకు నేను పే చేస్తాను, అలా కాదనుకుంటే, అమ్మకు వేరే ఇల్లు చూస్తాను, ఉదయం, సాయంత్రం నీ దగ్గిర వుంటాను, లంచ్ అమ్మ దగ్గిర చేస్తాను, ఇంతకు మించి నేను వేరే ఏమీ చేయలేను, అమ్మనిక అక్కడ ఒంటరిగా వుంచను, ఛాయస్ నీది, ఆలోచించి చెప్పు" అన్నాడు.
అతని గొంతులోని స్థిర నిశ్చయాన్ని గుర్తించింది రేఖ. భర్త చాలా సౌమ్యుడు, నిదానస్తుడు, అలాంటివాడు ఇప్పుడిలా నిర్ణయం తీసుకున్నాడంటే ఇంక అతని నిశ్చయానికి తిరుగుండదని అర్ధమయ్యింది ఆమెకు..
" ఆలోచించేదేముంది లెండి, మీ ఇష్టమే కానీయండి" అన్నది తగ్గిపోయి.
నవ్వుతూ భార్యని దగ్గరకు తీసుకున్నాడు విష్ణు.
***
యుద్ధ ప్రాతిపదికిన ఇల్లు తల్లికి ఏ కష్టం లేకుండా అన్ని ఆధునిక సౌకర్యాలు ఏర్పరిచాడు. అమ్మ కోసం సీత ఫామిలీ ని షిఫ్ట్ చేసి, సీతని బళ్ళో చేర్చాడు. నెలకు పదివేలు వాళ్ళ కుటుంబ ఖర్చుకి ఇచ్చేలా మాట్లాడాడు.రామలక్ష్మి ఇప్పుడు బాగానే కోలుకుంది.విష్ణు తన నిర్ణయం చెప్పగానే రెండు చేతులెత్తి నమస్కారం చేసింది.
వూళ్ళో వున్న తన మూడుగదు ల ఇంటిని చిన్ననాటి స్నేహితుడు, సన్నకారు రైతు అయిన రాఘవ కి సామాను తో సహా , అద్దె లేకుండా ఉండేలా ఏర్పాటు చేసాడు.అక్క చెల్లెలిని వాళ్ళ కుటుంబం తో సహా పిలిచి , వ్రతం చేసుకుని, వాళ్ళని గౌరవంగా మర్యాద చేసి పంపాడు. రేఖ, విష్ణు తన స్పేస్ తనకు ఇచ్చి, తల్లికి ఇవ్వాల్సిన స్పేస్ తల్లికి ఇచ్చాడు. ఇప్పుడు అతని నిర్ణయాన్ని వ్యతిరేకించి జీవితం లో ఘర్షణ పెంచుకోదలచుకోలేదు. అందుకే మనసులో వ్యతిరేక భావనలు లేకుండా, సంతోషంగా అందరితో కలిసిపోయింది.
(సమాప్తం) - Bellamkonda Bhavanikumari gari Rachana
No comments:
Post a Comment